కరోనా వ్యాక్సీన్ మరికొన్ని వారాల్లోనే సిద్ధం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు చర్యలు - ప్రధాని మోదీ - Newsreel

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, BJP @Twitter

ప్రచురణ

కరోనా వ్యాక్సీన్ గురించి ఎక్కువ కాలం వేచి ఉండక్కర్లేదని, కొన్ని వారాల్లోనే వ్యాక్సీన్ సిద్ధం కాబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

దిల్లీ నుంచీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘నిపుణులు పచ్చ జెండా ఊపగానే టీకా వేసే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పటికే భారత్‌కు పెద్ద యెత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు నిర్వహించిన చేపట్టిన అనుభవం ఉంది. వ్యాక్సీన్లను నిల్వ ఉంచడానికి అవసరమైన కోల్డ్ స్టోరేజ్‌ల గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వ్యాక్సీన్‌కు సంబంధించిన రియల్ టైమ్ డేటాను సేకరించడానికి అవసరమైన ఒక సాఫ్ట్‌వేర్ కూడా తయారుచేయనున్నారు.

కరోనా వ్యాక్సీన్ గురించి నేను నిపుణులతో, శాస్త్రవేత్తలతో చర్చించాను. తక్కువ ఖర్చుతో కూడిన, సురక్షితమైన వ్యాక్సీన్ కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని, భారత్‌ నుంచి అలాంటి వ్యాక్సీన్ వస్తుందన్న ఆశావహ దృక్పథంతో ఆయా దేశాలు ఉన్నాయని వారు తెలిపారు.

వ్యాక్సీన్ ధర గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నాం. ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఈ అంశంపై ఒక నిర్ణయానికొస్తాం.

ఎవరికి ముందు వ్యాక్సీన్ వేయాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నాం. మొట్టమొదట హెల్త్‌కేర్ వర్కర్లకూ, కరోనా రోగుల చికిత్సలో నిమగ్నమైనవారికీ, వృద్ధులకు టీకా వేస్తాం" అని మోదీ తెలిపారు.

టైమ్ 'కిడ్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ గ్రహీత గీతాంజలి రావు
ఫొటో క్యాప్షన్, టైమ్ 'కిడ్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ గ్రహీత గీతాంజలి రావు

గీతాంజలి రావు: ప్రపంచ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం అంటున్న టైమ్ 'కిడ్ ఆఫ్ ది ఇయర్'

ప్రతీ ఏడాదీ టైం మ్యాగజీన్ "పర్సన్ ఆఫ్ ది ఇయర్" అవార్డ్ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఏడాది తొలిసారిగా "కిడ్ ఆఫ్ ది ఇయర్" అవార్డ్‌ను ప్రకటించింది.

యువ శాస్త్రవేత్త 15 ఏళ్ల గీతాంజలి రావుకు 2020 కిడ్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం లభించింది. దాదాపు 5,000 నామినీలలో గీతాంజలి రావుని ఈ టైటిల్‌కు ఎంపిక చేసారు.

ప్రపంచ సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనే దిశలో అనేకమందికి ప్రేరణగా నిలవడమే లక్ష్యమని గీతాంజలి రావు అంటున్నారు.

15 ఏళ్ల గీతాంజలి రావు..తాగునీటిలో సీసాన్ని గుర్తించగల పరికరం, సైబర్‌బుల్లీయింగ్‌ను గుర్తించడానికి ఉపయోగపడే యాప్‌లతో సహా పలు టెక్నాలజీలను కనిపెట్టారు.

"నేను చెయ్యగలిగితే, మీరూ చెయ్యగలరు, ఎవరైనా చెయ్యగలరు" అని ఆమె అంటున్నారు.

టైమ్ మ్యాగజీన్‌కోసం హాలీవుడ్ నటి, మానవతావాది ఏంజెలీనా జోలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో "నేను టిపికల్ శాస్త్రవేత్తల్లాగా కనిపించను" అని గీతాంజలి అన్నారు.

"సాధారణంగా శాస్త్రవేత్తలనగానే వయసు పైబడిన తెల్లజాతీయులే టీవీల్లో కనిపిస్తుంటారు. శాస్త్రవేత్తలంటే అలాగే ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ నేను అలా కనిపించను" అని ఆమె వివరించారు.

"సొంతంగా పరికరాలను కనిపెట్టడమే కాకుండా మరింతమందికి ఈ దిశగా ప్రేరణనివ్వడమే నా లక్ష్యం. నా వ్యక్తిగత అనుభవంనుంచీ చెప్తున్న మాటలివి...చుట్టూ నాలాంటివారు నలుగురు లేకపోతే నెగ్గుకురావడం అంత సులభం కాదు.

మా తరం ఇంతకుమునుపెన్నడూ చూడని అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వాటితో పాటూ పాత సమస్యలు ఉండనే ఉన్నాయి. అన్ని సమస్యలకూ పరిష్కార మార్గాలు అన్వేషించాలి.

ఇప్పుడు చూడండి..కొత్తగా ఈ కరోనా సమస్య వచ్చి పడింది. అంతకుముందునుంచీ ఉన్న మానవ హక్కుల సమస్యలకు ఇంకా పూర్తి పరిష్కారాలు లభించనేలేదు.

మరోవైపు, మేము సృష్టించని సమస్యలు...సాంకేతిక అభివృద్ధి కారణంగా తలెత్తుతున్న సమస్యలు...వాతావరణ మార్పులు, సైబర్‌బుల్లీయింగ్‌లాటివాటికీ పరిష్కారాలు కనిపెట్టాలి" అని గీతాంజలి అంటున్నారు.

టైమ్ అవార్డ్ ఆమెకు లభించిన తాజా పురస్కారం కాగా అంతకుమునుపు..నీళ్లల్లో సీసం జాడలను గుర్తించేందుకు ఉపయోగపడే చౌకైన పరికరాన్ని కనిపెట్టినందుకుగానూ ఆమెకు "అమెరికా టాప్ యంగ్ సైంటిస్ట్" అవార్డ్ లభించింది.

1921 నుంచీ టైమ్ మ్యాగజీన్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను ప్రకటించడం ప్రారంభించింది. తరువాతి కాలంలో ఈ పురస్కారానికి “పర్సన్ ఆఫ్ ది ఇయర్" అని పేరు మార్చారు.

గత ఏడాది ఈ అవార్డ్ అందుకున్న స్వీడన్ బాలిక, 19 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్ ఇప్పటివరకూ ఈ పురస్కారానికి ఎంపికైనవారిలో పిన్న వయస్కురాలు.

"కిడ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అమెరికాలోని యువతరం నాయకులకు కొలమానం" అని టైమ్ పేర్కొంది.

2020 సంవత్సరానికిగానూ టైమ్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్‌ను వచ్చే వారం ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)