'వైఎస్ జగన్ ఆ లేఖ రాసిన సమయం 'అనుమానాస్పదమే' -అటార్నీ జనరల్ : ప్రెస్ రివ్యూ

జగన్

ఫొటో సోర్స్, Facebook/Andhra Pradesh CM

ప్రచురణ

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు అజయ్ కల్లాంపై కోర్టు ధిక్కరణ నేరం కింద చర్యలు తీసుకోవాలనే అభ్యర్థనను అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ నిరాకరించారని 'ది హిందూ' పత్రిక రిపోర్ట్ చేసింది. అయితే, జగన్ ఆ లేఖ రాసిన సమయం 'అనుమానాస్పదంగా' ఉందని ఆయన అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు జడ్జి ఎన్ వి రమణ పై అవినీతి ఆరోపణలు చేస్తూ జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి, ఆ లేఖను మీడియాకు బహిరంగం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ వీరిద్దరికీ కోర్టు ధిక్కారణ కింద చర్యలు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిష‌న్‌కు అటార్నీ జనరల్ బదులిస్తూ జగన్ లేఖను బహిరంగం చేసిన సమయం అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధుల పై కోర్టులో పెండింగ్ ఉన్న కేసులన్నిటినీ సత్వరమే విచారణ చేపట్టి వాటిని తేల్చాలని సెప్టెంబరు 16 వ తేదీన జస్టిస్ రమణ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజులకే జగన్ ఈ లేఖను రాయడం పట్ల అనుమానాలు అయితే వెల్లువెత్తుతున్నాయని వేణు గోపాల్ వ్యాఖ్యానించారు. జగన్ పై విచారణలో 31 కేసులు ఉన్నాయన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ నేపథ్యంలో ఈ లేఖ రాసిన వ్యక్తుల ప్రవర్తన వివాదాస్పదంగానే ఉంది అని ఆయన అన్నారు. ఈ లేఖ నేరుగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గరకు వెళ్లడం వలన అందులో పేర్కొన్న ఆరోపణల గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉందని, ఈ అంశం పై తాను జోక్యం చేసుకోవడం సరి కాదని అభిప్రాయపడ్డారు. కోర్టులలో సుదీర్ఘ కాలం నుంచి ప్రజా ప్రతినిధుల పై పెండింగులో ఉన్న కేసులు, రాజకీయ నేరాలకు సంబంధించిన కేసులను సత్వరమే తేల్చాలని ఉపాధ్యాయ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ని అనుసరించి ఈ కేసులను తేల్చేందుకు ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసారు. ఈ వ్యవహారాలను జస్టిస్ రమణ నేతృత్వంలోని బెంచ్ పర్యవేక్షిస్తోంది.

బ్రహ్మ వజ్ర కమలం

ఫొటో సోర్స్, TheDivine7801.com

ఏడు వేల వజ్రాలతో చేసిన బ్రహ్మ వజ్ర కమలం వేలం

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి ఇటీవలే ఓ ఉంగరంలో అత్యధిక వజ్రాలను పొదిగినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందేనని, ఆ బ్రహ్మ వజ్ర కమలం ఉంగరాన్ని ఇప్పుడు ఆన్‌లైన్లో వేలం వేయబోతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తను ప్రచురించింది.

సహజమైన 7,801 వజ్రాలను పొదిగి చేసిన ఈ ఉంగరం రిజర్వు ధరను బిడ్డర్ల కోసం 78.01 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. వేలం కోసం ఈ నెల 13 నుంచి 22 వరకు దీన్ని ఆన్‌లైన్లో ప్రదర్శిస్తారు. సోమవారం నుంచి బిడ్డింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. వేలంలో పాల్గొనదలచిన వారు www.thedivine7801.com వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.

వేలంలో పలికిన ధరలో 10 శాతాన్ని పీఎం కేర్ ఫండ్‌కు ఇస్తానని ఆ వ్యాపారి తెలిపారని ఆంధ్రజ్యోతి కథనం వివరించింది.

క్రాంతి కిరణ్

ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడి

దుబ్బాకలో ఓటమి తప్పదన్న నిస్పృహలో ఉన్న బీజేపీ నేతలు సిద్ధిపేటలో వీరంగం సృష్టించారని, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణపై దాడి చేశారని నమస్తే తెలంగాణ రాసింది.

దుబ్బాక పోలింగ్‌కు కొన్ని గంటల సమయం ఉండగా బీజేపీ కార్యకర్తలు దళిత ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై దాడికి పాల్పడ్డారని, ఆయన వెంట ఉన్న మరో దళిత నేత, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపైనా విరుచుకుపడ్డారని ఈ కథనంలో రాశారు. ఈ దాడి బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఖండించారు.

సిద్ధిపేట ఏసీపీ విశ్వప్రసాద్ పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని క్రాంతికిరణ్ వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తాను గదిలో ఉండగానే బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పత్ర శ్రీనివాస్‌ తదితరులు దాడి చేశారని క్రాంతి వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశ్వప్రసాద్ చెప్పారని ఈ వార్తలో వివరించారు.

ఎర్ర చందనం

ఎర్ర చందనం హైజాక్ గ్యాంగులు... రోడ్డు ప్రమాదంలో అయిదుగురి సజీవ దహనం

తమిళనాడు స్మగ్లర్లు ఎర్ర చందనాన్ని తరలించే సమయాలను తెలుసుకుని, వారిని వెంబడించి దుంగల్ని దోచుకునే లక్ష్యంతో ఇటీవల హైజాక్ గ్యాంగులు పుట్టుకొస్తున్నాయని, శేషాచలం అడవి నుంచి కొల్లగొట్టిన వృక్ష సంపదతో బయలుదేరిన వాహనాన్ని అలాంటి ఒక గ్యాంగ్ వెంటాడడంతో భారీ ప్రమాదం జరిగి అయిదుగురు సజీవ దహనం అయ్యారని ఈనాడు పత్రిక ఒక వార్తను ప్రచురించింది.

స్మగ్లర్ల నుంచి దుంగల్న దోచుకోవడమే లక్ష్యంగా హైజాక్ గ్యాంగ్ వెంబడించింది. దాంతో, స్మగ్లర్లు తమను పోలీసులు వెంబడిస్తున్నారనే భయంతో మరింత వేగం పెంచారు. దారి పొడవునా తప్పించుకోవడానికి ఒకరు, పట్టుకోవడానికి ఒకరు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంల కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు వద్ద సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప - తాడిపత్రి రహదారిపై మలుపు తిరుగుతున్న టిప్పరును కడప వైపు నుంచి దుంగలతో వస్తున్న స్కార్పియో ఢీకొట్టింది. డీజిటల్ ట్యాంకుకు నిప్పంటుకోగా భారీ మంటలు చెలరేగాయి. స్కార్పియోను వేగంగా వెంబడిస్తున్న కారు ఆ మంటల్లోకి దూసుకెళ్లింది. ఈ మూడు వాహనాలు పూర్తిగా ధగ్ధమయ్యాయి. స్కార్పియోలో ఎనిమిది మంది ఉండగా నలుగురు అక్కడికక్కడే సజీవంగా దహనమయ్యారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారని ఈ వార్తలో రాశారు. మిగతా వారు పరారయ్యారని, వారి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదని తెలిపారు.

మద్యం దుకాణాలు

ఫొటో సోర్స్, Getty Images

మద్యపాన నియంత్రణకు స్వయం సహాయక మహిళా సంఘాలు

మద్యపాన నియంత్రణలో స్వయం సహాయక సంఘాల మహిళలు భాగస్వాములు కానున్నారని సాక్షి దిన పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మద్య విమోచన ప్రచార కమిటీ ఓ కార్యాచరణ రూపొందించిందని ఈ కథనంలో తెలిపారు.

రాష్ట్రంలోని సుమారు 90 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు మద్య నియంత్రణను ఉద్యమంలా చేపట్టనున్నారు. 'మద్యం వద్దు, కుటుంబం ముద్దు' అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డి, సెర్ప్ సీఈఓ రాజబాబు ఇటీవల సమావేశమై మద్యం వల్ల కలిగే దుష్ప్రచారాలను స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రచారం చేయించాలని నిర్ణయించారని ఈ కథనంలో వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)