వియన్నాలో ఉగ్రవాదుల దాడి.... పలుచోట్ల కాల్పులు

వియన్నాలో ఘటనా స్థలంలో పోలీసులు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వియన్నాలో ఘటనా స్థలంలో పోలీసులు
ప్రచురణ

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆరు చోట్ల దుండగులు తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పులలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని, మరికొందరు గాయపడ్డారని వియన్నా పోలీసులు తెలిపారు.

ఆస్ట్రియా చాన్స్‌లర్ సెబాస్టియన్ కుర్జ్ ఈ ఘటనను "హేయమైన ఉగ్రవాద దాడి"గా పేర్కొన్నారు. కాల్పులు జరిపినవారిలో ఒకరు మరణించినట్లుగా తెలిపారు. మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

ఈ కాల్పుల్లో 15 మంది గాయపడ్డారని, వారిలో ఏడుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు నగర మేయర్ తెలిపారు. గాయపడినవారిలో ఒక పోలీస్ అధికారి కూడా ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

వియన్నాలోని యూదుల ప్రధాన ప్రార్థనా స్థలం సమీపంలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఈ ప్రార్థన మందిరాన్నే లక్ష్యంగా చేసుకున్నారా అనేది స్పష్టంగా తెలియలేదు.

పెరుగుతున్న కరోనాకేసులను కట్టడి చెయ్యడానికి ఆస్ట్రియాలో దేశవ్యాప్తంగా విధించిన కొత్త ఆంక్షలు అమలు కావడానికి కొన్ని గంటలముందు ఈ కాల్పులు జరిగాయి. బార్లు, రెస్టారెంట్లు నవంబర్ చివరివరకూ మూసివెయ్యాలని కొత్త నిబంధనలు విధించారు.

వియన్నాలో వీధులపై పోలీసుల గస్తీ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వియన్నాలో వీధులపై పోలీసుల గస్తీ

వియన్నాలోని యూదుల ప్రధాన ప్రార్థనా మందిరం స్టైటెన్‌స్టెటెన్‌గాస్ వద్ద స్థానిక సమయం రాత్రి ఎనిమిది గంటలకు ఈ కాల్పులు జరిగాయి. ఆ సమయంలో మందిరం మూసివేసి ఉందని యూదుల కమ్యూనిటీ లీడర్ ఆస్కర్ డాయిచ్ తెలిపారు.

కాల్పులు మొదలవగానే అక్కడి ప్రజలు వీధుల్లో పరుగులు తీసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు తెలుపుతున్నాయి.

ఈ దాడి తరువాత, ఆ ప్రాంతంలో తిరగొద్దని, ప్రభుత్వ రవాణా వాహనాలనువినియోగించొద్దని పోలీసులు ప్రజలను కోరారు. నగరంలో పలుచోట్ల దారులు మూసివేసారు.

ఆస్ట్రియాకు పొరుగు దేశమైన చెక్ రిపబ్లిక్ సరిహద్దుల్లో కూడా రక్షణ సిబ్బంది అప్రమత్తమైనట్లు, అనుమానాస్పద ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పలువురు ఐరోపా నాయకులు ఈ దాడిని ఖండించారు. బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ "ఈ దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని" తెలిపారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్పందిస్తూ..."ఫ్రాన్స్‌లో దాడుల తరువాత మరొక ఐరోపా దేశమైన ఆస్ట్రియాలో దాడులు జరగడం విచారకరం. ఈ దాడులను ఐరోపా సంఘాలు సంఘటితంగా ఎదుర్కోవాలని" పిలుపునిచ్చారు.

యూకే హోం సెక్రటరీ ప్రీతి పటేల్ "ఎలాంటి సహయానికైనా మేము సిద్ధంగా ఉన్నామని" తెలిపారు.

డచ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే ఈ దాడిని "ఘోరమైన చర్యగా" పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)