న్యూజీలాండ్ ఎన్నికలు: ప్రధాని జెసిండా పార్టీ ఘన విజయం - BBC Newsreel

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

న్యూజీలాండ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి జెసిండా ఆర్డెన్ పార్టీ ఘన విజయం సాధించింది.దాదాపుగా పూర్తయిన ఓట్ల లెక్కింపులో జెసిండా నేతృత్వంలోని లేబర్ పార్టీకి 49 శాతం ఓట్లు దక్కాయి. సంపూర్ణ ఆధిక్యం దిశగా ఆమె దూసుకెళ్తున్నారని అంచనాలు చెబుతున్నాయి.మరోవైపు ప్రతిపక్ష నేషనల్ పార్టీకి 27 శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఇప్పటికే ఓటమిని పార్టీ అంగీకరించింది.ఈ ఎన్నికలు సెప్టెంబరులోనే జరగాల్సి ఉంది. అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ నెల రోజులపాటు వీటిని వాయిదా వేశారు. ''గత 50ఏళ్లలో ఎన్నడూ లేనంతగా లేబర్ పార్టీకి న్యూజీలాండ్ ప్రజలు మద్దతు పలికారు. మేం ఈ మద్దతును కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. దేశంలో ప్రతి ఒక్కరికీ చేరువయ్యే పార్టీగా మేం మారతామని మాట ఇస్తున్నాను''అని జెసిండా వ్యాఖ్యానించారు.సీట్ల పరంగా జెసిండాకు 64/120 సీట్లు వస్తాయని అంచనాలు చెబుతున్నాయి. ఇది తిరుగులేని మెజారిటీ. 1996 తర్వాత దేశంలో ఇంత ఆధిక్యం రావడం ఇదే తొలిసారి.

పారిస్‌లో టీచర్ తల నరికిన దుండగుడు... 'ఇస్లామిక్ తీవ్రవాద దాడి'గా ప్రకటించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో బుధవారం ఒక దుండగుడు ఒక ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేసి అతడి తల నరికాడు. తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు చనిపోయాడు. ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్ చేశారు.

రాజధాని పారిస్‌ శివార్లలోని కాన్‌ఫ్లాన్స్ సౌ హోనోరీ స్కూల్ దగ్గర ఈ దారుణం జరిగింది.

దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులు చివరికి అతడిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. దుండగుడి వివరాలు ఇంకా బయటపెట్టలేదు.

అయితే, ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం దుండగుడి వయసు 18 ఏళ్లని తెలుస్తోంది.

బాధిత ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏడాది క్రితం ఫ్రెంచ్ పత్రిక చార్లీ హెబ్డోలో ప్రచురించిన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ చూపించినట్లు తెలుస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. యాంటీ టెర్రరిస్ట్ టీమ్ దీనిపై దర్యాప్తు ప్రారంభించింది.

ఉపాధ్యాయుడు ఇస్లామిక్ తీవ్రవాద దాడికి గురయ్యారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్ చెప్పారు. ఆయన భావ ప్రకటనా స్వేచ్ఛకు మద్దతిచ్చేవారని చెప్పారు. ఇది ‘ఇస్లామిక్ టెర్రరిస్ట్ అటాక్’ అన్నారు.

హింసకు వ్యతిరేకంగా దేశ పౌరులందరూ ఒక్కటవ్వాలని ఆయన అపీల్ చేశారు. తీవ్రవాదం ఎప్పటికీ గెలవలేదన్నారు.

“కాన్‌ఫ్లెన్స్ సౌ హోనోరీలో సాయంత్రం జరిగిన ఘటన గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. కానీ, మన ఒక పౌరుడిని చంపేశారు. ఆయన తన విద్యార్థులకు భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి చెప్పారు. ఆయన వారికి ప్రతి అంశం గురించి ఆలోచించడం, దానిపై నమ్మకం ఉంచే స్వేచ్ఛ గురించి చెప్పారు. ఆయనపై జరిగిన దాడి హేయమైన చర్య, ఆయన ఇస్లామిక్ టెర్రరిస్ట్ బాధితుడ”ని మేక్రాన్ అన్నారు.

ఘటనాస్థలాన్ని సందర్శించిన మేక్రాన్, దీనికి సంబంధించి ఒక క్రైసిస్ సెంటర్ కూడా ఏర్పాటుచేశారు.

అటు ఫ్రాన్స్ విద్యా మంత్రి తన ట్వీట్‌లో ఒక ఉపాధ్యాయుడిని చంపడం అంటే అది నేరుగా ఫ్రాన్స్ మీద దాడి జరపడమేనని ట్వీట్ చేశారు.

దాడి గురించి ఏం చెబుతున్నారు

పెద్ద కత్తితో వచ్చిన ఒక వ్యక్తి ఉపాధ్యాయుడిపై దాడి చేశాడని, ఆయన తలను నరికేశాడని చెబుతున్నారు. దాడి తర్వాత అతడు పారిపోయాడని, స్థానికులు పోలీసులను అప్రమత్తం చేశారని తెలిపారు.

పోలీసు అధికారులు దుండగుడిని వెంటాడారు. లొంగిపోవాలని హెచ్చరించారు. కానీ అతడు వినకుండా, అధికారులనే బెదిరించాడు. దాంతో పోలీసులు అతడిపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో అతడు చనిపోయాడన్నారు.

ఘటనాస్థలాన్ని సీల్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. దాడి జరిగిన ప్రాతంలోకి ఎవరూ వెళ్లకూడదని పోలీసులు ట్వీటర్‌లో అపీల్ చేశారు.

చనిపోయిన ఉపాధ్యాయుడు ఎవరు

'లే మోందే' పత్రిక కథనం ప్రకారం హత్యకు గురైన టీచర్ చరిత్ర, భౌగోళిక శాస్త్రం బోధిస్తుంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెబుతూ గతంలో 'చార్లీ హెబ్డో' ప్రచురితమైన మహమ్మద్ కార్టూన్ల గురించి ప్రస్తావించారు. హెబ్డోలో ఆ కార్టూన్ అచ్చయినప్పుడు ముస్లిం వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ టీచర్ తన తరగతిలో ఆ ప్రస్తావన తెస్తూ, దీనిపై అభ్యంతరాలున్న ముస్లిం విద్యార్థులు ఎవరైనా ఉంటే బయటకు వెళ్లవచ్చని చెప్పినట్లు తెలిసింది.

చార్లీ హెబ్డో విచారణ గురించి చెబుతూ అది ప్రచురించిన కార్టూన్లను చూపించడంపై కొంతమంది ముస్లిం తల్లితండ్రులు ఈ నెల ప్రారంభంలో స్కూలులో ఫిర్యాదు చేశారని ఫ్రెంచి మీడియా తెలిపింది.

టీచరుపై జరిగిన దాడి తర్వాత చార్లీ హెబ్డో కూడా ఒక ట్వీట్ చేసింది.

“అసహనం కొత్త స్థాయికి చేరుకుంది. మన దేశంలో బీభత్సం సృష్టించకుండా వీరిని ఎవరూ అడ్డుకోలేరేమోనని అనిపిస్తోంది” అంది.

టీచర్ మీద జరిగిన దాడి వెనక కార్టూన్ చూపించడమే కారణం అని నిర్ధరణ అయితే అది ఫ్రాన్స్ ప్రజలకు పెద్ద షాక్ అవుతుందని పారిస్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి స్కొఫీల్డ్ భావిస్తున్నారు.

“వారు దీన్ని కేవలం దారుణ ఘటనగా కాకుండా, ఒక టీచర్ తన కర్తవ్యాన్ని నిర్వహించినందుకు చేసిన పాశవిక దాడిగా చూస్తారు'' అని అన్నారు.

2015లో చార్లీ హెబ్డోలో కార్టూన్ల మీద వ్యక్తమైన ఆగ్రహం, ఆ తరువాత జరిగిన దాడుల్లో కొంత మంది ప్రఖ్యాత కార్టూనిస్టులు సహా 12 మంది హత్యకు గురయ్యారు. నాటి నుంచి ఫ్రాన్సులో తీవ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)