కరోనావైరస్‌ జాగ్రత్తలతో ఫ్లూ నిర్మూలన సాధ్యమవుతోందా?

సింబాలిక్ ఇమేజ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జారియా గార్వెట్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్
  • ప్రచురణ

సపనవా తెగ ప్రజలు బాహ్య ప్రపంచంతో కలవడం అదే మొట్టమొదటిసారి.

బ్రెజిల్‌కు పశ్చిమాన అమెజాన్ పరివాహక ప్రాంతంలోని మారుమూల 'సెర్రా దో డివిజర్ నేషనల్ పార్క్'లో ఇది జరిగింది.

ఆకాశం నుంచి చూస్తే ఎడతెగని అడవే కనిపిస్తుంది. కానీ, ఆ అడవి కింద నదులు, జలపాతాలు, బద్దలవని అగ్నిపర్వతాలు, మనుషులు నివసించే గ్రామాలు ఉన్నాయి. పెద్దపెద్ద ఆర్మడిల్లోలు, తాపిర్‌లు, జాగ్వార్‌లకు ఆవాసమైన ఆ కీకారణ్యంలో 32 వేల సంవత్సరాలుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా జీవనం సాగిస్తున్న ఆదిమ తెగలూ అక్కడున్నాయి.

అమెజాన్ అడవులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెజాన్ అడవులు

బాహ్య ప్రపంచంతో పరిచయంలేని అలాంటి ఒక తెగ సపనవాకు సంబంధించి 2014లో అంతా మారిపోయింది. పెరూ సరిహద్దు వెంబడి కలప దొంగల ముఠాలు హింసాత్మక దాడులకు పాల్పడడంతో సపనవా తెగకు చెందిన ఎందరో చెల్లాచెదురైపోయారు.

అలా పారిపోయిన కొందరు పదేళ్ల కిందట బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఏర్పచుకున్న మరో ఆదిమ తెగ నివసించే గ్రామంపై దాడి చేశారు.

ఆ తరువాత వారు.. బాహ్యప్రపంచంతో సంబంధాల్లేని ఆదిమతెగల రక్షణకు పనిచేసే 'ఎఫ్‌యూఎన్ఏఐ' అనే సంస్థ సంరక్షణలో మూడు వారాలు గడిపారు.

అమెజాన్ ఆదిమ జాతులు వారికే పరిమితమైన ప్రాచీన భాషలు మాట్లాడుతాయి.. అలాంటి కొన్ని భాషల్లో అంకెలకు, రంగులకు కూడా పేర్లు ఉండవు. వారివి సాధారణంగా సమసమాజాలు.

అంతేకాదు... ఈ భూమి మీదున్న మిగతా మానవాళిని పీడించే కొన్ని వ్యాధుల బారినపడని తెగలు కూడా ఇవే.

బాహ్య ప్రపంచంతో సంబంధం లేని ఇలాంటి మనుషుల్లో కొందరికి జలుబు, ఫ్లూ, మీజిల్స్ వంటి రోగాలు సోకిన దాఖలాలు లేవు.

అయితే, సపనవా తెగ ప్రజలు కొందరు బాహ్యప్రపంచపు మనుషులను కలిసిన కొన్నాళ్లకే ఇన్‌ఫ్లూయెంజా వంటి శ్వాసకోస వ్యాధులకు గురయ్యారు.

అంతకుముందు ఇలాంటి తెగలకు తొలిసారి ఫ్లూ సోకినప్పుడు మరణాల రేటు ఎక్కువగా ఉండేది.. కానీ, వీరి విషయంలో అలా జరగలేదు. వెంటనే వైద్య సాయం అందడంతో రోగం సోకినా ఎవరూ మరణించలేదు. కొద్దికాలం క్వారంటీన్‌లో ఉంచిన తరువాత వారిని సొంత తెగలతో కలిసే ఏర్పాటు చేశారు. ఆ తరువాత వారిలో ఎవరికీ ఫ్లూ రాలేదు.

ఫ్లూ రహిత సమాజాల ఉనికి ఒక కీలక ప్రశ్నను లేవనెత్తుతుంది. సపనవా తెగల మాదిరిగా మిగతా ప్రపంచం ఎప్పటికైనా ఫ్లూ నుంచి బయటపడగలదా? అనేదే ఆ ప్రశ్న.

ప్రపంచం అదే లక్ష్యంగా అడుగులేస్తోంది.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ఆస్ట్రేలియాలో ఏమైందంటే..

2020 జనవరి చివరిలో ఆస్ట్రేలియాలో వేసవి కాలం ముగిసే సమయానికి ఆ దేశంలో 6,962 ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

అప్పటికి కరోనా వైరస్ ఇంకా చైనాకు మాత్రమే పరిమితమైంది.

ఆ తరువాత ఏప్రిల్ నాటికి ఆస్ట్రేలియాలో ఫ్లూ కేసులు 229కి తగ్గాయి. అంతకుముందు సంవత్సరం అదే సమయంలో 18705 కేసులుండేవి.

2020 ఏప్రిల్ సరికి ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రమైన లాక్‌డౌన్ వంటి నియంత్రణలు విధించారు. చేతులు పదేపదే శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివీ ప్రజలు అలవాటు చేసుకున్నారు.

2020 ఆగస్టు నాటికి ఆస్ట్రేలియాలోని ఫ్లూ కేసులు భారీగా తగ్గిపోయాయి. 2019లో అదే సమయంతో పోల్చితే పదో వంతు కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి.

మిగతా అనేక దేశాల్లోనూ ఫ్లూ తగ్గింది. 'దక్షిణ ఆఫ్రికా సాంక్రమిక వ్యాధుల జాతీయ సంస్థ' సహ అధ్యక్షుడు ఇటీవల సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ ఈ ఏడాది తమ దేశంతో ఫ్లూ సీజన్ లేదని చెప్పారు.

ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే అక్కడ ఇటీవల కాలంలో ఒక్క ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదు. అదే న్యూజీలాండ్‌లో గత ఏడాది చేసిన పరీక్షల్లో 57 శాతం మంది పాజిటివ్ వచ్చింది.

ప్రస్తుతం దక్షిణార్థ గోళంలో చలికాలం ముగిసింది. ఉత్తరార్థ గోళంలో చలికాలం మొదలుకానుంది ఇప్పుడు.

ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ తగ్గిందని సెప్టెంబరు వరకు ఉన్న గణాంకాల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. సెప్టెంబరు 7 నుంచి మొదలైన వారంలో ప్రపంచవ్యాప్తంగా ప్రయోగశాలల్లో నిర్ధరణైన ఫ్లూ కేసులు 12 మాత్రమేనని 'ఫ్లూ మార్ట్' సంస్థ గుర్తించింది.

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, దక్షిణ అమెరికా, హాంగ్‌కాంగ్ వంటి చోట్లంతా కనిపిస్తున్న ఈ మార్పు కేవలం ఫ్లూ వరకే పరిమితం కాలేదు.. రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్(ఆర్ఎస్‌వీ) కూడా తగ్గాయని షికాగో యూనివర్సిటీ ఎపిడమాలజిస్ట్ సారా కోబే అన్నారు.

వైద్య వనరులన్నీ కోవిడ్ సేవలకు మళ్లించడం వల్ల టెస్టులు తగ్గడం, ప్రజలు కూడా ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోకుండా ఇళ్లలోనే చికిత్సలు తీసుకోవడం వంటి కారణాల వల్ల కూడా కేసులు తక్కువగా నమోదై ఉండొచ్చు.

అయితే, కరోనావైరస్ కారణంగా అంతా పాటిస్తున్న వ్యక్తిగత పరిశుభ్రత, జాగ్రత్తలు, భౌతిక దూరం కూడా ఫ్లూ తగ్గుదలకు ప్రధాన కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

10 వేల ఏళ్ల కిందట పెంపుడు పక్షుల నుంచి సోకిందా?

మానవ జాతి నిత్యం ఫ్లూతోనే బతకలేదు. 10 వేల ఏళ్ల కిందట మనిషి వేట నుంచి వ్యవసాయానికి మళ్లుతున్న సమయంలో పెంపుడు పక్షుల నుంచి తొలిసారి ఫ్లూ సోకిందనే భావన ఉంది.

అమెరికాకు వలస వచ్చిన యూరోపియన్ల వల్ల ఫ్లూతో పాటు మశూచి, తట్టు, బ్యుబోనిక్ ప్లేగ్, మలేరియా, కుష్టు, ఆటలమ్మ, గవదబిళ్లలు, టైఫస్, కలరా, కోరింత దగ్గు, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులన్నీ ఆ ఖండంలోనూ వ్యాపించాయని చెబుతారు.

1980 మే 8న ప్రపంచ ఆరోగ్య సంస్థ మశూచిని నిర్మూలించినట్లు అధికారికంగా ప్రకటించినంతవరకు ఇందులో ఏ వ్యాధి కూడా అంతరించలేదు. మనుషులకు సోకే మరో వ్యాధి సార్స్‌ను కూడా మశూచిలా నిర్మూలించగలిగారు.

మొదట టీకాలు, ఆ తరువాత కాంటాక్ట్ ట్రేసింగ్‌పై ఆధారపడి ఈ వ్యాధులను రూపుమాపారు. అయితే, ఈ విధానాలు ఫ్లూ విషయంలో వర్తించవు.

'ఇన్‌ఫ్లూయెంజా నిత్యం పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి రోగ నిరోధక వ్యవస్థను దీన్ని ఎదుర్కొనేలా సిద్ధం చేసినా పరిణామం చెందిన ఇన్‌ఫ్లూయెంజా దాడి చేస్తుంది'' అని న్యూయార్క్ లోని మౌంట్ సినాయిలో ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసన్‌లో ఆర్ఎన్ఏ వైరస్‌ల నిపుణులు పీటర్ పాలెసీ చెప్పారు. ఏటా ప్రపంచ ప్రజల్లో 10 శాతం మందిపూ ఫ్లూ ప్రభావం చూపుతుంది.

కరోనా జాగ్రత్తల కారణంగా అనుకున్నా కొన్ని చోట్ల ఈ ఏడాది ఫ్లూ తగ్గినా ఇప్పటికీ ప్రపంచంలోని కొన్నిచోట్ల, కొన్ని సమూహాల్లో ఫ్లూ ఎప్పటిలాగానే ఉండి ఉంటుందని చెబుతున్నారు.

ఒక వేళ కరోనా జాగ్రత్తలతో ఫ్లూ తగ్గుతుందని అనుకున్నా అమెరికా వంటి చోట చాలామంది మాస్కులు పెట్టుకోవడం లేదని.. అలాగే ప్రపంచంలోని చాలా చోట్ల భౌతిక దూరం సాధ్యం కాదని.. ఆ పరిస్థితులన్నీ ఫ్లూ ఇంకా ఉనికి ఉండేలా చేస్తాయని అంటున్నారు.

'మనిషి అన్నిచోట్లా వ్యాపించినట్లే ఫ్లూ వైరస్ కూడా అంతటా వ్యాపించి ఉంది. ఎన్నటికీ అంతరించిపోకుండా వేర్వేరు సమాజాల్లో ఉంటుంది'' అని డాక్టర్ కోబే అన్నారు.

అయితే, అన్ని సందర్భాలకు ఇది వర్తించకపోవచ్చు.

ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

ఫ్లూ పరిణామం చెందుతున్న వేగం ప్రకారం ప్రస్తుతం వ్యాక్సిన్ 6 నెలల వరకు రక్షణ ఇస్తుంది. వ్యాక్సిన్ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి వైరస్ యాంటిజెనిక్ డ్రిఫ్ట్‌పై ఆధారపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ సాధారణంగా గుర్తించే వైరస్ కణాల శీర్ష్యంలో ఉత్పరివర్తన వేగాన్ని బాగా తగ్గించుకోవడం ద్వారా వైరస్ రోగనిరోధక వ్యవస్థ గుర్తించకుండా చేసుకుంటుంది. అప్పుడు రోగ నిరోధక వ్యవస్థ నెమ్మదిగా ఉత్పరివర్తనం చెందిన ఆ వైరస్‌ను ముప్పుగా గుర్తించలేదు.

ఈ సంక్లిష్టతలన్నిటిపైనా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ మరింత సమర్థమైన 'యూనివర్సల్ వ్యాక్సీన్' అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు.

అయితే, ప్రజలు ఫ్లూ, కోవిడ్-19కి ఏకకాలంలో గురైతే ఏమవుతుందన్నది శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. ''నిజంగా ఇది తెలియదు. అయితే, ఇలా జరిగితే వ్యాధి తీవ్రత మరింత ఎక్కువవుతుందేమోనన్న ఆందోళన ఉంది'' అన్నారు డాక్టర్ పాలీస్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)