ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనావైరస్ పాజిటివ్ - BBC Newsreel

ప్రచురణ

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనావైరస్ సోకింది.

ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం రాత్రి అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

‘‘ఈ రోజు (మంగళవారం) ఉదయం ఉప రాష్ట్రపతి కోవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు. ఆయన పాజిటివ్ అని తేలింది’’ అని ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.

ఆయనలో ఎలాంటి కరోనావైరస్ లక్షణాలూ లేవని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వివరించింది.

కాగా, వెంకయ్య నాయుడు సతీమణి ఉష నాయుడుకు పరీక్ష చేయగా, ఆమెకు మాత్రం నెగెటివ్ వచ్చిందని, ప్రస్తుతం వారు స్వీయ నిర్బంధంలో ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

చందమామ బొమ్మల చిత్రకారుడు శంకర్ కన్నుమూత

చందమామ కథల్లో అందమైన బొమ్మలు వేసిన చిత్రకారులు శంకర్ చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

తెలుగుతో పాటూ అన్ని ప్రధాన భారతీయ భాషల్లో వచ్చిన పిల్లల మాస పత్రిక చందమామలో సుదీర్ఘ కాలం బొమ్మలు వేసిన ఆర్టిస్టు కరతొలువు చంద్రశేఖరన్ శివశంకరన్. శంకర్ గా పిలుచుకునే ఆయన 96 ఏళ్ల వయసులో చెన్నైలో కన్నుమూశారు.

చందమామ కథలు అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది భేతాళుడూ, విక్రమార్కుడూనూ.. చెట్టెక్కే భేతాళుడి కథకు శంకర్ సృష్టించిన బొమ్మలు భారతీయులందరి మదిలో శాశ్వతంగా నిలచిపోయాయి.

కేవలం భేతాళ పాత్రే కాకుండా, ఎన్నో వేల బొమ్మలు చందమామ పత్రిక కోసం వేశారు శంకర్. ఆ పత్రికకు పనిచేసిన చిత్రకారుల్లో మిగిలిన ఇద్దరూ ఇప్పటికే మరణించారు.

1924లో తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో శంకర్ జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు. చిన్నప్పుడు తన చేతిరాత అందంగా ఉండడంతోనే తనకు ప్రభుత్వ స్కూల్లో సీటు దొరికిందని శంకర్ ఒకసారి ది హిందూ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తన చేతిరాత అందంగా ఉండడం చేత రోజూ ఆయనతో స్కూలు నోటీసు బోర్డుపై సామెతలు రాయించేవారట.

డ్రాయింగు టీచర్ సలహా మేరకు సాధారణ బిఎ, ఎంఎ కాకుండా ఫైన్ ఆర్ట్స్ లో చేరారు శంకర్. 1941లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, మద్రాస్ లో చేరిన శంకర్ 1946లో చదువు పూర్తి చేసిన వెంటనే 1946లో కలైమగల్ అనే తమిళ పత్రికలో చిత్రకారుడిగా ఉద్యోగం ప్రారంభించారు. తరువాత చందమామ వ్యవస్థాపకులు బి నాగి రెడ్డి, ఆయన్ను చందమామ చిత్రకారుల్లో ఒకరిగా తీసుకున్నారు.

1960లలో చందమామ బొమ్మల విషయంలో శంకర్ పేరు మార్మోగింది. ఆ సమయంలోనే ఆయన ప్రఖ్యాత భేతాళ - విక్రమార్క పాత్రలకు రూపం ఇచ్చారు.

చందమామలో శంకర్ తో పాటూ చిత్ర అనే ఆర్టిస్టు కూడా ఉండేవారు. ''శంకర్, చిత్ర ఇద్దరూ చందమామ అనే బండికి రెండు ఎడ్లు వంటి వారు. వారి వల్లే చందమామ బాగా నడుస్తోంది.'' అని ప్రశంసించారు నాగిరెడ్డి.

కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఐదుగురు సంతానం.

ఆయన నిత్యం తనను అభిమానించే వారితో టచ్లో ఉండేవారు. ''శంకర్ గారితో నాది దశాబ్ద కాల పరిచయం. ఆయనతో తరచూ ఫోన్లో మాట్లాడేవాడిని. అయితే ఆయన గీసిన బొమ్మల కాపీలన్నీ చెన్నై వరదల్లో పోయాయని చెప్పారు. ఆయన ఆ విషయం గురించి చాలా బాధపడేవారు'' అంటూ శంకర్ గారిని జ్ఞాపకం చేసుకున్నారు హైదరాబాద్ కి చెందిన బాలాజీ. ఈయన చందమామ తెలుగు కథల పేరుతో ఫేస్ బుక్ పేజీ నిర్వహిస్తున్నారు.

వివాదాస్పద నగార్నో-కరాబక్ ప్రాంతం కోసం అర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంలో దాదాపు వంద మంది మరణించారు. మృతుల్లో పౌరులు కూడా ఉన్నారు.

కొండ ప్రాంతమైన నగార్నో-కరాబక్‌ అజర్‌బైజాన్‌లో భాగం. అయితే, 1994లో యుద్ధం అనంతరం దీన్ని అర్మేనియా తెగలు నియంత్రణలోకి తీసుకున్నాయి.

ఆదివారం నుంచి ఇప్పటివరకూ 84 మంది మరణించినట్లు అర్మేనియా తెలిపింది. మృతుల్లో సైనికులతోపాటు పౌరులూ ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు సైనికుల మరణాలను అజర్‌బైజాన్‌ వెల్లడించలేదు. ఏడుగురు పౌరులు మాత్రం మరణించారని తెలిపింది.

మూడు రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధం.. పరిసర ప్రాంతాలకూ విస్తరించినట్లు కనిపిస్తోంది.

తూర్పు అర్మేనియా నగరం వార్డెనిస్‌లో ఓ ప్రయాణికుల బస్సును అజర్‌బైజాన్ డ్రోన్ ఢీకొట్టినట్లు అర్మేనియా రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. అయితే, ఈ ఘటనలో ఎవరూ మరణించలేనట్లు తెలుస్తోంది.

అర్మేనియా జవాన్లు జరుపుతున్న కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించినట్లు సోమవారం అజర్‌బైజాన్ తెలిపింది. అంతకుముందురోజు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు పౌరులు కాల్పుల్లో మరణించినట్లు వెల్లడించింది.

కోవిడ్ టెస్ట్: నిముషాల్లోనే ఫలితాలు చూపే కొత్త కరోనా టెస్ట్ ఉత్పత్తి చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటన

కోవిడ్ -19 ఫలితాలను కొన్ని నిముషాల్లోనే నిర్ధారించగల సరికొత్త టెస్ట్ సిద్ధమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) తెలిపింది.

ఈ కొత్త కోవిడ్ టెస్ట్ ద్వారా.. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లో కరోనావైరస్ కేసులను గుర్తించే సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది.

సుమారు 370 రూపాయలు విలువ చేసే ఈ పరీక్ష, హెల్త్‌వర్కర్లు, ప్రయోగశాలలు తక్కువగా ఉండే వెనుకబడిన దేశాల్లో కోవిడ్-19 కేసులను నిర్థారించడంలో ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని, కోవిడ్-19ను ఎదుర్కొనే ప్రక్రియలో ఇది ఒక మైలురాయి అని డబ్ల్యూహెచ్ఓ అభివర్ణించింది.

కోవిడ్-19 పరీక్షలకు, ఫలితాలకు మధ్య ఎక్కువ రోజుల వ్యవధి ఉండడం వలన కరోనవైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ఆలస్యం అవుతోంది. ముఖ్యంగా వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్న ఇండియా, మెక్సికో లాంటి దేశాల్లో కోవిడ్-19ను నియంత్రించడం మీద ఈ జాప్యం ఎక్కువ ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.

అయితే, ఇప్పుడు కనిపెట్టిన ఈ కొత్త పరీక్ష 15-30 నిముషాల్లోనే కోవిడ్-19 ఉందా, లేదా అనేది నిర్థారిస్తుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు.

ఔషధ ఉత్పత్తిదారులు అబోట్, ఎస్‌డీ బయోసెన్సర్.. చారిటబుల్ సంస్థ బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహాయంతో 12 కోట్ల టెస్టులను 133 దేశాలకు అందించగలిగేలా ఉత్పత్తి చెయ్యడానికి అంగీకరించాయని టెడ్రోస్ వెల్లడించారు.

కరోనావైరస్: ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షలు దాటిన కోవిడ్ మరణాలు

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి సంఖ్య 10 లక్షలు దాటిందని పరిశోధకులు చెప్పారు.

చాలా ప్రాంతాల్లో కరోనావైరస్ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

మొత్తం పది లక్షల మరణాల్లో అమెరికా, బ్రెజిల్, ఇండియాల్లో సంభవించిన మరణాలే సగం ఉన్నాయని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెప్తున్నాయి.

అత్యధికంగా అమెరికాలో 2,05,000 మంది చనిపోతే.. బ్రెజిల్‌లో 1,41,700 మంది, భారతదేశంలో 95,500 మంది చనిపోయారు.

అయితే వాస్తవ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చైనాలోని వూహాన్‌లో కరోనావైరస్ వ్యాపిస్తోందనే వార్తలు మొదలయ్యాక దాదాపు 10 నెలల్లోనే ఈ 10 లక్షల మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది.

ఈస్థాయి మరణాలు సంభవించటం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని.. ఇది చాలా వేదన కలిగిస్తోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు.

ఇప్పటివరకూ ఈ మహమ్మారి 188 దేశాలకు పాకింది. ఇప్పటివరకూ 3.20 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.

కోవిడ్ వ్యాప్తిని అడ్డుకోవటానికి విధించిన లాక్‌డౌన్ ఇతర చర్యల వల్ల చాలా దేశాల ఆర్థికవ్యవస్థలు మాంద్యంలో పడిపోయాయి.

మరోవైపు కోవిడ్‌ను అడ్డుకోవటానికి వ్యాక్సిన్ తయారు చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. ఏదైనా ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే లోగానే 20 లక్షల మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)