కరోనావైరస్ పరీక్ష: 90 నిమిషాల్లోనే రిజల్ట్ చెప్పే సింపుల్ టెస్ట్ - BBC NewReel

డీఎన్ఏ నడ్జ్ కిట్

ఫొటో సోర్స్, Imperial College London

ప్రచురణ

కోవిడ్ సోకిందో లేదో తెలుసుకోవడానికి ల్యాబ్ కి వెళ్లే అవసరం లేకుండా ర్యాపిడ్ పరీక్ష ద్వారా గంటన్నరలోనే ఫలితాలు స్వయంగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ 'ల్యాబ్ ఆన్ ఏ చిప్ ' పరీక్ష ప్రస్తుతం ల్యాబ్ లో వస్తున్నలాంటి ఫలితాలనే ఇస్తోందని ఇంపీరియల్ కాలేజీ లండన్ నిర్వహించిన అధ్యయనం తెలిపింది. ఈ అధ్యయనం లాన్సెట్ మైక్రోబ్ లో ప్రచురితమయింది.

రోగులకు వైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు ఇప్పటికే ఈ పరికరాన్ని యుకె లో 8 నేషనల్ హెల్త్ సర్వీస్ ఆసుపత్రుల్లో వాడుతున్నారు.

అయితే, ఈ కిట్ పూర్తి స్థాయి పరీక్ష చేసుకునేందుకు పరిష్కారం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డీఎన్ఏ నడ్జ్ అనే కంపెనీ తయారు చేసిన ఈ పరికరాన్ని ముక్కు లోంచి కానీ, గొంతు లోంచి కానీ స్వాబ్ ని సేకరించి పరీక్షించుకోగలిగే వారెవరైనా వాడవచ్చు.

స్వాబ్ సేకరించిన తర్వాత పరికరంపై నీలం రంగు కాట్రిడ్జ్‌లో పెడతారు. ఈ కాట్రిడ్జ్‌లో పరీక్షకు అవసరమైన రసాయనాలు ఉంటాయి. దీనిని మరో షూ పరిమాణం ఉండే మెషీన్ లో పెట్టి పరీక్ష చేస్తారు. బ్రిటన్ ఇప్పటికే 5,000 నడ్జ్ బాక్స్ మెషీన్లు, 58,000 కార్ట్రిడ్జ్‌లను తెప్పిస్తోంది. అయితే, ఈ బాక్సు ద్వారా రోజుకు కేవలం 16 పరీక్షలు మాత్రమే నిర్వహించడం సాధ్యమవుతుంది.

ఐరోపా దేశాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు... చలికాలం ఎఫెక్టా?

కరోనావైరస్

ఫొటో సోర్స్, EPA

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య మూడు కోట్లకు మించిపోయినట్లు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.

గతేడాది చైనాలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ 9.4 లక్షల కంటే ఎక్కువ మందే మరణించారు.

కేసుల పరంగా చూస్తే అమెరికా, భారత్, బ్రెజిల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే ఐరోపాలో మళ్లీ ఒక్కసారిగా కేసులు పెరుగుతున్నాయి.

శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో ఉత్తరార్ధ గోళంలోని చాలా దేశాల్లో రెండోసారి కేసులు ఎక్కువవుతున్నాయి.

సగం కంటే ఎక్కువ ఐరోపా దేశాల్లో గత రెండు వారాల్లో కొత్త కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ హాన్స్ కుల్జ్ వెల్లడించారు.

కరోనావైరస్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, OXFORD UNIVERSITY

గత వారంలో ఐరోపా వ్యాప్తంగా మూడు లక్షల కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. మార్చిలో మొదటి విడత కేసులు పతాక స్థాయికి చేరినదాని కంటే ఇవే ఎక్కువని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఐరోపా మొత్తం కేసులు 50 లక్షలకుపైనే ఉన్నాయి. మృతుల సంఖ్య 2.28 లక్షలకుపైనే ఉంది.

కేసులను తగ్గించేందుకు ఇంగ్లండ్ వ్యాప్తంగా ఆంక్షలు విధించడంపై బ్రిటన్ ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.

మరోవైపు కేసులు పెరగడంతో ఇజ్రాయెల్‌ రెండోసారి లాక్‌డౌన్ ప్రకటించింది. ఆఫ్రికాలోనూ కేసులు పది లక్షలు దాటాయి. అయితే ఇక్కడ టెస్టులు తక్కువగా చేయడంతో.. ఏ స్థాయిలో వైరస్ వ్యాపిస్తుందో అంతుచిక్కడం లేదు.

లాటిన్ అమెరికాలో బ్రెజిల్‌తోపాటు అర్జెంటీనా (రోజుకు 13,000 కేసులు), మెక్సికో (రోజుకు 3,000 కేసులు) కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)