అమెజాన్ ఆదివాసీల బాణాలకు ఆదివాసీ నిపుణుడు మృతి - BBC Newsreel

ఫొటో సోర్స్, Reuters
అమెజాన్ మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంగా జీవించే ఆదివాసీ తెగలు ఉంటున్న ప్రాంతానికి వెళ్లిన ఒక బ్రెజిల్ నిపుణుడు వారు వేసిన బాణాలు తగిలి ప్రాణాలు కోల్పోయారు.
56 ఏళ్ల రీలీ ఫ్రాన్సిస్కాటో బుధవారం వాయవ్య బ్రెజిల్‌లోని రొండోనియా రాష్ట్రంలో ఒక మారుమూల ప్రాంతంలో చనిపోయారు. ప్రభుత్వానికి చెందిన ఫునాయ్ అనే దేశీయ ఏజెన్సీ పనిలో భాగంగా ఒక తెగను పర్యవేక్షించడానికి ఆయన అక్కడకు వెళ్లారు.
ఫ్రాన్సిస్కాటో, ఆయన బృందం స్థానిక తెగవారిని సమీపించినప్పుడు, వారిపై దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తమపై దాడి జరగడంతో, పోలీసుల సాయంతో ఫ్రాన్సిస్కాటో ఒక వాహనం వెనుక దాక్కోడానికి ప్రయత్నించారని, కానీ ఒక బాణం ఆయన చాతీలో గుచ్చుకుందని తెలిపారు.
గుండెకు కాస్త పైన గుచ్చుకున్న బాణాన్ని తీయాలని ఫ్రాన్సిస్కాటో ప్రయత్నించారని కూడా ఒక పోలీస్ అధికారి చెప్పాడు. "ఆయన ఏడ్చారు. తన చాతీలో గుచ్చుకున్న బాణాన్ని లాగారు, దాదాపు 50 మీటర్లు పరిగెత్తిన తర్వాత కుప్పకూలి, చనిపోయారు" అని ఆ అధికారి సోషల్ మీడియాలో తన ఆడియో పోస్ట్ చేశాడు.
ఫ్రాన్సిస్కాటో స్థాపించిన ఒక స్వచ్ఛంద సంస్థ ఆయన్ను ఒక అద్భుతమైన, అంకితభావం ఉన్న నిపుణుడుగా వర్ణించింది. అక్కడ ఉన్న తెగలకు బయటి ప్రపంచం నుంచి వచ్చే శత్రువులు. స్నేహితులకు మధ్య తేడాను గుర్తించే సామర్థ్యం లేదని ఆ సంస్థ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా, రష్యా, ఇరాన్ హ్యాకర్లు ట్రంప్, బైడెన్‌ల ఎన్నికల ప్రచారాలను టార్గెట్ చేస్తున్నారు: మైక్రోసాఫ్ట్
చైనా, రష్యా, ఇరాన్‌తో సంబంధాలున్న హ్యాకర్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఉన్న వ్యక్తులు, సమూహాలను మోసగించే ప్రయత్నాలు చేస్తున్నారని మైక్రోసాఫ్ట్ సంస్థ ఆరోపించింది.
2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రట్ల ప్రచారాన్ని దారి తప్పించిన రష్యా హ్యాకర్లు మళ్లీ అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారని మైక్రోసాఫ్ట్ చెబుతోంది.
''అమెరికా అధ్యక్ష ఎన్నికలు లక్ష్యంగా విదేశీ యాక్టివిటీ గ్రూపులు తమ కార్యకలాపాల వేగం పెంచాయన్నది సుస్పష్టం'' అని ఆ సంస్థ చెప్పింది.
అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, డెమొక్రట్ల అభ్యర్థి జో బైడెన్.. ఇద్దరి ప్రచార కార్యకలాపాలపైనా సైబర్ దుండగుల దృష్టి ఉంది.
డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందినవి సహా 200కిపైగా గ్రూపులను స్ట్రాన్షియమ్ గ్రూప్ రష్యా హ్యాకర్లు టార్గెట్ చేశారని మైక్రోసాఫ్ట్ తన ప్రకటనలో తెలిపింది.
ఈ సైబర్ దుండగులే బ్రిటన్‌లోని రాజకీయ పార్టీలనూ లక్ష్యంగా చేసుకున్నారని మైక్రోసాఫ్ట్ చెప్పింది.. అయితే, ఏ పార్టీని, ఏ నాయకుడిని అనేది స్పష్టంగా చెప్పలేదు.
సైబర్ ప్రపంచంలో ఫ్యాన్సీ బార్ అని కూడా పేరున్న స్ట్రాన్షియంకు రష్యా సైనిక గూఢచర్య సంస్థ జీఆర్‌యూతో సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి.
మైక్రోసాఫ్ట్ ఇంకా ఏం చెప్పింది?
''2016లో జరిగినట్లుగానే స్ట్రాన్షియం ప్రజల లాగ్ ఇన్ వివరాలను సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తోంది. బహుశా నిఘా సమాచార సేకరణకు, ఎన్నికల కార్యకలాపాలకు అవాంతరాలు సృష్టించేందుకు ఇలా చేస్తుండొచ్చు'' అని మైక్రోసాఫ్ట్ కస్టమర్ సెక్యూరిటీ అండ్ ట్రస్ట్ ఇన్‌చార్జ్ టామ్ బర్ట్ చెప్పారు.
బైడెన్ ప్రచార కార్యక్రమంతో సంబంధమున్నవారిని చైనా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని మైక్రోసాఫ్ట్ చెప్పింది.
ట్రంప్ ప్రచార కార్యక్రమాలతో సంబంధమున్నవారిని ఇరాన్ సైబర్ దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపింది.
అయితే, ఈ సైబర్ దాడుల ప్రయత్నాలలో అత్యధికం విఫలమవుతున్నాయనీ మైక్రోసాఫ్ట్ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో కార్చిచ్చులు: అగ్నికీలల నుంచి తప్పించుకునేందుకు తరలిపోయిన 5 లక్షల మంది
అమెరికాలోని ఆరెగాన్ రాష్ట్రంలో చెలరేగుతున్న కార్చిచ్చుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. సుమారు 5 లక్షల మంది ఇలా తరలిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పదుల సంఖ్యలో కార్చిచ్చుల కారణంగా అసాధారణ వేడి, పొడి గాలులు ఆరెగాన్ రాష్ట్రాన్ని చుట్టుముడుతున్నాయి. ఎవరో నిప్పుపెట్టడమే కొన్ని మంటలకు కారణమన్న అనుమానాలున్నాయి.
ఈ మంటల కారణంగా ఎంతమంది చనిపోయారన్నది ఇంకా కచ్చితంగా తెలియదని ఆరెగాన్ గవర్నర్ కేట్ బ్రౌన్ చెప్పారు.
అమెరికాలోని 12 పశ్చిమ రాష్ట్రాల్లో ప్రస్తుతం 100కి పైగా కార్చిచ్చులు చెలరేగాయి.
ఆరెగాన్, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌లలో తీవ్రత ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల ఏకంగా పట్టణాలకు పట్టనాలే నాశనమైపోయాయి. ఒక్క కాలిఫోర్నియాలోనే కనీసం 10 మంది మరణించారు.
ఇప్పటికే 44 లక్షల ఎకరాల్లో అడవులు ధ్వంసమయ్యాయని నేషనల్ ఇంటర్‌ఏజెన్సీ ఫైర్ సెంటర్ లెక్కలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- 9/11 దాడులను అమెరికా కావాలనే అడ్డుకోలేదా? కుట్ర సిద్ధాంతాలు ఏమంటున్నాయి, నివేదికలు ఏం చెబుతున్నాయి?
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- ‘రూ.6 లక్షలు బిల్లు.. మొత్తం కట్టి, శవాన్ని తీసుకెళ్లండి..’ కరోనా రోగి బంధువులకు ఓ ప్రైవేటు ఆస్పత్రి అల్టిమేటం
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























