హైదరాబాద్: మెట్రో రెండో దశ పట్టాలెక్కకపోవడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, X/TelanganaCMO/X/kishanreddybjp/Gettyimages
'జూబ్లీహిల్స్, మాదాపూర్ కలిపితే ఉండేంత వైజాగ్‌కు కూడా మెట్రో రైల్ ఇచ్చారు. అహ్మదాబాద్ మెట్రోకూ క్యాబినెట్ అప్రూవల్ లభిస్తుంది. కానీ హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది''
- ఇవి ఇటీవల విలేఖరుల సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.
హైదరాబాద్ మెట్రో రెండో దశ చుట్టూ కొన్నాళ్ల నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నది తెలంగాణ ప్రభుత్వ ఆరోపణ.
కానీ హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై కేంద్రం ఎలాంటి వివక్షా చూపడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు.
మెట్రో రైల్ మొదటి దశ స్వాధీనానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో రెండో దశకు మార్గం సుగమం అవుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.
అసలు ఇంతకీ హైదరాబాద్ మెట్రో రెండో దశ ఎందుకు పట్టాలెక్కడం లేదనే విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే….


ఫొటో సోర్స్, Getty Images
రెండో దశ.. రెండు ఫేజ్‌లలో…
హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశలో భాగంగా మూడు కారిడార్లలో రాకపోకలు సాగుతున్నాయి.
ఎల్బీనగర్-మియాపూర్ (కారిడార్-1), జేబీఎస్-ఎంజీబీఎస్ (కారిడార్-2), నాగోలు-రాయదుర్గం (కారిడార్-3) రూట్లలో రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ చెబుతోంది.
మొదటి దశలోని మూడు కారిడార్లకు అనుసంధానంగా, కొత్తగా మరికొన్ని మార్గాలు కలుపుకొని మెట్రో రైల్ విస్తరించాలని రెండేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ విస్తరణ మార్గాలను 'ఫేజ్ -2ఎ, ఫేజ్ – 2బీ'గా విభజించింది.
'ఫేజ్ 2ఎ' కింద 76.4 కిలోమీటర్ల మేర హెచ్ఎంఆర్ఎల్ 5 కారిడార్లను ప్రతిపాదించింది. ఇందులో ఒకటి కొత్తదికాగా, మిగిలిన నాలుగు ఇప్పటికే ఫేజ్ -1లో నిర్మితమైన కారిడార్లకు పొడిగింపు.
ఈమేరకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో కూడిన డీపీఆర్‌ను తెలంగాణ ప్రభుత్వం 2024 నవంబరు 4న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించింది.
అలాగే ఫేజ్ 2బీ కింద 86.1 కిలోమీటర్ల మేర మరో మూడు కారిడార్లను నిర్మించాలని హెచ్ఎంఆర్ఎల్ ప్రతిపాదించింది.
ఇందుకు 2025 జూన్ 21న రూ.19,579 కోట్లతో డీపీఆర్‌ను కేంద్రానికి పంపించినట్లుగా మెట్రో రైల్ అధికారులు చెబుతున్నారు.
మొత్తంగా 232 కిలోమీటర్లు..
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ నెట్‌వర్క్ తొలి విడతలో 69 కిలోమీటర్ల మేర అందుబాటులోకి వచ్చింది. రెండో విడత కూడా పూర్తయితే మొత్తంగా దాదాపు 232 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
రెండో దశలో కేంద్ర ప్రభుత్వం వాటా 18 శాతం కాగా, తెలంగాణ ప్రభుత్వం వాటా 30 శాతంగా పెట్టుకుని, రుణాల ద్వారా 48 శాతం సమకూర్చుకుని, మరో 4 శాతం పీపీపీ విధానంలో సేకరించాలనేది ప్రణాళిక.
మెట్రో రెండో దశను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

ఫొటో సోర్స్, hmrl.co.in
కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాలు ఎందుకు?
రెండో దశ మెట్రో రైల్ నిర్మాణంపై, కేంద్ర ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా హెచ్ఎంఆర్ఎల్ అధికారులు చెబుతున్నారు.
మెట్రో మెదటి దశలోని 69 కిలోమీటర్ల మార్గాన్ని పబ్లిక్ -ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో ఎల్ అండ్ టీ చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రస్తుతం మెట్రో రైళ్ల నిర్వహణ, కార్యకలాపాలు, ఖర్చులు సహా వివిధ పనులను ఎల్ అండ్ టీనే చూస్తోంది.
రెండో దశలో ప్రతిపాదించిన మార్గాలు కూడా మొదటి దశకు అనుసంధానంగా ఉంటాయి.
నాగోలు – శంషాబాద్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, మియాపూర్- పటాన్ చెరు, ఎల్బీనగర్ – హయత్ నగర్ కారిడార్లు.. ఇప్పటికే ఉన్న మార్గాలకు విస్తరణ.
మొదటి ఫేజ్ ప్రైవేటు ఆధీనంలో ఉండగా.. దానికి అనుసంధానంగా నిర్మించే కారిడార్లు ప్రభుత్వ ఆధీనంలో నిర్మిస్తే నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఈ ఏడాది మార్చి 29న అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం ప్రకారం, ఉదాహరణకు ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు రైలును ఎల్ అండ్ టీ ఆపరేట్ చేస్తే, మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు ప్రభుత్వం నడపాల్సి ఉంటుంది.
ఆ క్రమంలో ప్రయాణికుడు ఒకే మార్గంలో ఒక రైలు దిగి మరో రైలు ఎక్కాలి. లేదా అదే రైలులో ప్రయాణించాలంటే, టికెట్ ధరలు, కరెంటు ఖర్చులు, రైళ్ల నిర్వహణ, ఫ్రీక్వెన్సీ.. ఇవన్నీ ఎల్ అండ్ టీ అనే ప్రైవేటు కంపెనీతో ప్రభుత్వం పంచుకోవడం ఇబ్బందికరంగా మారుతుందనేది కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం.
ఇదే విషయంపై హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో మాట్లాడారు.
''ఎల్ అండ్ టీ తో డెఫినిటివ్ అగ్రిమెంట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ, ఎల్ అండ్ టీ మాత్రం డెఫినిటివ్ అగ్రిమెంట్ కంటే, తమ వాటా విక్రయానికి ముందుకు వచ్చింది. అందుకే ఎల్ అండ్ టీ వాటాను కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది'' అని చెప్పారు.
మొదటి దశ స్వాధీన ప్రక్రియ పూర్తయితే, రెండో దశ నిర్మాణంపై స్పష్టత వస్తుందని సర్ఫరాజ్ అహ్మద్ వివరించారు.
''ఫేజ్-2ఎ, 2బీ.. రెండింటికి డీపీఆర్ ఇచ్చాం. అప్పట్లో దానిపై కొన్ని సందేహాలు అడిగితే నివృత్తి చేశాం. ప్రస్తుతం కేంద్రం ఎలాంటి సందేహాలు లేవనెత్తలేదు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, IRFC
ఎల్ అండ్ టీతో హెచ్ఎంఆర్ఎల్ ఒప్పందం పూర్తి
ఎల్ అండ్ టీ నుంచి వాటా కొనుగోలుకు ఈ ఏడాది ఏప్రిల్ 29న ఎల్ అండ్ టీ, హెచ్ఎంఆర్ఎల్ ఒప్పందం చేసుకున్నాయి.
ఈక్విటీ కొనుగోలు ఒప్పందం కింద రూ.1461.47 కోట్లుగా హెచ్ఎంఆర్ఎల్ చెల్లించాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.
ఈ రుణాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రుణం కోసం ఈ ఏడాది మే 25న హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అగ్రిమెంట్ చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP via Getty Images
నిధుల మళ్లింపులో జాప్యం
త్రైమాసిక చెల్లింపుల విధానంలో 20 ఏళ్ల పాటు హెచ్ఎంఆర్ఎల్ రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
''రుణ మంజూరు ప్రక్రియ పూర్తయింది. కానీ, రుణ మొత్తం హెచ్ఎంఆర్ఎల్ ఖాతాకు బదలాయించే విషయంలో కొంత ఆలస్యం అయ్యింది. ఈ విషయంలో ఐఆర్‌ఎఫ్‌సీ కూడా సమస్య పరిష్కారానికి పనిచేస్తోంది.మేం కూడా మా సహాయసహకారాలు అందిస్తున్నాం. పెద్ద రుణం కాబట్టి అందుకు తగినట్టుగా ఆయా ప్రక్రియలు పూర్తి కావడానికి సమయం పడుతుంది'' అని సర్ఫరాజ్ అహ్మద్ బీబీసీతో చెప్పారు.
నిజానికి రుణానికి సంబంధించిన ఇన్వాయిస్‌ను హెచ్ఎంఆర్ఎల్ జూన్ 12న ఐఆర్‌ఎఫ్‌సీకి పంపినట్టుగా తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. జూన్ 15 నాటికి దాదాపు రూ.13,600 కోట్లు హెచ్ఎంఆర్ఎల్‌కు బదిలీ కావాల్సి ఉన్నా, కాలేదని ప్రభుత్వం చెబుతోంది.
''రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఆర్బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్‌కు అంగీకరించింది. ఐఆర్‌ఎఫ్‌సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ₹84.32 కోట్ల అప్‌ఫ్రంట్ ఫీజు చెల్లించింది. ఈక్విటీ ₹1,461.47 కోట్లు ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. అయినప్పటికీ రుణం డిస్బర్సల్ కాలేదు'' అని రేవంత్ రెడ్డి వివరించారు.
దీంతో మొదటి దశ స్వాధీనం పూర్తి కాకపోవడంతో రెండో దశ పనుల ప్రారంభంలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, X/TelanganaCMO
తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది?
ప్రస్తుతం ఎల్ అండ్ టీకి ఉన్న రూ.13,538.53 కోట్ల రుణానికి 8.25 శాతం వడ్డీ రేటుగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
ఈ అప్పును రీఫైనాన్స్ చేసే క్రమంలో ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి హెచ్ఎంఆర్ఎల్ తీసుకున్న రుణానికి నాలుగు శాతం వడ్డీ ఉందని వివరించారు.
ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రుణం రాకుండా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అడ్డు పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
''జూన్ 15 నాటికే రుణ బదలాయింపు కావాల్సి ఉంది. కానీ, దాన్ని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, X/kishanreddybjp
కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
''రూ.13,600 కోట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది వాళ్లు, వాళ్లు తేల్చుకోవాల్సిన అంశం. నేను దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మాట్లాడాను. మెట్రో ఆదాయంలో ముందుగా ఐఆర్‌ఎఫ్‌సీకి రుణాలను చెల్లించడానికి సీఎం ఒప్పందం కుదుర్చుకున్నారు'' అని కిషన్ రెడ్డి అన్నారు.
రుణాన్ని తిరిగి చెల్లించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు.
''దేశవ్యాప్తంగా అన్ని మెట్రోలు తీసుకున్న అప్పులను ముందే చెల్లించరు.. మెట్రో ఆదాయంలో ఆపరేషన్స్, మెయింటెనెన్స్‌కు ఖర్చు చేయాలి. ఆ తర్వాతే రుణాలు చెల్లించాలి. ఇదే విషయం ముఖ్యమంత్రికి సూచించాను. దీనికి సీఎం అంగీకరించలేదు.'' అని కిషన్ రెడ్డి చెప్పారు.
అయితే, ఈ వ్యవహారంపై చర్చించడానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేస్తే తాను వచ్చి అన్ని విషయాలు వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Twitter/Hyderabad Metro Rail
'కేంద్రం ముందుకు రాకపోతే మేమే నిర్మించుకుంటాం'
''మెట్రో ఫేజ్–2ను కేంద్రం, రాష్ట్రం 50:50 జాయింట్ వెంచర్‌గా ఆమోదించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది'' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ జూన్ 10న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో అహ్మదాబాద్ ఫేజ్-2ఎ మెట్రో రైల్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
అయితే, అదే సమయంలో హైదరాబాద్ మెట్రోకు ఆమోదం లభించలేదు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వ అనుమతులు ఆలస్యమైతే, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులు, సంస్థాగత రుణాల ద్వారా ఫేజ్–2ను నిర్మించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు.
''కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఐఆర్ఎఫ్‌సీ నుంచి రూ.30-40 వేల కోట్ల రుణాన్ని తీసుకుని రెండో దశ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉంది. అందుకు అవసరమైన నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) కేంద్రం ఇవ్వాలి'' అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP via Getty Images
మెట్రో నెట్‌వర్క్ ఎంత?
హైదరాబాద్‌లో ప్రస్తుతం ఫేజ్-1లో నిర్మించిన మెట్రో రైల్ 2017 నవంబరులో అందుబాటులోకి వచ్చింది.
పాతబస్తీకి విస్తరించాల్సిన కారిడార్ పనులు ఆస్తుల సేకరణ పూర్తి కాకపోవడంతో ఆగిపోయాయి. దీనివల్ల జేబీఎస్-ఫలక్‌నుమా వరకు నిర్దేశించిన మెట్రోరైలు లైనును ఎంజీబీఎస్ వరకే పరిమితం చేశారు.
''ఒకనాడు దేశంలో హైదరాబాద్ మెట్రోరైల్ నెట్‌వర్క్ రెండో స్థానంలో ఉండేది. ఇప్పుడా స్థానం పడిపోయింది'' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రస్తుతం దేశంలో దిల్లీతోపాటు కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్తాన్, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లో మెట్రో రైల్ నెట్ వర్క్ అందుబాటులోకి ఉంది.
2025 మార్చిలో కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు లోక్‌సభకు ఇచ్చిన సమాధానం మేరకు దేశంలో 1011.48 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది.
ఇందులో అత్యధికంగా దిల్లీలో 395.8 కిలోమీటర్లు, బెంగళూరులో 76.95 కిలోమీటర్లు, ముంబయిలో 88.86 కిలోమీటర్లలో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
ఇవి కాకుండా... దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో 979.46 కిలోమీటర్ల మెట్రో రైల్ మార్గం నిర్మాణంలో ఉన్నట్లుగా కేంద్రం తెలిపింది.
ఇందులో దిల్లీలో 138.5 కిలోమీటర్లు, ముంబయిలో 176.05 కిలోమీటర్లు, బెంగళూరులో 140.28 కిలోమీటర్లు, చెన్నైలో 118.9 కిలోమీటర్లు నిర్మాణంలో ఉంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























