అమెరికాలో అగ్ని సుడిగుండం.. ప్రాణాంతక ఎండలకు ఇది సూచనా

అగ్ని సుడిగుండం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియా సమీపంలో కనిపించిన అగ్ని సుడిగుండం
ప్రచురణ

భూమి మీద ఇప్పటి వరకు నమోదైన అత్యధికంగా ఉష్ణోగ్రత ఎంత ? 130 F అంటే 54.4 సెంటీగ్రేడ్‌.

ఇప్పుడు ఇంతకు మించిన ఉష్ణోగ్రతలు కాలిఫోర్నియాలోని డెత్‌వ్యాలీ నేషనల్‌ పార్క్‌లో నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయాన్ని అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్‌ ధ్రువీకరించింది.

అమెరికా పశ్చిమ తీరంలో మొదలైన హీట్‌వేవ్‌ కారణంగా ఇక్కడ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ వేడి కారణంగా కాలిఫోర్నియాలో రెండు రోజులపాటు విద్యుత్‌ నిలిచిపోయింది. శనివారం స్థానిక విద్యుత్ ప్లాంట్‌లో సాంకేతిక సమస్య కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

గతంలో నమోదైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

ఆదివారం ఫర్నెస్‌ క్రీక్‌ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకు ముందు అంటే 2013లో ఇక్కడ భూమి మీదనే అత్యధిక ఉష్ణోగ్రత 54 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది.

దానికి వందేళ్ల ముందు ఇదే డెత్‌వ్యాలీలో 56.6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే దీని మీద వివాదం కొనసాగుతోంది. ఈ గణాంకాలలో పొరపాట్లు ఉండి ఉండొచ్చని, ఆ సమయంలో అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పలుచోట్ల నమోదయ్యాయని వాతావరణ నిపుణులు వాదిస్తున్నారు.

1913లో ఇతరప్రాంతాలలో నమోదైన వేడి, డెత్‌వ్యాలీ నేషనల్‌ పార్క్‌ ఉష్ణోగ్రతలతో సరిపోలడం లేదని వాతావరణ చరిత్రకారుడు క్రిస్టోఫర్‌ బర్ట్‌ అన్నారు.

2016లో చేసిన విశ్లేషణ ఆధారంగా ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.

1931లో ట్యునీషియాలో 55 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అయితే వలస పాలనలో ఉన్న అప్పటి ఆఫ్రికాదేశాలలో నమోదైన ఉష్ణోగ్రతలలో వాస్తవికతపై అనుమానాలున్నాయని బర్ట్‌ అన్నారు.

కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ

ఇప్పుడు రాబోయే హీట్‌వేవ్‌ ఎలా ఉంటుంది ?

ప్రస్తుతం రాబోతున్న హీట్‌వేవ్‌ అరిజోనాకు నైరుతి ప్రాంతంలో, వాషింగ్టన్‌ స్టేట్‌కు వాయువ్య దిశలో విస్తరించింది.

వచ్చే సోమ, మంగళవారాలలో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరవచ్చని, ఆ తర్వాత వారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ వేడి తీవ్రత పది రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.

కాలిఫోర్నియా ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చడంతో లాసెన్ కౌంటీ సమీపంలో అగ్ని సుడిగుండం సంభవించింది.

కాలిఫోర్నియాకు విద్యుత్‌ను అందించే సిసో సంస్థ మూడో నెంబర్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. డిమాండ్‌ ఎక్కువగా ఉంటే విద్యుత్ సరఫరాను పెంచుతామని ప్రకటించింది.

ఈ ప్రాంతంలో ఎక్కువమంది సోలార్‌ విద్యుత్‌ను వాడుతుంటారు. అయితే వేడి కారణంగా ఎయిర్‌ కండీషనర్ల వాడకం ఎక్కువైతే, అది గ్రిడ్‌ మీద ప్రభావం పడి, అది పూర్తిగా పని చేయకుండా పోయే ప్రమాదం ఉంది.

అధిక డిమాండ్‌ సమయంలో విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలిపోకుండా అధికారులు అక్కడక్కడా పవర్‌కట్‌లు ప్రకటిస్తున్నారు.

ఈ హీట్‌వేవ్‌ ప్రభావం ఎలా ఉంటుంది?

రెండు, మూడు రోజులపాటు ఈ అధిక వేడి పరిస్థితులు ఉంటాయని, 32డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు.

ఈ హీట్‌వేవ్‌ కారణంగా, మిగతా ప్రకృతి వైపరిత్యాలకన్నా ఎక్కువ మరణాలు సంభవించే ప్రమాదం ఉందని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ ప్రివెన్షన్‌(సీడీసీ) ప్రకటించింది.

డీహైడ్రేషన్‌, వేడిపొక్కులు, వడదెబ్బలాంటి సమస్యలు వస్తాయని అధికారులు హెచ్చరించారు.

ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి ఈ హీట్‌వేవ్‌ ప్రమాదకరంగా మారుతుందని, శ్వాస, గుండె, కిడ్నీ సంబంధ సమస్యలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కరిగిపోయే రోడ్లు, విమానాల రాకపోకలకు అంతరాయాలు, విద్యుత్‌ గ్రిడ్‌లు కుప్పకూలి పోవడంలాంటి సమస్యలు ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

వ్యవసాయం మీద కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, కూరగాయ పంటలు దెబ్బతింటాయని, మొక్కల్లో వ్యాధులు ప్రబలే ప్రమాదముందుని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)