పాకిస్తాన్‌లో భూకంపం.. 22మంది మృతి, 300 మందికి గాయాలు

ప్రచురణ
చదివే సమయం: 1 నిమిషాలు

పాకిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 22 మంది మరణించారని, 300కు పైగా ప్రజలు గాయపడ్డారని పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని మీర్పూర్ డీఐజీ ప్రకటించారు.

భూకంప కేంద్రం మీర్పూర్ నగరానికి సమీపంలోనే ఉందని ఆయన అన్నారు.

"10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది మీర్పూర్ నగరమే" అని పాకిస్తాన్ వాతావరణ శాఖ ముఖ్య అధికారి ముహమ్మద్ రియాజ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో అన్నారు.

చనిపోయినవారిలో పిల్లలు కూడా ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.

వైద్యసహాయం అందించడానికి బృందాలను పంపించామని పాకిస్తాన్ సైన్యం వెల్లడించింది.

మీర్పూర్‌లోని అనేక కార్యాలయాల్లోని ప్రజలు భూకంపం సంభవించడంతో రోడ్లపైకి పరుగులు తీశారు.

గోర్సియాన్, జాట్లాన్, భీంభర్ వంటి అనేక ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి.

ఈ భూకంప తీవ్రతకు జాట్లాన్ సమీపంలో రెండు బ్రిడ్జిలు కుప్పకూలాయి. విద్యుత్ వ్యవస్థ స్తంభించింది.

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని మీర్పూర్‌కు వెళ్లే రహదారి అనేక చోట్ల భారీ పగుళ్లిచ్చింది.

2005లో పాకిస్తాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో వేలాదిమంది చనిపోయారు.

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి.

ఈ వీడియో చూశారా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)