You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
క్యారీ బ్యాగ్ ఉచితంగా ఇవ్వాల్సిందే.. డీమార్ట్‌కు జరిమానా - తెలంగాణ వినియోగదారుల ఫోరం : ప్రెస్ రివ్యూ
సరుకులు కొంటే క్యారీబ్యాగ్ ఉచితమే
సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌మాల్స్, వాణిజ్య సముదాయాల్లో సరుకులు కొన్న వినియోగదారులకు ఉచితంగా క్యారీబ్యాగ్‌లు ఇవ్వాల్సిందేనని, లేదంటే చర్యలు తప్పవని తెలంగాణ వినియోగదారుల ఫోరం హెచ్చరించిందని 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.
''క్యారీబ్యాగ్‌పై షాప్ లోగో ఉన్నా లేకున్నా వినియోగదారుల నుంచి డబ్బులేమీ వసూలు చేయకూడదని ఆదేశించింది. ఓయూ విద్యార్థి బెగ్లెకర్ ఆకాశ్‌కుమార్ ఫిర్యాదుపై విచారణ అనంతరం ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆకాశ్‌కుమార్ 2019 మే 5న హైదర్‌గూడలోని డీమార్ట్‌లో రూ.602.70 విలువైన నిత్యవసర వస్తువులను కొనుగోలు చేశాడు. క్యారీబ్యాగ్‌కు రూ.3.50 వసూలు చేయడంతో వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుచేశాడు.
ఫోరం దీనిపై మంగళవారం తీర్పు వెల్లడించింది. ఆకాశ్‌కుమార్ నుంచి వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతోపాటు పరిహారంగా అతనికి రూ.1,000, న్యాయసేవా కేంద్రానికి మరో రూ.1,000 చొప్పున 45 రోజుల్లోగా చెల్లించాలని హైదర్‌గూడ డీమార్ట్ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు'' నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.
'తెలంగాణ మంత్రులు ప్రజల కోసం పని చేయకుండా, రాజకీయం చేయడానికే ఇష్టపడుతున్నారు' - పీయూష్ గోయల్
వడ్ల కొనుగోళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడినట్లు 'వెలుగు' పేర్కొంది.
హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓడిపోవడంతోనే కేసీఆర్ ఇలా కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అన్నారు.
ఉప ఎన్నికల్లో ఓడించారనే ప్రజలు, రైతులను కేసీఆర్ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.
మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ నేతలతో పీయూష్ గోయల్ సమావేశమయ్యారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ 'వడ్ల సేకరణలో తెలంగాణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని, స్పెషల్ కేస్ కింద ఆ ఒక్క రాష్ట్రం నుంచే బాయిల్డ్ రైస్ తీసుకుంటున్నామని' చెప్పారు.
అయినా రాష్ట్ర సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తూ, రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ రైతుల భవిష్యత్ కోసం రాష్ట్ర బీజేపీ నేతలు కృషి చేస్తున్నారన్నారు.
ఐదేండ్లలో బియ్యం సేకరణను మూడు రెట్లు పెంచామని, రైతులకు ఇచ్చే మద్దతు ధరను ఐదుసార్లు పెంచామని ఆయన గుర్తు చేశారు.
''పోయినేడాది కోటానే రాష్ట్ర సర్కార్ ఇంకా ఇవ్వలేదు. పోయిన యాసంగి సీజన్‌లో ఎఫ్‌సీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ నుంచి ఇంకా 14 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్, 13 లక్షల టన్నుల రా రైస్ రావాల్సి ఉంది.
దీనిపై చాలాసార్లు సంప్రదింపులు జరిపాం. నాలుగుసార్లు గడువు పొడిగించాం. అయినా బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైంది.
నేను ముంబైలో ఉన్నప్పుడు తెలంగాణ మంత్రులు దిల్లీకి వచ్చి కూర్చోవడం ఏంటి. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర మంత్రులంతా బిజీగా ఉన్నారు. తెలంగాణ మంత్రులు ప్రజల కోసం పని చేయకుండా, రాజకీయం చేయడానికే ఇష్టపడుతున్నారని'' ఆయన విమర్శించారు.
మరోవైపు, వానాకాలంలో మిగిలిన వడ్లనూ కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. వడ్ల కొనుగోళ్లపై రాతపూర్వకంగా హామీ ఇస్తేనే తాము దిల్లీ నుంచి వెళతామని చెప్పారు.
''ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బియ్యం సేకరణ కోటా పెంచకపోతే రాష్ట్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలా? మూసివేయాలో? చెప్పాలని అడిగాం.
దీనిపై నోటి మాటగా కాకుండా రాతపూర్వకంగా హామీ ఇస్తేనే తాము రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశాం.
రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రమంత్రి ఒకట్రెండు రోజుల టైమ్ అడిగారు''అని నిరంజన్ రెడ్డి చెప్పినట్లు వెలుగు వెల్లడించింది.
హైదరాబాద్‌లో చికిత్స చేసిన డాక్టర్‌కే ఒమిక్రాన్
సూడాన్ దేశం నుంచి వచ్చిన ఓ ఒమిక్రాన్ రోగికి (44) క్యాన్సర్ చికిత్స చేస్తుండగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యునికి ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకినట్లు 'సాక్షి' తెలిపింది.
''రోగి ద్వారానే ఆ వైద్యుడికి వైరస్ వ్యాపించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ డాక్టర్, పేషెంట్‌తో కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లందరినీ ఆస్పత్రి యాజమాన్యం క్వారంటైన్‌కు పంపింది.
ఇలా రాష్ట్రంలో ఒకరి నుంచి మరొకరికి ఒమిక్రాన్ వ్యాపించడం ఇదే తొలిసారి. డాక్టర్‌తో కలిపి మంగళవారం రాష్ట్రంలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
మిగిలిన ముగ్గురిలో ఒకరు సూడాన్ వాసి, ఇద్దరు సోమాలియా దేశస్తులు. తాజా కేసులతో రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 24కు పెరిగింది. వీళ్లందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
సూడాన్ దేశం నుంచి ఈ నెల 14న క్యాన్సర్ రోగి నగరానికి వచ్చారు. సూడాన్ నాన్ రిస్క్ కేటగిరీలో ఉండటంతో ప్రయాణికులకు ర్యాండమ్‌గా టెస్టులు చేసి పంపారు.
ఆ సుడాన్ వాసికి ఇక్కడి ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స ప్రారంభించారు. అయితే ఆయనకు కరోనా ఉందని వెల్లడవడంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా ఒమిక్రాన్ ఉన్నట్టు 16న తేలింది.
అయితే ఆ క్యాన్సర్ రోగికి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆస్పత్రి వర్గాలు జాగ్రత్తలు తీసుకొని చికిత్స చేయడం ప్రారంభించాయి.
ఈ క్రమంలో వైద్యుడికి కొత్త వేరియెంట్ వ్యాపించింది. అప్రమత్తౖమైన వైద్యారోగ్య శాఖ ఆ వైద్యుడి కుటుంబీకులు, అతనితో సన్నిహితంగా మెలిగిన ఇతర వైద్య సిబ్బంది, రోగుల నుంచి నమూనాలను సేకరిస్తోంది.
ఆ వైద్యుడి నుంచి ఇంకెంతమందికి వైరస్ అంటిందోనని ఆందోళన నెలకొన్నట్లు'' సాక్షి వెల్లడించింది.
సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న పవన్ సినిమా
పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.
''పాన్ ఇండియా చిత్రాలైన 'ఆర్.ఆర్.ఆర్', 'రాధే శ్యామ్'లకు చోటు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో 'భీమ్లా నాయక్' నిర్మాత చినబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ సంక్రాంతికి 'ఆర్.ఆర్.ఆర్', 'రాధే శ్యామ్'లతో పాటు 'భీమ్లా నాయక్' కూడా విడుదల కావాల్సింది. అయితే... మూడు చిత్రాలూ ఒకేసారి వస్తే థియేటర్లకు ఇబ్బంది ఏర్పడుతుంది.
అందుకే ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగి 'భీమ్లా నాయక్' బృందానికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఆ చర్చలు సఫలీకృతమయ్యాయి.
అందుకే జనవరి 12న రావాల్సిన 'భీమ్లా నాయక్'... ఫిబ్రవరి 25కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రొడ్యూసర్ గిల్డ్ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
దిల్ రాజు మాట్లాడుతూ ''పవన్ కల్యాణ్, చినబాబు గార్లు మా పరిస్థితిని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించారు. అందుకే 'భీమ్లా నాయక్' చిత్రాన్ని వాయిదా వేశారు. అందుకు 'భీమ్లా నాయక్' బృందానికి కృతజ్ఞతలు. ఫిబ్రవరి 25న 'భీమ్లా నాయక్' విడుదల అవుతుంది'' అని చెప్పారు.
ఈ సమావేశంలో డి.వి.వి దానయ్య, దామోదర్ ప్రసాద్, స్రవంతి రవికిషోర్, ప్రమోద్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 5,500 కోట్ల పరిహారం ఇచ్చి ఆరో భార్యతో విడాకులు
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- పన్ను ఎగ్గొట్టిన లైవ్ స్ట్రీమర్‌కు రూ.1600 కోట్ల జరిమానా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- హంసా నందినికి క్యాన్సర్ : వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా..
- ఒమిక్రాన్: 'జీవితం కోల్పోవడం కంటే... ఒక ఈవెంట్ రద్దు చేసుకోవడం మంచిది': డబ్ల్యూహెచ్ఓ చీఫ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)