You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిదాంబి శ్రీకాంత్: BWF వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన తొలి భారతీయుడు
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్-2021లో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ రజత పతకం గెల్చుకున్నారు. బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్ మెన్ సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించిన 28 ఏళ్ల శ్రీకాంత్ మీద లో కియాన్ యూ విజయం సాధించారు. దాంతో, శ్రీకాంత్‌కు స్వర్ణ పతకం తృటిలో తప్పినట్లయింది.
సెమీ ఫైనల్స్‌లో ఆయన లక్ష్య సేన్‌ను ఓడించి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్ ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు.
సింగపూర్ ఆటగాడు లో కియాన్ యూ 21-15, 22-20 స్కోర్‌తో శ్రీకాంత్‌ను ఓడించాడు. బీడబ్ల్యూఎఫ్‌లో ఒక సింగపూర్ ఆటగాడు గోల్డ్ గెలవడం ఇదే మొదటిసారి.
మొదట్లో 9-3తో మంచి లీడ్‌లో ఉన్నట్లు కనిపించిన శ్రీకాంత్ ఆ తరువాత 21-15తో తొలి గేమ్ కోల్పోయారు. 43 నిమిషాలు సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో కియాన్‌దే చివరకు పైచేయి అయింది.
అంతకు ముందు, ఇద్దరు భారత క్రీడాకారుల మధ్య పోటాపోటీగా జరిగిన సెమీ పైనల్లో ప్రపంచ మాజీ నంబర్ వన్ శ్రీకాంత్ చేతిలో ఓడిన లక్ష్య సేన్ కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇప్పటివరకూ భారత్ నుంచి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాలను ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే గెల్చుకున్నారు. ప్రకాశ్ పదుకోన్ 1983లో ఈ ఘనత సాధించగా, ఆ తరువాత 36 ఏళ్లకు బి. సాయి ప్రణీత్ మరో పతకాన్ని గెల్చుకున్నారు. తాజాగా లక్ష్య సేన్ కాంస్య పతకంతో, శ్రీకాంత్ రజత పతకంతో ఈ బృందంలో చేరారు.
ఇక ఆడలేరనుకున్నారు...
ఇది సుమారు ఏడున్నరేళ్ల క్రితం జరిగిన సంఘటన. జూలై 2014 కిదాంబి శ్రీకాంత్ ఇండోనేసియాలో మ్యాచ్ ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఓ రోజు విశ్రాంతి తీసుకున్న తర్వాత మర్నాడు శిక్షణలో భాగంగా గోపీచంద్ అకాడమీకి వెళ్లారు. ఎప్పటిలాగే ప్రాక్టీస్ మొదలైంది.
కానీ, అతని బాడీ లాంగ్వేజీ చూసిన తోటి ఆటగాళ్లకు శ్రీకాంత్‌కు ఆరోగ్యం సరిగ్గా లేదన్న విషయం అర్థమైంది. ఏమైందని వారు అడిగినప్పుడు కాస్త తలనొప్పిగా ఉందని అన్నారు. పెద్దగా పట్టించుకోవాల్సినవసరం లేదంటూ ప్రాక్టీస్ కొనసాగించారు. కానీ, కాసేపటికే శ్రీకాంత్ స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకొని వెళ్లగా ఆయన మెనింజైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు తేల్చారు వైద్యులు.
తిరిగి శ్రీకాంత్‌కు స్పృహ వచ్చిన తర్వాత అకాడమీలోని తన తోటి ఆటగాళ్లను కూడా ఆయన గుర్తించలేకపోయారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్టుల్లో సత్తా చూపాల్సిన ఆటగాడు ఐసీయూలో ఉండటం అందర్నీ నిశ్చేష్టుల్ని చేసింది. మళ్లీ కోర్టులో మునుపటి శ్రీకాంత్ కనిపిస్తారా అన్న ప్రశ్నకు అంతా ఆయన చేతుల్లోనే ఉందని తేల్చి చెప్పారు వైద్యులు.
దీంతో, శ్రీకాంత్ కెరీర్ ముగిసిపోతుందేమో అనుకున్నారంతా. కానీ, కేవలం నాలుగు నెలల కాలంలోనే పూర్తిగా కోలుకొని మళ్లీ కోర్టులో రాకెట్‌తో ప్రత్యక్షమయ్యారు శ్రీకాంత్. ఆ తర్వాత 2014 నవంబర్ 16న చైనాకు చెందిన ఆల్ టైం గ్రేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ లిన్ డాన్‌ను ఓడించి సంచలనం సృష్టించారు.
లిన్ డాన్ అప్పటికే రెండు సార్లు ఒలింపిక్ ఛాంపియన్, ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షిప్ సహా ఐదు ప్రపంచ టైటిళ్లు సాధించిన క్రీడాకారుడు. ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లకు కూడా లిన్‌ను ఓడించడం సాధ్యం కాలేదు. అలాంటిది అతడ్ని ఓడించడంతో ఒక్కసారిగా శ్రీకాంత్ పేరు మారు మోగిపోయింది.
గుంటూరు కుర్రోడు
1993 ఫిబ్రవరి 7న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జన్మించారు శ్రీకాంత్. అయితే, కుటుంబం గుంటూరులోనే ఉండేది. తండ్రి వృత్తి వ్యవసాయం. మొదట్లో తన సోదరుడితో కలిసి బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు. ఆయన టాలెంట్ మాత్రం హైదరాబాద్‌లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో చేరిన తర్వాతే బయటపడింది. శ్రీకాంత్ ఎత్తు, టెక్నిక్ చూసిన గోపీచంద్ ఆయనను డబుల్స్‌పై కాకుండా సింగిల్స్‌పై దృష్టిపెట్టేలా ప్రోత్సహించారు. అలా 2014లో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ దిశగా శ్రీకాంత్ అడుగులు పడ్డాయి.
అంతర్జాతీయ స్థాయిలో వరుసగా రెండేళ్ల పాటు అత్యుత్తమ ఆట తీరు కనబర్చడంతో 2016లో జరిగిన రియో ఒలంపిక్స్‌లో శ్రీకాంత్ కచ్చితంగా పతకం సాధిస్తారని అంతా ఆశించారు. క్యార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ ప్రత్యర్థి ప్రపంచ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లిన్ డాన్ ఆయన ఆశలపై నీళ్లు చల్లారు. అయితే 2018లో జరిగిన డెన్మార్క్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో లిన్ డాన్ ఓడించి గత ఓటమికి బదులు తీర్చుకున్నారు.
2017లో వరుసగా నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు సాధించడంతో ప్రంపంచ నెంబర్ వన్ ర్యాంక్‌కు దగ్గరయ్యారు. 2018లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ విభాగంలో స్వర్ణం, సింగిల్స్‌లో రజతం సాధించడంతో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా నిలిచారు. అయితే ఆ తరువాత వెంటాడిన గాయాలు ఆయన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి.
కథలు వినడం, స్నేహితులతో కలిసి సినిమాలు చూడటం శ్రీకాంత్ హాబీలు. బ్యాడ్మింటన్ కెరియర్ ముగిసిన తర్వాత దర్శకునిగా మారాలన్నది కూడా అతని అభిమతం. అయితే దర్శకునిగా మైక్ పట్టే ముందే ఫిల్మ్ మేకింగ్‌లో కోర్సు పూర్తి చేస్తారట కూడా. మహేంద్ర సింగ్ ధోనీ, రోజర్ ఫెడరర్‌లు శ్రీకాంత్ వీరాభిమాని.
సూపర్ సిరీస్ విజయాలు:
2014 - చైనా
2015- ఇండియా ఓపెన్
2017- ఇండోనేషియా
2017-ఆస్ట్రేలియా
2017-డెన్మార్క్
2017-ఫ్రెంచ్
2018 కామెన్ వెల్త్ క్రీడలు, ఆస్ట్రేలియా -రజతం
2016 దక్షిణాసియా క్రీడలు, షిల్లాంగ్- స్వర్ణం
గ్రాండ్ ప్రిక్స్
2016- సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ - స్వర్ణం
2015- స్విస్ ఓపెన్ - స్వర్ణం
2015-- సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్
2014- సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్
2013-థాయిలాండ్ ఓపెన్
ఇవి కూడా చదవండి:
- క్వాంటం కంప్యూటర్: ఈ టెక్నాలజీలో అమెరికా సహా అనేక ప్రపంచ దేశాలతో ఇండియా ఎందుకు పోటీ పడుతోంది?
- ఆంధ్రప్రదేశ్: ఏ సినిమాకైనా ఒకే టికెట్ ధర నిబంధనపై వివాదం ఏమిటి? దీన్ని ఎందుకు కొందరు వ్యతిరేకిస్తున్నారు
- ‘ఒకడు ప్రకృతి.. మరొకడు ప్రళయం’
- ‘బీబీసీ న్యూస్ తెలుగు’కు ఆదరణ.. 52 శాతం పెరిగిన ఆడియన్స్
- ‘ప్రేమ, అభిమానం లేని భర్తతో సెక్స్ ఎలా సాధ్యం? నాకు ఆయనతో కలవాలనే కోరిక ఎలా కలుగుతుంది’
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆ దేశాన్ని అప్పుల్లో ముంచిందా
- అత్యాచారం, హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది, మరణ శిక్ష కావాలని నిందితుడు కోరాడు.. హైకోర్టు నిర్దోషిగా ఎలా విడుదల చేసింది?
- కరోనావైరస్: జపాన్‌లో ఒక్కసారిగా తగ్గిన కోవిడ్ కేసులు - డెల్టా వేరియంట్ అంతమైనట్లేనా?
- దక్షిణాఫ్రికా వేరియంట్: సరిహద్దులు మూసేస్తున్న దేశాలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు
- కోవిడ్‌తో యూరప్‌లో మరో 7 లక్షల మంది చనిపోయే ప్రమాదం ఉందన్న డబ్ల్యూహెచ్ఓ
- చరిత్ర: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)