తెలంగాణ: దెయ్యం ఉందంటూ హాస్టల్లో శాంతి పూజలు - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆదివారం శాంతిపూజలు చేసినట్లు 'సాక్షి' పేర్కొంది.

''వసతి గృహంలో దెయ్యం ఉందంటూ విద్యార్థినులు శుక్రవారం రాత్రి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కిందపడటంతో కొందరికి గాయాలయ్యాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం హాస్టల్‌కు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ వసతిగృహంలో అడుగుపెట్టడానికి విద్యార్థినులు భయపడుతున్నారు.

దీంతో 'శాంతి పూజలు చేశాం. వేదపండితుల సమక్షంలో దెయ్యం పారిపోవాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాం. దెయ్యం వసతి గృహంవైపు రాకుండా అష్టదిగ్బంధనం చేశాం' అని మామిడిగూడ ఆదివాసులు తెలిపారు.

వసతి గృహంలో ఎలాంటి దెయ్యం లేదని, వదంతులు నమ్మొద్దని కోరారు. విద్యార్థులకు ధైర్యం కలిగేలా ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.

కరోనాతో పిల్లలు రెండేళ్లు చదువులు నష్టపోవాల్సి వచ్చిందని, మళ్లీ దెయ్యం ఉందనే అపోహలు నమ్మి పిల్లల చదువులకు ఇబ్బందులు కలిగించొద్దని తల్లిదండ్రులను కోరారు.

ఇంటికి వెళ్లిన విద్యార్థినులను పాఠశాలకు పంపించాలని, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తులందరం అండగా ఉంటామని తెలిపినట్లు'' సాక్షి రాసుకొచ్చింది.

నేడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో జరుగనున్నట్లు 'నమస్తే తెలంగాణ' వెల్లడించింది.

''ఈ సమావేశంలో వరి ధాన్యం సేకరణ విషయంలో కేందప్రభుత్వ వైఖరిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నది.

కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది.

యాసంగిలో వరిధాన్యం తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పటంతో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ రాష్ట్రంలో ప్రవేశించకుండా అడ్డుకొనే చర్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు'' నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది.

కొండాపూర్లో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు మృతి

గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా.. ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతిచెందినట్లు 'వెలుగు' కథనం తెలిపింది.

''ఈ విషాద ఘటన కొండాపూర్‌లో జరిగింది. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమ దుర్గ అపార్ట్మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలని 'డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్' అనే ప్రైవేట్ సంస్థను సంప్రదించారు.

దాంతో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం అంజి (30), శ్రీను(32) అనే ఇద్దరు కూలీలు అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు.

సెప్టిక్ ట్యాంక్ లోకి దిగి శుభ్రం చేస్తుండగా.. వారిద్దరూ ఊపిరాడక మృతిచెందారు. మృతులను సైదాబాద్ సమీపంలోని సింగరేణి కాలనీ చెందిన వారిగా గుర్తించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న మాదాపూర్ ఫైర్ సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు.

మృతుల స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గాజీనగర్ గ్రామంగా పోలీసులు తెలిపారని'' వెలుగు పేర్కొంది.

నేడు దక్షిణ కోస్తా, సీమలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం పేర్కొంది.

'' రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లో వాన జల్లులు పడుతున్నాయి. రానున్న 48గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయానికి నెల్లూరు జిల్లాలో సరాసరి 56.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులన్నీ నిండుగా ఉండటంతో వర్షపు నీరు రోడ్లపై పారుతోంది.

పెన్నా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. పెన్నాకు మళ్లీ వరద పోటెత్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కడప జిల్లాలో ఆదివారం కురిసిన భారీవర్షాలతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగడంతో పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. శేషాచలం అడవుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వేకోడూరు చెంతనే గుంజన నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

చిత్తూరు జిల్లా నగరి మండలం తెరణి గ్రామం వద్ద బ్రిడ్జి తెగిపోయింది. శ్రీకాళహస్తి మండలంలో కాండ్రగుంట చెరువు తెగింది. తిరుమలలోనూ ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. సాయంత్రం 4గంటలకు అలిపిరి కాలినడక మార్గాన్ని మూసివేశారు.

కొమెరిన్‌, శ్రీలంక పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆదివారం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించాయి.

కాగా సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు అన్నదాత కంట నీరు తెప్పిస్తున్నాయి. వారం క్రితం కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుత వర్షాలతో నిండా మునిగిపోయినట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పలు జిల్లాల్లో వరి, పత్తి, మిర్చి, శనగ, వేరుశనగ, టమాటా, ఉల్లి, ఇతర ఉద్యాన పంటలకు తీరని నష్టం వాటిల్లుతోంది. మరో రెండ్రోజులు వర్షం కొనసాగితే కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలి కంకులు మొలకెత్తుతాయని రైతులు వాపోతున్నారని'' ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)