తెలంగాణ: చనిపోయిన తాతను ఫ్రిజ్‌లో కుక్కేసిన మనవడు, ఎందుకంటే..– ప్రెస్‌రివ్యూ

వృద్ధుడు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

పింఛను డబ్బుల కోసం ఓ మనవడు తాత మృతదేహాన్ని ఫ్రిజ్‌లో కుక్కేశాడని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

‘‘కామారెడ్డి జిల్లా కామారానికి చెందిన బైరం బాలయ్య (90) రిటైర్డ్‌ టీచర్‌. పదేళ్ల క్రితం కుటుంబంతో ఆయన పరకాలకు వచ్చారు. ఏడేళ్లుగా పొరండ్ల కైలాసం కాంప్లెక్స్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈయనకు హరికిషన్‌ ఏకైక కుమారుడు. హరికిషన్‌ భార్య గతంలోనే చనిపోయింది. హరికిషన్‌కు కుమారుడు నిఖిల్‌ (22) ఉన్నాడు. పౌరోహిత్యం చేసుకునే హరికిషన్‌ 2019లో ఓ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాలయ్య భార్య నర్సమ్మ రెండు నెలల క్రితం కరోనాతో చనిపోయింది. దీంతో ఇంట్లో బాలయ్య, నిఖిల్‌ మాత్రమే ఉంటున్నారు.

పదో తరగతితో చదువు మానేసిన నిఖిల్‌, బాలయ్యలకు నెలకు వచ్చే రూ.40 వెల పెన్షన్‌ డబ్బులే ఆధారం.

మూడు రోజులుగా బాలయ్య అద్దెకు ఉంటున్న ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నట్లు ఇంటి ఓనర్‌కు చుట్టుపక్కల వారు సమాచారమిచ్చారు.

గురువారం ఇంటి యజమాని కైలాసం, పోర్షన్‌లోకి ప్రవేశించి వెతికారు. చివరికి నిఖిల్‌ను గట్టిగా నిలదీసేసరికి తాత చనిపోయాడని.. అంత్యక్రియలకు డబ్బుల్లేక ఫ్రిజ్‌లో పెట్టినట్లు ఏడుస్తూ చెప్పాడు. పోలీసులకు సమాచారమివ్వడంతో వారొచ్చి ఫ్రిజ్‌ ఓపెన్‌ చేసి చూసేసరికి బాలయ్య మృతదేహం కనిపించింది.

మృతదేహం పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో బాలయ్య చనిపోయి మూడు, నాలుగు రోజులు అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని కైలాసం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించకపోవడంతో బాలయ్యది సహజ మరణమేనని పోలీసులు ధ్రువీకరించారని పత్రిక రాసింది.

బాలయ్య చనిపోవడంతో తాతకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో పడాల్సిన జూలై నెల పింఛను డబ్బులు రావని నిఖిల్‌ ఆందోళన చెందాడు.

పింఛను డబ్బులు బ్యాంకు ఖాతాలో జమయ్యే దాకా తాత చనిపోయిన విషయం తెలియనివ్వకుండా చేసేందుకే మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఏమీ ఎరుగనట్లు ఉంటున్నాడు.

ఈ లోగా పింఛను డబ్బులు రూ.40వేలు పడ్డాయి. అయినా తాత మృతిచెందాడనే విషయాన్ని బయట పెట్టకుండా ఖాతాలోని డబ్బును డ్రా చేసుకున్నాడు అని ఆంధ్రజ్యోతి రాసింది.

గాయత్రి భార్గవి

ఫొటో సోర్స్, Instagram/Gayatri Bharghavi

యాంకర్‌ భార్గవి ఫేస్‌బుక్ హ్యాక్.. కొన్ని మతాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు

యాంకర్‌, నటి గాయత్రి భార్గవి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాకింగ్‌కు గురైందని, ఆమె అకౌంట్ నుంచి కొన్ని మతాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారని సాక్షి వెల్లడించింది.

‘‘ఈ అంశంపై ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్‌ మాట్లాడారు. యాంకర్‌ భార్గవి ఎఫ్‌బీ అఫీషియల్‌ అకౌంట్‌తో హ్యాక్‌కు గురైందని తెలిపారు.

మరోవైపు దుండగులు ఆమె పేరుతో మరో అకౌంట్‌ను క్రియేట్‌ చేసినట్లు గుర్తించామన్నారు.

సోషల్‌ మీడియాలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పకప్పుడు పాస్‌ వర్డ్స్‌ను మార్చుకోవాలని సూచించారు.

యాంకర్‌ భార్గవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు’’అని సాక్షి తెలిపింది.

రోడ్లు మీదే కొట్లాట

ఫొటో సోర్స్, UGC

బాయ్‌ఫ్రెండ్‌ కోసం రోడ్డుమీదే యువతుల బాహాబాహీ.. వీడియో వైరల్

ఓ బాయ్‌ఫ్రెండ్‌ కోసం ఇద్దరు యువతులు నడిరోడ్డు మీదే బాహాబాహీకి దిగారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘ఝార్ఖండ్‌లోని సరాయకేలాలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియో రూపంలో వైరల్‌ అయింది.

వారికి సర్దిచెప్పేందుకు ఓ యువకుడు, మరో యువతి ప్రయత్నించారు. కానీ వారు వినిపించకోనట్లుగా వీడియోలో కనిపించారు.

కింద పడిపోయినా సిగపట్లు వదలని వారిని అతి కష్టం మీద చుట్టుపక్కల వారు విడదీశారు.

పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి యువతులిద్దరూ పరారయ్యారు’’అని ఈనాడు తెలిపింది.

పాయం వెంకటేశ్వరులు

ఫొటో సోర్స్, Facebook/Payam Venkateswarlu

మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలు

పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రజా ప్రతినిధుల కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించిందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువుకావడంతో 6 నెలల జైలు శిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.

పాయం వెంకటేశ్వర్లు ఎన్నికల్లో డబ్బులు పంచారన్న ఆరోపణలతో 2018లో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.

అభియోగం రుజువు కావడంతో కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో రూ. 10 వేలు జరిమాను వెంకటేశ్వర్లు చెల్లించారు. తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు జైలు శిక్షను ప్రజా ప్రతినిధుల కోర్టు నిలిపివేసింది’’అని వెలుగు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)