ఆర్య: తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆర్యపై యువతి ఫిర్యాదు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Facebook/Arya
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70లక్షలు తీసుకుని మోసగించాడని నటుడు ఆర్యపై సైబర్ క్రైం పోలీసులకు శ్రీలంక యువతి ఫిర్యాదు చేశారని ఈనాడు తెలిపింది.
‘‘ఈ కేసు విషయమై నటుడు ఆర్య మంగళవారం రాత్రి సైబర్‌క్రైం పోలీసుల ఎదుట హాజరయ్యారు.
తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న ఆర్య 2019లో నటి సాయేషాను వివాహమాడారు. వీళ్లకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది.
జర్మనీలో ఉంటున్న శ్రీలంకకు చెందిన యువతి విద్జా.. నటుడు ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70లక్షలు తీసుకుని మోసగించినట్లు జర్మని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే భారత రాష్ట్రపతి, ప్రధానులకూ ఆమె లేఖ రాశారు.
దీంతో నటుడు ఆర్యకు చెన్నైలోని సైబర్‌క్రైం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆ ప్రకారం మంగళవారం రాత్రి ఆర్య సైబర్‌క్రైం ఇన్‌స్పెక్టర్ గీత ఎదుట హాజరయ్యారు.
సుమారు మూడు గంటల పాటు విచారణ జరిగింది. విచారణ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు ఆర్య. కోర్టు విచారణలో ఉన్న ఈ కేసు ఈనెల 17న మళ్లీ విచారణకు రానుంది’’అని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలో ‘డెల్టా’ కేసులే ఎక్కువ
తెలంగాణలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా డెల్టా వేరియంట్ రకానివే ఉన్నట్లు తేలిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘క్రమంగా ఈ వేరియంటే స్థిరపడిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో రోజురోజుకూ డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసుల శాంపిళ్లను శాస్త్రవేత్తలు జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఆ వివరాలు తాజాగా గ్లోబల్ ఇన్షియేటివ్ ఆన్ షేరింగ్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్‌ఏఐడీ)లో పొందుపరిచారు.
అన్ని దేశాల జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాను ఇందులోనే అధికారికంగా పొందుపరుస్తారు. ఇందులో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో డెల్టా వేరియంట్ ఏ స్థాయిలో ఉందో ప్రస్తావించడం గమనార్హం.
జులైలో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 95 శాతం డెల్టా వేరియంట్‌వేనని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో జగిత్యాల, జనగాం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్, ములుగు, నాగర్‌కర్నూలు, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి, వరంగల్ వంటి 14 జిల్లాల్లో నమోదైన కేసులన్నీ డెల్టా వేరియంట్‌వేనని నిర్ధారించారు. హైదరాబాద్‌లో నమోదైన వాటిల్లో 94 శాతం, గద్వాల జిల్లాలో 93%, సూర్యాపేట జిల్లాలో 86% కేసులు డెల్టా రకానివని తేల్చారు’’అని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
నేడు శ్రీశైలానికి అమిత్‌షా
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుటుంబసమేతంగా గురువారం శ్రీశైలానికి రానున్నారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
‘‘అమిత్ షా ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో దిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12.25 గంటలకు సున్నిపెంటకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకుంటారు.
మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య మల్లన్నను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు భ్రమరాంబ అతిథి గృహంలో భోజనం చేస్తారు.
మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాదుకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 3.50 గంటలకు దిల్లీకి బయలుదేరతారు.
తొలిసారిగా మల్లన్న దర్శనానికి శ్రీశైలం వస్తున్న అమిత్ షాకు స్వాగతం పలకడానికి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఏపీ దేవదాయ శాఖ కమిషనర్ వాణీ మోహన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా,తెలంగాణ బీజేపీనేత ఈటె ల రాజేందర్‌కూడా శ్రీశైలం వస్తున్నట్లు సమాచారం’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
వివాహితకు ప్రేమలేఖలు రాస్తే నేరమే: బాంబే హైకోర్టు
వివాహిత మహిళకు లవ్ లెటర్ రాస్తే అది కచ్చితంగా నేరమేనని బాంబే హైకోర్టు స్పష్టం చేసిందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘ఓ మహిళకు తన క్యారెక్టరే విలువైందని కోర్టు తెలిపింది. ప్రేమ పేరుతో పెళ్లైన మహిళకు లెటర్ పంపటమంటే ఆమెను అవమానించినట్లేనంది.
పెళ్లైన మహిళకు లవ్ లెటర్ రాసిన వ్యక్తికి బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ ధర్మాసనం రూ.90వేల జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధించింది.
2011లో నాగపూర్‌లో కిరాణ షాప్ నడిపే వ్యక్తి అక్కడ పనిచేసే పెళ్లయిన మహిళకు లవ్ లెటర్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవటంతో లవ్ లెటర్‌ను ఆమెపైకి విసిరేశాడు.
ఆ తర్వాత రోజు కూడా ఇదే విధంగా చేయటంతో బాధితురాలు అకోలా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో సెషన్స్ కోర్టు నిందితునికి రెండేళ్ల కారాగార శిక్ష, రూ. 40 వేలు జరిమానా విధించింది.
తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. బాధిత మహిళపైనే ఆరోపణలు చేశాడు. తనకు డబ్బులు ఇవ్వాల్సి ఉందని అడిగినందుకే ఇలా తప్పుడు ఆరోపణలు చేసిందంటూ హైకోర్టులో తెలిపాడు. అయితే.. ఈ కేసులో పక్కా ఆధారాలుండటంతో అతడి వాదనలను కోర్టు తోసిపుచ్చింది.
అప్పటికే నిందితుడు 45 రోజుల పాటు జైలులో ఉన్నందున జైలు శిక్షను రెండేళ్ల నుంచి ఏడాదికి తగ్గించింది. జరిమానా మాత్రం రూ. 90వేలకు పెంచింది. అందులో బాధితురాలికి రూ.85 వేలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది’’అని వెలుగు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- జీఎస్ఎల్వీ-ఎఫ్10: మూడో దశలో విఫలమైన రాకెట్ ప్రయోగం..
- ప్రపంచ ఏనుగుల దినోత్సవం: ఇక్కడ మనుషులతో కలిసి గజరాజులు ఎలా హాయిగా జీవిస్తున్నాయి?
- ఇంటి పెరట్లో బావి తవ్వుతుండగా రూ.745 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- 1778 తర్వాత అదృశ్యమైంది, 235 సంవత్సరాలు గడిచాక సముద్రం అడుగున కనిపించింది
- 'జీన్స్ వేసుకుని పూజలో పాల్గొందని కొట్టి చంపేశారు'
- మగవాళ్లకు సంతాన నిరోధక మాత్రలు ఎందుకు లేవు? సైన్స్ ఏం చెబుతోంది
- వెక్కిళ్లు ఎందుకొస్తాయి? ఆగాలంటే ఏం చేయాలి?
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)























