భారత్ కొత్తగా 12 అణ్వాయుధాలను మోహరించిందా? తాజా నివేదిక ఏం చెబుతోంది?

భారత్ పాకిస్తాన్, అణ్వాయుధాలు, సబ్‌మెరీన్‌లు, యుద్ధం, ఆయుధాలు, చైనా, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా,

ఫొటో సోర్స్, RAVEENDRAN/AFP via Getty Images

    • రచయిత, శివంగీ జైస్వాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

స్వీడన్‌కు చెందిన స్వతంత్ర అంతర్జాతీయ థింక్‌ట్యాంక్ స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI-సిప్రి)తాజా నివేదిక ప్రకారం, భారత్ ఈ ఏడాది తొలిసారిగా 12 అణ్వాయుధాలను మోహరించింది.

అయితే ఈ విషయంపై భారత రక్షణ శాఖ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

జూన్ 8న విడుదలైన సిప్రి నివేదిక ప్రకారం, భారత్ దగ్గర ప్రస్తుతం 178 అణ్వాయుధాలు నిల్వలో ఉన్నాయి. అవసరమైతే వీటిని వినియోగించచ్చు.

వీటికి అదనంగా 12 అణ్వాయుధాలు ఇప్పటికే మోహరించి ఉన్నాయి. దీంతో భారత్ దగ్గర మొత్తం అణ్వాయుధాల సంఖ్య 190కు చేరింది.

గత ఏడాది ఈ సంఖ్య 180గా ఉండగా, అవన్నీ నిల్వలోనే ఉన్నాయి.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్ పాకిస్తాన్, అణ్వాయుధాలు, సబ్‌మెరీన్‌లు, యుద్ధం, ఆయుధాలు, చైనా, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా,

ఫొటో సోర్స్, John Keeble/Getty Images)

పరిస్థితులు శాంతియుతంగా ఉండగానే అణ్వాయుధాలను మోహరించడం ఆశ్చర్యకర పరిణామని జర్నలిస్టు, డిఫెన్స్ ఆనలిస్ట్ రాహుల్ బేది అన్నారు.

ఆయన అంచనా ప్రకారం, పూర్తి సన్నద్ధతతో ఉన్న రెండు న్యూక్లియర్ సబ్‌మెరీన్‌లలో ఈ 12 అణ్వాయుధాలను మోహరించి ఉండచ్చు.

గత ఏడాది మే నెలలో భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

సిప్రి నివేదిక ప్రకారం, 2025, 2026 సంవత్సరాల్లో పాకిస్తాన్ ఎలాంటి అణ్వాయుధాలను మోహరించలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర 170 అణ్వాయుధాలు ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.

యుద్ధభూములకు దూరంగా ఉన్నప్పటికీ భవిష్యత్తు ఘర్షణలకు సిద్ధమవుతూ దేశాలు ఆధునిక సైబర్ గూఢచర్య పద్ధతులను వినియోగిస్తున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. శాంతియుత వర్తమానంలోనే భవిష్యత్తు యుద్ధాలకు సన్నాహాలు వేగవంతమయ్యాయని దానర్థం.

మొదట దాడి చేయకూడదనే సిద్ధాంతాన్ని భారత్ ఇప్పటికే పాటిస్తుందని రాహుల్ బేది అన్నారు.

ఆయన అంచనా ప్రకారం, భారత్ ఈ 12 వార్‌హెడ్‌లను రెండు న్యూక్లియర్ సబ్‌మెరీన్‌లలో మోహరించి ఉండచ్చని బేది తెలిపారు. ఈ సబ్‌మెరీన్‌లు నెలల తరబడి సముద్రంలో గస్తీ నిర్వహించగలుతుతాయని చెప్పారు.

అయితే ఆయన వ్యాఖ్యలను బీబీసీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

న్యూక్లియర్ సబ్‌మెరీన్‌ అనేది అత్యాధునిక యుద్ధ నౌక. ఇది నీటి అడుగున పనిచేస్తూ, శక్తి కోసం చిన్న అణు రియాక్టర్‌ను వినియోగిస్తుంది. సాధారణ సబ్‌మెరీన్‌లలా తరచుగా ఇంధనం లేదా ఆక్సిజన్ కోసం ఉపరితలానికి రావాల్సిన అవసరం ఉండదు.

భారత్ పాకిస్తాన్, అణ్వాయుధాలు, సబ్‌మెరీన్‌లు, యుద్ధం, ఆయుధాలు, చైనా, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా,

ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images

భారత్ అణు నిరోధక వ్యూహాన్ని అర్థం చేసుకుంటేనే ఈ చర్య ప్రాముఖ్యతను గ్రహించవచ్చని రాహుల్ బేది పేర్కొన్నారు.

భారత్‌పై అణుదాడి జరిగితే ప్రతిస్పందన కోసం మూడు విధానాలను భారత్ అనుసరిస్తుందని ఆయన చెప్పారు. అందులో:

1. గగనతల ఆధారిత ప్రయోగ వ్యవస్థ

2. భూభాగ ఆధారిత వ్యవస్థ

3. సబ్‌మెరీన్‌ ఆధారిత వ్యవస్థ

ఈ మూడింటిలో సబ్‌మెరీన్‌ ఆధారిత వ్యవస్థ అత్యంత సురక్షితమైనదే కాక, అత్యంత ప్రభావవంతమైన అణు నిరోధక సాధనమని ఆయన వివరించారు. సముద్రంలో న్యూక్లియర్ సబ్‌మెరీన్‌లను గుర్తించడం చాలా కష్టమని చెప్పారు.

అమెరికా, రష్యా, చైనా వంటి ప్రధాన అణుశక్తి దేశాలు కూడా ఇలాగే సబ్‌మెరీన్‌లలో వార్‌హెడ్‌లను మోహరించి గస్తీ నిర్వహిస్తాయని ఆయన తెలిపారు."భారత్ ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తోంది. ఇది ఒక కీలక మార్పు" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ దేశాలకు చెందిన సబ్‌మెరీన్‌లు ఖాళీగా కాకుండా పూర్తిగా ఆయుధాలతోనే గస్తీ నిర్వహిస్తాయని, భారత్ మోహరించిన 12 వార్‌హెడ్‌లు కూడా ఇదే విధంగా పూర్తిస్థాయి సన్నద్ధతలో ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏ సంఘర్షణ జరగని సమయంలోనే ఈ మోహరింపును చేపట్టినా, భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్' కొనసాగుతోందని చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యూహాన్ని దానితో ముడిపెట్టొచ్చా అనే ప్రశ్నకు ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

"ఇది ఆపరేషన్ సిందూర్ లేదా ఆపరేషన్ సిందూర్ 2.0లో భాగమా అనేది చెప్పడం కష్టం. కానీ, భారత్ ఇప్పుడు ప్రధాన అణుశక్తి దేశాల మాదిరిగా సముద్ర గస్తీ నిర్వహిస్తోంది" అని అన్నారు.

సిప్రి నివేదిక ప్రకారం, భారత్ అణ్వాయుధాల సంఖ్యను వేగంగా పెంచడమే కాకుండా వాటి తయారీకి అవసరమైన పదార్థాల ఉత్పత్తినీ వేగవంతం చేస్తోంది.

ప్రత్యేకంగా యురేనియం శుద్ధీకరణ కంటే ప్లూటోనియం ఆధారిత విధానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

ఇజ్రాయెల్ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోందని, అయితే పాకిస్తాన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా వంటి దేశాలు యురేనియం, ప్లూటోనియం రెండింటినీ వినియోగిస్తున్నాయని తెలిపింది.

ప్లూటోనియం ఆధారంగా అణ్వాయుధ ఇంధనం తయారు చేయడం సాధారణ పద్ధతి కాదు. అయితే భారత్‌కు యురేనియం శుద్ధీకరణతో పాటు ప్లూటోనియం ఆధారిత ఉత్పత్తి సామర్థ్యమూ ఉందని రాహుల్ అన్నారు.

ఇజ్రాయెల్ విషయానికొస్తే, అది అణ్వాయుధ సామర్థ్యం కలిగిన దేశమని విస్తృతంగా భావిస్తున్నప్పటికీ, అధికారికంగా మాత్రం ఎప్పుడూ ప్రకటించలేదని ఆయన పేర్కొన్నారు.

భారత్ పాకిస్తాన్, అణ్వాయుధాలు, సబ్‌మెరీన్‌లు, యుద్ధం, ఆయుధాలు, చైనా, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా,

ఫొటో సోర్స్, Debarchan Chatterjee/NurPhoto via Getty Images)

చైనా భూభాగాన్నంతటిని చేరగలిగే దీర్ఘశ్రేణి క్షిపణుల అభివృద్ధిపై భారత్ దృష్టి సారించినట్లు సిప్రి నివేదిక పేర్కొంది.

గతంలో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణల అనంతరం ఈ దిశగా భారత్ మరింత దృష్టి పెట్టిందని రాహుల్ బేది తెలిపారు.

భారత్ మాత్రమే కాదు, చైనా, పాకిస్తాన్, అమెరికా, రష్యా దేశాలు కూడా తమ ఆయుధ వ్యవస్థలను వేగంగా ఆధునీకరిస్తున్నాయని నివేదిక పేర్కొంది.

ప్రపంచం ప్రస్తుతం కొత్త అణ్వాయుధ పోటీ యుగంలోకి ప్రవేశిస్తోందని సిప్రి హెచ్చరించింది.

సిప్రి ప్రకారం, 2025లో భారత్ రక్షణ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ప్రపంచంలో ఐదవ అతిపెద్ద రక్షణ వ్యయం. 2024తో పోలిస్తే ఇది 8.9 శాతం ఎక్కువ.

2021 నుంచి 2025 మధ్యకాలంలో ప్రపంచ రక్షణ ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 8.2 శాతంగా నమోదైంది. దీంతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ నిలిచింది.

పాకిస్తాన్ కూడా ఆయుధాల కొనుగోళ్లను పెంచినట్లు నివేదిక తెలిపింది.

యుక్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు కూడా గణనీయ స్థాయిలో ఆయుధాలను కొనుగోలు చేశాయి. ప్రపంచ ఆయుధ కొనుగోళ్లలో 35 శాతం వాటా ఈ దేశాలదే.

విదేశాల నుంచి ఆయుధాల కొనుగోలు కంటే దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని రాహుల్ బేది అభిప్రాయపడ్డారు. ఈ దిశగా భారత్ ఇటీవల కొన్ని చర్యలు కూడా చేపట్టిందని చెప్పారు.

2026 ప్రారంభానికి భారత్ సహా తొమ్మిది అణ్వాయుధ దేశాల దగ్గర మొత్తం సుమారు 12,187 అణ్వాయుధాలు ఉన్నట్లు సిప్రి నివేదిక తెలిపింది.

ఈ దేశాలు:

  • అమెరికా
  • రష్యా
  • బ్రిటన్
  • ఫ్రాన్స్
  • చైనా
  • భారత్
  • పాకిస్తాన్
  • ఉత్తర కొరియా
  • ఇజ్రాయెల్

వీటిలో సుమారు 4,012 అణ్వాయుధాలు సైనిక దళాలతో సిద్ధంగా ఉన్నాయి.

మోహరింపులో ఉన్న వాటిలో 2,100 నుంచి 2,200 వరకు వార్‌హెడ్‌లను బాలిస్టిక్ క్షిపణులపై అత్యంత అప్రమత్త స్థితిలో ఉంచారు.

మరో 9,745 అణ్వాయుధాలు సైనిక నిల్వల్లో ఉన్నాయి.

అణ్వాయుధాల సంఖ్య తగ్గినా ఆందోళన మాత్రం కొనసాగుతోంది

ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల మొత్తం సంఖ్య తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, దీనికి ప్రధాన కారణం అమెరికా, రష్యా తమ పాత ఆయుధాలను నిర్వీర్యం చేయడమేనని నివేదిక పేర్కొంది.

అయితే ప్రతి ఏడాది నిర్వీర్యం చేస్తున్న ఆయుధాల సంఖ్య తగ్గిపోతోందని సిప్రి హెచ్చరించింది. త్వరలో కొత్త అణ్వాయుధాల ఉత్పత్తి వేగం, పాత ఆయుధాల నిర్మూలన వేగాన్ని మించిపోవచ్చని అంచనా వేసింది.

పారదర్శకత తగ్గిపోవడంతో దేశాల దగ్గర ఉన్న అణ్వాయుధాల కచ్చిత సంఖ్యను అంచనా వేయడం కష్టమవుతోందని నివేదిక పేర్కొంది.

అణ్వాయుధాలపై సమాచారాన్ని పంచుకునే ఆయుధ నియంత్రణ ఒప్పందాలు బలహీనపడటం కూడా దీనికి కారణమని సిప్రి అభిప్రాయపడింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)