ఆంధ్రప్రదేశ్: వరద ఉద్ధృతికి పులిచింతల గేటు ఊడి నీటిలో కొట్టుకుపోయింది-ప్రెస్ రివ్యూ

పులిచింతల

ఫొటో సోర్స్, UGC

ప్రచురణ

పులిచింతల ప్రాజెక్టులోని 16వ నంబరు గేటు వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిందని ఆంధ్రజ్యోతి తెలిపింది. దీంతో భారీఎత్తున నీరు వృథాగా పోతోందని వివరించింది.

‘‘పులిచింతల ప్రాజెక్టులో మొత్తం 24 గేట్లు ఉన్నాయి. కొన్ని రోజులుగా నాగార్జునసాగర్‌ నుంచి వరద నీరు పులిచింతలకు చేరుతోంది.

గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయానికి ప్రాజెక్టులోని 13, 14 నంబరు గేట్ల ద్వారా నీరు విడుదలచేశారు. ఆ తర్వాత గంటకు 15, 16 గేట్లు నాలుగు అడుగులు పైకెత్తి నీటిని విడుదల చేస్తుండగానే ఈ ఘటన జరిగింది.

వరద ఉద్ధృతికి ఇనుపతాళ్లు, గడ్డర్లు తెగిపోవడంతో గేటు పూర్తిగా ఊడి నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టులో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది.

పెరిగిన ఉద్ధృతితో అప్రమత్తమైన అధికారులు వచ్చి చూడగా, గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసింది. ఈ సమయంలో నాలుగు అడుగులమేర మాత్రమే గేట్లు ఎత్తినట్టు, ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ఇంజనీర్లు తెలిపారు.

ఉదయం అక్కడకు చేరుకున్న జలవనరుల మంత్రి అనిల్‌ కుమార్‌, ఉన్నతాధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు. పులిచింతల ప్రాజెక్టులో 16వ గేటు స్థానంలో శుక్రవారం సాయంత్రానికి ఎమర్జెన్సీ గేటు అమర్చి నీరు దిగువకు వెళ్లకుండా అపుతామని మంత్రి తెలిపారు.

‘‘గేటు ఊడి పోవటానికి కారణం ఏమిటనే దానిపై విచారిస్తున్నాం. దీనిపై కమిటీ వేస్తాం. నిపుణులతో 16వ నంబరు గేటుతో పాటు అన్ని గేట్లను కూడా పరిశీలన చేయిస్తాం. గేటు గడ్డర్‌ బరువు 250 టన్నులు ఉంటుంది. అయినా సమస్య రావడంపై పరిశీలన జరుపుతున్నాం’’ అని చెప్పారు.

అయితే, ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి సామర్థ్యం ఎక్కువగా ఉందని, పది టీఎంసీలు ఉంటేనే తాత్కాలిక గేటు అమర్చేందుకు అవకాశం ఉంటుందని ఈఎన్‌సీ నారాయణరెడ్డి తెలిపారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం

సాగర్‌’లో నిమజ్జనానికి అనుమతిస్తారా? హైకోర్టు ప్రశ్న

కరోనావైరస్ మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇస్తున్నారా? అని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని సాక్షి తెలిపింది.

‘‘కరోనా పూర్తిగా పోలేదని, మూడో దశలో భాగంగా ఎప్పుడైనా ఉప్పెనలా విరుచుకుపడే అవకాశం ఉందని, అందువల్ల అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనానికి శాశ్వతంగా అనుమతి ఇవ్వరాదని, గతంలో ఇదే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. హుస్సేన్‌సాగర్‌లో ఎన్ని విగ్రహాలను నిమజ్జనం చేస్తారని ప్రభుత్వం తరఫున హాజరైన స్పెషల్‌ జీపీ హరీందర్‌ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.

కరోనా నేపథ్యంలో గత ఏడాది అనుమతి ఇవ్వలేదని, ఈ ఏడాది అనుమతి ఇచ్చేదీ లేనిదీ తెలుసుకొని చెబుతానని నివేదించారు. ‘హుస్సేన్‌సాగర్‌లోని నీటిని పరిశుభ్రంగా ఉంచాలి. పరిసరాలను పర్యాటక ప్రదేశంగా అందంగా తీర్చిదిద్దాలి. అప్పుడే పర్యాటకులు ఆకర్షితులవుతారు. ప్రతి ఏడాది హుస్సేన్‌సాగర్‌లో వేల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది. నగరం నడిబొడ్డున ఉన్న సాగర్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విగ్రహాలను నిమజ్జనం చేయాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వం ప్రతి ఏడాది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోకుండా శాశ్వతంగా నిర్ణయం తీసుకోవాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసేందుకు వీలుగా తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది’’అని సాక్షి తెలిపింది.

మద్యం తాగుతున్న వ్యక్తులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, (ప్రతీకాత్మక చిత్రం)

మద్యం తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని యువకుడి ఆత్మహత్యాయత్నం

అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకోవడం... ఆపై చేయి చేసుకోవడంతో ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని ఈనాడు ఓ కథనం ప్రచురించింది. అనంతరం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడని పేర్కొంది.

‘‘మద్యం అక్రమ రవాణా చేస్తున్నవారిని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలెం వద్ద గురువారం వేకువజామున గురజాల ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకోవడంతో వారిలో ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం అతడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందాడు.

ఎక్సైజ్‌ ఎస్సై మోహన్‌ కథనం ప్రకారం.. తెలంగాణ వైపు నుంచి కొంతమంది యువకులు 10 మద్యం కేసులను దాచేపల్లికి తీసుకొస్తుండగా పోలీసులు పట్టుకుని, మద్యం స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకునే క్రమంలో అల్లీసా అనే యువకుడు ఎదురు తిరిగాడు.

పోలీసులు అతడిపై చేయిచేసుకోగా అక్కడే పురుగుమందు తాగాడు. విషయం తెలిసిన అతని కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

అనంతరం అల్లీసాను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. బాధిత కుటుంబసభ్యులు మాట్లాడుతూ అన్యాయంగా అల్లీసాను లాఠీలతో కొట్టారని, కాళ్లపై ద్విచక్రవాహనాన్ని ఎక్కించి, పొట్టపై కాళ్లతో తన్నారని చెప్పారు.

పోలీసులు కొట్టడంతోనే అతను మృతిచెందినట్లు వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు తమ వెంట తెచ్చుకున్న మద్యం సీసాలను తమ వాహనంలో పెట్టి అక్రమంగా కేసు బనాయించారన్నారు. మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడినట్లు చెప్పారు.

అయితే తాము ఎవరినీ కొట్టలేదని, మాపైనే వారు దాడులు చేశారని పోలీసులు వివరించారు’’అని ఈనాడు తెలిపింది.

సైబర్ దాడి

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్‌కు వాడే ఆయిల్‌ పేరిట వైద్యుడికి 12 కోట్లు టోకరా

పశువుల వ్యాక్సీన్‌ తయారీకి ఉపయోగపడే ఆయిల్‌ పంపుతామంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘డాక్టర్‌ సీవీ రావుకు ఫేస్‌బుక్‌లో గీతా నారాయణ పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తమ వద్ద పశువుల వ్యాక్సీన్‌ తయారీకి ఉపయోగించే అగ్రోమెటిజమ్‌ ఆయిల్‌ తక్కువ ధరకు దొరకుతున్నదని, దానికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుందని చెప్పింది.

మరోవైపు, తాము ఆయిల్‌ కొంటామని బెంజిమెన్‌ పేరిట ఒక వ్యక్తి సీవీరావుకు మెయిల్‌ పంపించాడు. ముంబయిలో లీటర్‌ ఆయిల్‌ రూ.10.8 లక్షల (14,625 డాలర్ల)కు దొరుకుతుందని, తాము అమెరికా, లండన్‌లో రూ.16.3 లక్షల (22 వేల డాలర్ల)కు కొంటామని బెంజిమెన్‌ నమ్మించాడు.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో తమ ప్లాంట్‌ ఉన్నదని అక్కడినుంచి ఆయిల్‌ పంపిస్తామని గీతా నారాయణ ద్వారా పరిచయమైన లక్ష్మి అనే మహిళ సీవీరావుతో మాట్లాడింది.

ఆయన ఒక లీటర్‌ ఆయిల్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. కనీసం 350 లీటర్లు ఇస్తే భారీ లాభాలొస్తాయి, ఒక బ్యాచ్‌ వ్యాక్సీన్‌ను తయారు చేసుకోవచ్చని ఆశ పుట్టించారు. ఇది తమకూ కలిసి వస్తుందని నమ్మించారు. కొరియర్‌లో ఆయిల్‌ పార్సిల్‌ వస్తుందని నమ్మబలికారు. సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు సీవీరావు తన బ్యాంకు ఖాతా నుంచి డాలర్ల రూపంలో దుబాయ్‌లో ఉన్న మూడు, అమెరికాలో ఉన్న ఆరు బ్యాంకు ఖాతాలకు రూ.11.9 కోట్లకు (16.11 లక్షల డాలర్లు)పైగా పంపించారు.

పూర్తి డబ్బు చెల్లిస్తేనే ఆయిల్‌ వస్తుందని, దానికి వ్యాట్‌, ఇతర బిల్లులు చెల్లించాల్సి ఉన్నదని ఇంకో 2.50 లక్షల డాలర్లు కావాలని నేరగాళ్లు ఒత్తిడి తెచ్చారు. మోసపోయినట్టు తెలుసుకున్న బాధితులు గురువారం సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతికి ఫిర్యాదు చేశారు’’అని వెలుగు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)