బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి కేసు: 8 ఏళ్లు పెండింగ్‌లో ఉన్న కేసు విచారణ చేపట్టనున్న స్పెషల్ సీబీఐ కోర్టు - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి కేసును సీబీఐ కోర్టు విచారించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు ఎట్టకేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు రాబోతోంది.

జియా బాయ్‌ఫ్రెండ్ అయిన నటుడు సూరజ్ పంచోలి మీద ఉన్న 'ఆత్మహత్యకు ప్రేరేపించార'నే ఆరోపణలపై విచారణ జరుపుతున్న సెషన్స్ కోర్టు ఈ విచారణను సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని సూచించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

అమితాబ్ బచ్చన్ నటించిన 'నిశ్శబ్ద్' చిత్రంతో 2007లో హిందీ సినీరంగ ప్రవేశం చేసిన జియా ఖాన్ ఆ తరువాత ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్‌లతోనూ కలిసి నటించారు.

ఆమె 2013 జూన్ నెలలో ముంబయిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని కనిపించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసు పోస్ట్ మార్టం నివేదిక తెలిపింది. ఆమె తల్లి తన కూతురు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించినట్లు చెప్పారని పోలీసులు వెల్లడించారు.

"నఫీసా ఖాన్ (జియా ఖాన్ అసలు పేరు) తన సాగర్ సంగీత్ అపార్ట్‌మెంటులో రాత్రి 10.45 గంటలకు ఉరేసుకుని కనిపించారని ఆమె తల్లి చెప్పారు" అని పోలీసు అధికారులు తెలిపారు.

న్యూయార్క్‌లో పుట్టి, లండన్‌లో పెరిగిన జియా ఖాన్ సినీ నటి కావాలని ముంబయి వచ్చారు. నిశ్శబ్ద్ తరువాత ఆమె గజిని వంటి చిత్రాల్లో నటించారు. 2010లో వచ్చిన 'హౌస్‌ఫుల్' ఆమె చివరి చిత్రం.

రేపల్లె రొయ్యల చెరువు దగ్గర ఆరుగురు మృతి, కరెంటు వైర్లు తెగిపడడమే కారణమా?

గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని లంకెవాని దిబ్బలో విద్యుత్ షాక్‌తో ఆరుగురు మృతి చెందారు.

ఒడిశాకు చెందిన వీరు గురువారం అర్ధరాత్రి రొయ్యల చెరువు దగ్గర కాపలా ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

అర్ధరాత్రి చెరువు గట్టుపై నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడడం వల్ల వీరు చనిపోయారని చెబుతున్నారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతులను రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్‌గా పోలీసులు గుర్తించారు.

మరోవైపు ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కరెంటు వైర్లు తెగి పడడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతుంటే, అది షార్ట్ సర్క్యూట్ కాదని విద్యుత్ సిబ్బంది అంటున్నారు.

మరోవైపు పోలీసులు ఘటనా స్థలంలో మీడియాను అనుమతించడానికి కూడా నిరాకరించారు.

ఘటనాస్థలంలోని రేకుల షెడ్‌లో కెమికల్స్ ఉన్నట్లు స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)