ఇస్రో: చంద్రయాన్ -3 ప్రయోగం వచ్చే ఏడాదిలోనే.. స్పష్టత ఇచ్చిన కేంద్రం - Newsreel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

చంద్రయాన్-3 ప్రయోగంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది మూడో త్రైమాసికంలో చంద్రయాన్-3 ప్రయోగం ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

చంద్రయాన్‌-3కి సంబంధించిన అనేక పనులు కరోనా, లాక్‌డౌన్‌ వల్ల ఆలస్యంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

2019 జులై 22న చంద్రయాన్‌-2 లాంచ్ చేశారు.

కానీ సెప్టెంబర్ 7న ల్యాండర్ విక్రమ్ మాత్రం చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ కాలేకపోయింది.

యూపీలో ఘోరం: బస్సు రిపేర్ చేస్తుండగా వెనుక నుంచి ట్రక్ ఢీ కొట్టింది

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరాబంకిలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఒక ట్రక్కు ఆగి ఉన్న డబుల్ డెక్కర్ బస్సును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 25 మంది గాయపడ్డారు.

రామ్ సనేహి ఘాట్ సమీపంలో ఈ సంఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.

''బస్సు చెడిపోవడంతో డ్రైవర్ ప్రయాణికులను విశ్రాంతి తీసుకొమ్మని కోరాడు. అతను బస్సు రిపేర్ చేస్తున్న సమయంలో వెనక నుంచి ట్రక్ వచ్చి బలంగా ఢీ కొట్టింది'' అని లఖ్‌నవూ జోన్ పోలీస్ ఏడీజీ సత్యనారాయణ్ సబత్ వెల్లడించారు.

ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు పీఎం రిలీఫ్‌ ఫండ్ నుంచి రూ. 2లక్షల రూపాయల చొప్పున సహాయం అందివ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తారు. ''బారాబంకీ రోడ్డు ప్రమాద ఘటన తీవ్రంగా కలచి వేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి యోగితో మాట్లాడాను. గాయపడిన వారికి సాయం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా సంతాపం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)