రాజ్‌ కుంద్రా: అశ్లీల చిత్రాల కేసులో నటి షెర్లిన్‌ చోప్రాకు సమన్లు - ప్రెస్‌రివ్యూ

షెర్లిన్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో మోడల్‌, నటి షెర్లిన్ చోప్రాకు సమన్లు అందాయని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘అశ్లీల చిత్రాలను తెరకెక్కించి, యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నారన్న ఆరోపణలపై వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనతో సంబంధాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ నటి షెర్లిన్‌ చోప్రాను కూడా విచారించనున్నారు.

ఈ మేరకు ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ ప్రాపర్టీ సెల్‌ పోలీసులు ఆమెకు సమన్లు పంపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆమె విచారణకు హాజరుకావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.

మరోవైపు రాజ్‌కుంద్రాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ముంబయి పోలీసులు సీజ్‌ చేస్తున్నారు. కాన్పూర్‌లోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖలో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిలకు ఉన్న ఖాతాలను స్తంభింపచేయాలని ఎస్‌బీఐకి సూచించారు.

రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల కేసు నేపథ్యంలో పలువురి పేర్లు బయటకు వస్తుండటంతో ఎవరికి వారు తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నటి ఫ్లోరా సైనీ స్పందించారు. తానెప్పుడూ రాజ్‌కుంద్రాను కలవలేదని చెప్పుకొచ్చారు.

జేపీ నడ్డాతో పెద్దిరెడ్డి

ఫొటో సోర్స్, Facebook/Enugalapeddireddy

ఫొటో క్యాప్షన్, జేపీ నడ్డాతో పెద్దిరెడ్డి

బీజేపీకి మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా

తెలంగాణలో బీజేపీకి మాజీమంత్రి, సీనియర్ నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారని నమస్తే తెలంగాణ తెలిపింది.

‘‘ఈ మేరకు ఇవాళ ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. పార్టీలో కొనసాగేందుకు మనసు అంగీకరించడం లేదని, మారిన రాజకీయాల దృష్ట్యా పార్టీలో కొనసాగలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు.

పార్టీలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.

కనీసం తనతో చర్చించకుండానే ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకొన్నారని ఆయన పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా గత వారం క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఉన్న పెద్దిరెడ్డి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గతంలో ప్రాతినిథ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి టీడీపీని వీడి బీజేపీలో చేరారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.

జయంతితో పునీత్ రాజ్‌కుమార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జయంతితో పునీత్ రాజ్‌కుమార్

సినీ నటి జయంతి కన్నుమూత

సీనియర్ సినీ నటి జయంతి (79) కన్నుమూశారని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘రెండేళ్లుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న జయంతి.. బెంగళూరులోని తన ఇంట్లో మృతి చెందారు.

తెలుగు, కన్నడ, తమిళ భాషలతోపాటు మలయాళ, హిందీ చిత్ర సీమల్లోనూ జయంతి సత్తా చాటారు.

మొత్తంగా ఆమె 500కు పైగా సినిమాల్లో నటించారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, రాజ్‌కుమార్, రజనీకాంత్ లాంటి దిగ్గజ నటులతో ఆమె నటించి ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో జయంతి మంచి పేరు దక్కించుకున్నారు. జయంతి ఏడు సార్లు కర్నాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులను, రెండు సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకున్నారు’’అని వెలుగు తెలిపింది.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, facebook/ysjagan

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ల బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చిందని సాక్షి తెలిపింది.

‘‘ప్రస్తుతం ఏపీ రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా ఉన్న కేఆర్‌ఎం కిషోర్‌ను లీగల్‌ మెట్రాలజీ కంట్రోలర్‌గా నియమిస్తూ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు రోడ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు.

మైనార్టీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఇంతియాజ్‌ను సెర్ప్‌ సీఈవోగా నియమించి చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో డైరెక్టర్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ అదనపు బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మధ్యనే బదిలీ అయిన కొంతమంది ఐఏఎస్‌లను పరిపాలనా సౌలభ్యం కోసం తిరిగి పాతస్థానాలకే పంపించారు.

ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులిచ్చారు’’అని సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)