You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఓటుకు నోటులా పీసీసీ పోస్టు అమ్ముడు పోయింది - ప్రెస్ రివ్యూ
ఓటుకు నోటు కేసులా పీసీసీ పోస్టు విషయంలోనూ జరిగిందని.. ఈ విషయం తనకు దిల్లీ వెళ్లిన తర్వాత తెలిసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారని 'ఈనాడు' కథనం తెలిపింది.
''పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి డబ్బులు తీసుకుని పోస్టులు అమ్ముకోవడానికి సంబంధించిన వివరాలను ఆధారాలతో వచ్చే పార్లమెంట్ సమావేశాల సమయంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇస్తానన్నారు.
టీపీసీసీ కాదు.. టీడీపీ పీసీసీగా మారిందని వ్యాఖ్యానించారు.
కొత్త కార్యవర్గం వెంట వచ్చేవాళ్లంతా తెలుగుదేశం పార్టీ వాళ్లని, రేపు గాంధీభవన్ టీడీపీ కార్యాలయంగా మారిపోవడం ఖాయమన్నారు.
ఆదివారం శంషాబాద్ విమానాశ్రయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం వదిలిపెట్టిన 33 ఏళ్లుగా ప్రజలు, కార్యకర్తలే ప్రాణంగా బతికానన్నారు.
పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో తనకు కాదని.. పార్టీని నమ్ముకున్న లక్షల మంది కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.
కొత్త కార్యవర్గాన్ని అభినందిస్తూ.. వారి నాయకత్వంలో హుజూరాబాద్‌లో కనీసం డిపాజిట్ తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరుతున్నానని వ్యంగ్యంగా అన్నారు.
కొత్త కార్యవర్గం గాని, అధ్యక్షుడు గాని తనను కలిసే ప్రయత్నం చేయవద్దన్నార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
మహిళా కూలీకి వజ్రం లభ్యం
పొలం పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీకి వజ్రం లభ్యమైందని 'సాక్షి' కథనం తెలిపింది.
''కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ శనివారం పొలంలో కూలి పనులకు వెళ్లింది.
అక్కడ పనులు చేస్తుండగా వజ్రం లభ్యమైంది.
నాలుగున్నర క్యారెట్లు ఉన్న ఆ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6.50 లక్షలు, 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలిసింది.
ఈ ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు లభ్యమవడం సహజం'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.
'మా' ఎన్నికల బరిలో తెలంగాణ వాదం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల బరిలో తెలంగాణ వాదంతో దిగుతున్నట్టు నటుడు సీవీఎల్ నరసింహారావు ప్రకటించారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలపింది.
''ప్రకాశ్ రాజ్, విష్ణు మంచు, జీవితా రాజశేఖర్, హేమ... రాబోయే 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న జాబితాలో తాజాగా సీవీఎల్ నరసింహరావు కూడా చేరారు. అధ్యక్షుడిగా తాను పోటీ చేయనున్నట్టు ఆదివారం ఆయన వెల్లడించారు.
''నా ప్యానల్ 'తెలంగాణవాదం'. తెలంగాణ కళాకారులు, వాళ్ల ఇబ్బందులే నా ఎజెండా. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిన్న, పేద, మధ్యతరగతి కళాకారులు ఉన్నారు. వాళ్లకు జరుగుతున్న అన్యాయం కూడా! మా మ్యానిఫెస్టోలో మరో ముఖ్యాంశం... ఎప్పుడో పదేళ్ల క్రితం పరభాషా నటులకు ప్రవేశం గురించి ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే... దాన్ని తుంగలోకి తొక్కడం వల్ల చాలామంది తెలంగాణ కళాకారులకు మాత్రమే కాదు... తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతోంది. అందుకని, ఆప్షన్ అడుగుతున్నాం. రాష్ట్ర విభజన జరిగింది. అనంతరం తెలంగాణకు సాహితీ అకాడమీ ఏర్పాటు అయింది. తెలంగాణకు సంబంధించినంత వరకూ అధికార భాషా సంఘం సపరేట్‌గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు... ఇద్దరు సినిమాటోగ్రఫీ మంత్రులు ఉన్నారు.
రెండు ఎఫ్‌డీసీ(ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్)లు ఉన్నాయి. కాబట్టి... అటు ఆంధ్రప్రదేశ్‌కి, ఇటు తెలంగాణకు సినిమాకు సంబంధించినంతవరకూ న్యాయం జరగాలనే ఉద్దేశంతో 2009లోనే 'మా తెలంగాణ' (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ)ను రిజిస్టర్ చేశాం. అలాగే, ఏపీలోనూ కొన్ని ఆర్గనైజేషన్‌లు రిజిస్టర్ అయ్యాయి. అయితే, కొంతమంది కుట్రల వల్ల ఏపీ అనే పేరు పెట్టుకోవడానికి భయపడి, సిగ్గుపడి, ఇబ్బందిపడి తెలుగు అని పెట్టుకోవడం వల్ల ఇప్పుడీ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 'మా'ను రెండు విభాగాలు చేయాలి. వెంటనే విభజన చేయడం ఇబ్బంది కనుక... తెలంగాణ, ఏపీ విభాగాలు చేసి రెండిటికీ ఎన్నికలు నిర్వహించమని అడుగుతున్నాం. చర్చల ద్వారా సామరస్యంగా విభజనకు ప్రయత్నించాలి. ఇప్పట్నుంచీ చేస్తే తప్ప పనులు కావు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు 18మందిలో కనీసం తొమ్మిదిమంది తెలంగాణ వాళ్లకు ఇవ్వాలి. ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరు తెలంగాణ కళాకారులు ఉండాలి'' అని ఆయన డిమాండ్ చేసినట్లుగా ఆ కథనం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- పోలవరం ముందుకు వెళ్తోందా, లేదా? అప్పటి నుంచి ఇప్పటికి పురోగతి ఉందా?
- గౌతమ్ అదానీ కంపెనీల షేర్లు ఎందుకు కుప్పకూలాయి.. కంపెనీ ఏం చెబుతోంది..
- ద గేట్స్ ఆఫ్ హెల్: ఎడారిలో అగ్ని బిలం.. దశాబ్దాలుగా మండుతూనే ఉంది
- బెంజమిన్ నెతన్యాహు: ఈ ఇజ్రాయెల్ రాజకీయ మాంత్రికుడు ప్రపంచానికి ఎలా గుర్తుండి పోతారు
- మిజోరాం: 38 మంది భార్యలు.. 89 మంది పిల్లలు.. ‘ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్ద’ ఇకలేరు
- పాకిస్తాన్లో మహిళల లోదుస్తులు అమ్మడం ఎందుకంత కష్టం?
- ప్రధాని పదవి నుంచి తప్పుకున్న బెంజమిన్ నెతన్యాహూ, ఇజ్రాయెల్ కొత్త ప్రధాని నాఫ్తాలి బెన్నెట్
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: ఏడాది గడిచినా వీడని డెత్ మిస్టరీ
- ఉత్తరాఖండ్ జల ప్రళయం: ''సొరంగంలో 7 గంటలు ప్రాణాలను అరచేత పెట్టుకుని గడిపాం''
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)