కేసీఆర్ వరంగల్ పర్యటన: 'కెనడా తరహాలో ఆధునిక వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి రావాలి' - Newsreel

ప్రచురణ

కెనడా తరహాలో ఆధునిక వైద్య సేవలు వరంగల్‌లో అందుబాటులోకి రావాలని, దీనిపై అధ్యయనం కోసం ఓ బృందాన్ని కెనడా పంపిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌, ఆరోగ్య విశ్వ విద్యాలయ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.

వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండగా మార్పుస్తున్నామని, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించారు.

అజాంజాహీ మిల్ లేదా ఆటోనగర్‌లో వరంగల్ జిల్లా కోసం కొత్త కలెక్టరేట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

"బ్రిటీష్ నియంతృత్వాన్ని ప్రతిబింబించేలా ఉన్న 'కలెక్టర్' అన్న హోదా పేరును మార్చాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ మాదిరే మున్సిపాలిటీల్లోనూ సంస్కరణల అవసరం ఉంది. తీసుకొస్తాం. పారిశ్రామిక, విద్య,వైద్య, ఐటీ కేంద్రంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతాం"అని కేసీఆర్ అన్నారు.

వరంగల్‌లో 200 ఎకరాల్లో నూతనంగా హెల్త్ కాంప్లెక్స్ ఏర్పాటుచేస్తామని, జిల్లాకు నూతనంగా వెటర్నరీ, డెంటల్ కాలేజ్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ముస్లిం వృద్ధుడిని కొట్టిన కేసు: పోలీసుల లీగల్ నోటీసులకు ట్విటర్ ఏమని సమాధానం ఇచ్చింది

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ముస్లిం వృద్ధుడిని చితకబాదిన వీడియోకు సంబంధించి పోలీసులు జారీచేసిన లీగల్ నోటీసులకు ట్విటర్ ఇండియా సమాధానం ఇచ్చింది.

వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ట్విటర్ ఇండియా చెప్పినట్లు ఘాజియాబాద్ సీనియర్ ఎస్‌ఎస్‌పీ అమిత్ పాఠక్ తెలిపారు.

ఈ విషయంలో ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరికి ఘాజియాబాద్ పోలీసులు లీగల్ నోటీసులు పంపారు.

అయితే ఈ విషయంలో ట్విటర్ స్పందనపై పోలీసులు అసంతృప్తితో ఉన్నారని, మరోమారు నోటీసులు పంపేందుకు సిద్ధంగా ఉన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఏడు రోజుల్లో వాంగ్మూలం ఇచ్చేందుకు లోని పోలీస్ స్టేషన్‌కు రావాలని ట్విటర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరీకి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

ముస్లిం వృద్ధుడిని చితకబాదిన వీడియో వైరల్ కావడంలో ట్విటర్ పాత్రపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. కొత్త ఐటీ నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వం, ట్విటర్‌ల మధ్య వివాదం నడుస్తున్న సమయంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

కోవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుపై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీంకోర్టు

కోవిడ్‌తో మరణించినవారి కుటుంబీకులకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేసియా ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన వివిధ పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ రిజర్వ్‌లో ఉంచింది.

2005 నాటి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్ 12 అనుసారం, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ ప్రకారం ఈ పరిహారం అమలు చేయాలంటూ పలువురు వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఈ కేసులో విచారణను పూర్తిచేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

జస్టిస్ అశోక్ భూషన్ నేతృత్వంలో జస్టిస్ ఎంఆర్ షా ఉన్న ఇద్దరు సభ్యుల ధర్మాసనం.. మూడు రోజుల్లోగా దీనిపై రాతపూర్వకంగా వివరాలు దాఖలు చేయాలని రెండు పక్షాలను ఆదేశించింది.

బాధితులకు ఏదైనా పథకం రూపంలో కానీ మార్గదర్శకాల ప్రకారం కానీ ఎక్స్‌గ్రేషియా అందేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్‌దారుల్లో ఒకరైన న్యాయవాది గౌరవ్ బన్సల్ కోర్టును కోరారు.

కాగా ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై తన వాదనలు వినిపిస్తూ.. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఈ కరోనా మహమ్మారికి వర్తిస్తుందని.. దాని ప్రకారమే ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల డిజాస్టర్ రెస్పాన్స్ వ్యవస్థలకు నిధులు ఇచ్చిందని, కోవిడ్ ప్రభావిత కుటుంబాలను ఆదుకునే ప్రయత్నమూ చేసిందని తెలిపారు.

ఆక్సిజన్ సరఫరా, ఇతర అత్యవసర సహాయాలు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ మైగ్రేషన్ యాక్ట్ పరిధిలో కానీ జరిగాయని చెప్పారు.

కోవిడ్ ప్రభావం తగ్గించే చర్యలు, సన్నద్ధతా చర్యలపై ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు దృష్టి పెట్టిందని ఆయన కోర్టుకు తెలిపారు.

ఆర్థిక సంఘం సలహాలు, సూచనలన్నిటినీ పార్లమెంటు ఆమోదించిందని.. ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకుండా చూస్తామని తుషార్ మెహతా కోర్టుకు చెప్పారు.

నిన్న జరిగిన కేసు విచారణ సందర్భంగా, కోవిడ్-19తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారాన్ని ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణమని వివరించింది.

కరోనా సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందిస్తూ దాఖలుచేసిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.

''కోవిడ్ సంక్షోభంలో చిక్కుకున్న వారి కోసం కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగా ఖర్చుపెడుతున్నాయి. ఇప్పటికే మా ఖజానాలపై చాలా భారం పడుతోంది'' అని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

''కోవిడ్‌తో పెద్దయెత్తున మరణాలు సంభవించడం దురదృష్టకరం. మృతుల కుటుంబాలతోపాటు దేశానికి ఇది తీర్చలేని లోటు.''

''ఇది ఒక విపత్తులాంటి సమయం. మన దేశంలో కరోనావైరస్ పెద్దయెత్తున విజృంభించింది. దీన్నుంచి ప్రజలను రక్షించేందుకు భిన్న చర్యలు, వ్యూహాలు అవసరం అవుతాయి. ఈ పరిస్థితులు మాకు సవాల్ విసురుతున్నాయి'' అని చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)