సూర్య గ్రహణం: ఈరోజు 'రింగ్ ఆఫ్ ఫైర్' భారత్‌లో ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది... ఏయే దేశాల్లో చూడవచ్చు

సూర్య గ్రహణం

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

జూన్ 10న జ్యేష్ట అమావాస్య రోజున ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం ఏర్పడబోతోంది.

భారత కాలమానం ప్రకారం ఈ సూర్య గ్రహణం మధ్యాహ్నం 1.42 నిమిషాలకు మొదలై, సాయంత్రం 6.41కు ముగుస్తుంది. అయితే, ఈ సూర్య గ్రహణం భారత్‌లో చాలా ప్రాంతాల్లో కనిపించదు.

నాసా జారీ చేసిన ఇంటరాక్టివ్ మ్యాప్ ప్రకారం భారత్‌లో ఈ సూర్య గ్రహణం కేవలం లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపించవచ్చని భావిస్తున్నారు. అక్కడ కూడా అది కొన్ని నిమిషాలే కనిపించనుంది.

అయితే, ఈ సూర్య గ్రహణాన్ని ఈశాన్య అమెరికా, యూరప్, ఉత్తర ఆసియా, ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో చూడచ్చు.

నాసా ఈ సూర్య గ్రహణం లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇస్తోంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా అందరూ చూడవచ్చు. లైవ్ స్ట్రీమింగ్‌ను ఈ లింక్ ద్వారా చూడచ్చు.

సూర్య గ్రహణం

ఫొటో సోర్స్, NASA

అగ్ని వలయం

గ్రహణం సమయంలో సూర్యుడు వలయాకారంలో కనిపిస్తాడు. దీనిని 'రింగ్ ఆఫ్ ఫైర్' లేదా 'అగ్ని వలయం'గా వర్ణిస్తున్నారు.

సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు ఈ వలయాకార సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

నిజానికి ఈ ఖగోళ ఘటన సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్ల ఏర్పడుతుంది. దానివల్ల కొంత సమయంపాటు ఒక నిర్ధిష్ట ప్రాంతంలో చీకట్లు అలుముకుంటాయి.

అయితే చంద్రుడు చిన్నగా ఉండడం వల్ల, అది సూర్యుడిని పూర్తిగా కప్పేయలేదు. అందుకే, చంద్రుడి అంచుల్లో సూర్యుడు ఒక అగ్ని వలయంలా కనిపిస్తాడు.

నాసా వివరాల ప్రకారం ఈ 'రింగ్ ఆఫ్ ఫైర్' కేవలం కెనడా, గ్రీన్‌లాండ్, ఉత్తర రష్యాలోని కొన్ని భాగాల్లోనే కనిపిస్తుంది.

ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు ఏర్పడనున్నాయి. రెండోది 2021 డిసెంబర్ 4న వస్తుంది. అది కూడా భారత్‌లో కనిపించదు. ఇంతకు ముందు మే 26న ఏర్పడిన 'సూపర్ బ్లడ్ మూన్' అంటే చంద్ర గ్రహణం కూడా భారత్‌లో కనిపించలేదు.

సూర్య గ్రహణం

ఫొటో సోర్స్, Alamy

గ్రహణం గురించి భయపెట్టే నమ్మకాలు

గ్రహణం అరిష్టాలకు సంకేతం అని నమ్మే వారు ప్రపంచంలో ఇప్పటికీ ఉన్నారు. అంటే వీరంతా గ్రహణాన్ని యుగాంతం లేదా భయంకరమైన కల్లోలాలకు హెచ్చరికగా భావిస్తారు.

దేవతలు, రాక్షసులు అమృతం చిలికిన తర్వాత రాహు కేతువులు సూర్య, చంద్రులను మింగడం వల్లే గ్రహణాలు ఏర్పడినట్లు హిందూ పురాణాల్లో కథలు ఉన్నాయి.

గ్రహణాలు ఎప్పటినుంచో మనుషులను ఎంత ఆశ్చర్యపరుస్తున్నాయో, అంత భయపెడుతూ కూడా వచ్చాయి.

నిజానికి, గ్రహణం గురించి మనుషులకు సరైన సమాచారం తెలియకపోవడం వల్ల, అనుకోకుండా గ్రహణం రోజున సూర్యుడు కనిపించక, చీకట్లు కమ్ముకోవడంతో వారు దాని వెనుక ఎన్నో కల్పితాలు, కథలు ఊహించుకున్నారు.

"మిట్ట మధ్యాహ్నం చీకట్లు కమ్ముకున్నాయి. ఈ అనుభవం తర్వాత ఇక నేను దేనికీ ఆశ్చర్యపోను" అని 17వ శతాబ్దంలో గ్రీకు రచయిత ఆర్కిల్కస్ చెప్పారు.

ఇప్పుడు, గ్రహణాలకు కారణం ఏంటో మనకు స్పష్టంగా తెలిసినప్పటికీ, వాటికి సంబంధించిన కథలు, మూఢనమ్మకాలను కొనసాగుతూనే ఉన్నాయి.

"17వ శతాబ్దం చివరి ఏళ్ల వరకూ ఎక్కువ మందికి గ్రహణం ఎందుకు ఏర్పడుతుందో, నక్షత్రాలు ఎందుకు రాలుతాయో తెలీదు. అయితే 18వ శతాబ్దం నాటికి ఖగోళశాస్త్రజ్ఞులు గ్రహణాల వెనుక వైజ్ఞానిక కారణాలు కనుగొన్నారు" అని కాలిఫోర్నియా గ్రిఫిత్ అబ్జర్వేటరీ డైరెక్టర్ ఎడ్విన్ క్రప్ చెప్పారు.

"అప్పటివారికి ఆ సమాచారం తెలీకపోవడానికి కారణం కమ్యూనికేషన్, విద్య లేకపోవడమే. అప్పట్లో ఒక సమాచారం అందరికీ చేర్చడం కష్టంగా ఉండేది. అందుకే, మూఢనమ్మకాలు అలాగే ఉండిపోయాయి" అన్నారు.

"ప్రాచీన కాలంలో మనుషుల దినచర్య ప్రకృతి నియమాల ప్రకారం ఉండేవి. ఆ నియమాల్లో ఏదైనా మార్పులు వస్తే మనుషులు ఆందోళనకు గురయ్యేవారు" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)