తెలంగాణలో మే 12 నుంచి లాక్‌డౌన్... మినహాయించిన రంగాలు ఇవే

కేసీఆర్

ఫొటో సోర్స్, Telangana CMO

ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

తెలంగాణలో మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే ప్రజలు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు.

ఆ తరువాత అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని, పూర్తి కట్టడికి చర్యలు తీసుకోనున్నట్లు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

అలాగే, టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది.

క్యాబినెట్ నిర్ణయాలు:

  • యుద్ధ ప్రాతిపదికన.. వ్యాక్సీన్ ప్రొక్యూర్ మెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయం.
  • తెలంగాణ చుట్టూ.. రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు.
  • ప్రభుత్వ రంగంతోపాటు, ప్రైవేట్ రంగంలో కూడా రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, ఇతర కరోనా మందులను అందుబాటులోకి తేవాలని, వీటి కొరత రాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను క్యాబినెట్ ఆదేశించింది.
  • అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కలెక్టర్, డీఎంహెచ్ఓ, జిల్లా కేంద్రంలోని దవాఖానా సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్ స్పెక్టర్లతో కమిటీ వేయాలని నిర్ణయం. ప్రతిరోజూ ఆయా జిల్లాల మంత్రులు వారి వారి జిల్లా కేంద్రాల్లో కరోనాపై సమీక్ష చేయాలి.
  • రెమిడిసివర్ ఇంజక్షన్ ఉత్పత్తిదారులతో క్యాబినెట్ సమావేశం నుంచే ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి, రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు.
  • ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సీన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకం.
  • పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉంటారు.
హైదరాబాద్ లాక్ డౌన్

ఫొటో సోర్స్, Getty Images

లాక్ డౌన్ నుంచి మినహాయించిన రంగాలు:

  • వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదు.
  • తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలి.
  • వైద్య రంగంలో ఫార్మాసూటికల్ కంపెనీలు, వైద్య పరికరాల తయారీ కంపెనీలు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపులు, అన్నిరకాల వైద్య సేవలు, ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు, వారి ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక పాసులిచ్చి, వాహనాలకు అనుమతిస్తారు.
  • గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ యధావిధిగా సాగుతుంది.
  • విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలు, వాటి అనుబంధ కార్యకలాపాలు యధావిధిగా పనిచేస్తాయి.
  • జాతీయ రహదారుల మీద రవాణా యధావిధిగా కొనసాగుతుంది.
  • జాతీయ రహదారులపై పెట్రోల్, డీజిల్ పంపులు నిరంతరం తెరిచే ఉంటాయి.
  • కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌసింగ్ కార్యకలాపాలకు మినహాయింపు.
  • ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు మినహాయింపు.
  • ఉపాధిహామీ పనులు యధావిధిగా కొనసాగుతాయి.
  • ప్రభుత్వ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
  • గత లాక్ డౌన్ సమయంలో మాదిరిగానే బ్యాంకులు, ఏటీఎంలు యధావిధిగా పనిచేస్తాయి.
  • అన్ని ముందస్తు అనుమతులతో జరిపే పెళ్లిళ్లకు గరిష్టంగా 40 మందికి మాత్రమే అనుమతి.
  • అంత్యక్రియల సందర్భంలో గరిష్టంగా 20 మందికి అనుమతి.
  • ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నిరకాల మెట్రో, ఆర్టీసీ ప్రజా రవాణా అందుబాటులో ఉంటుంది.
  • ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయి.
  • కుకింగ్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ సరఫరా కొనసాగుతుంది.
  • సినిమాహాళ్లు, క్లబ్బులు, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ స్టేడియంల మూసివేత.
  • పైన తెలిపిన మినహాయింపులను పూర్తిస్థాయిలో కోవిడ్ నిబంధనలను అనుసరించి కఠినంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని క్యాబినెట్ ఆదేశించింది.
  • మే 20వ తేదీన క్యాబినెట్ తిరిగి సమావేశం అవుతుంది. లాక్ డౌన్ కొనసాగించే విషయంపై సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకుంటుంది.
తెలంగాణ లాక్‌డౌన్ జీఓ

ఫొటో సోర్స్, Telangana I & PR

ఫొటో క్యాప్షన్, తెలంగాణ లాక్‌డౌన్ జీఓ
తెలంగాణ లాక్‌డౌన్ జీఓ పేజీ-2

ఫొటో సోర్స్, Telangana I&PR

ఫొటో క్యాప్షన్, తెలంగాణ లాక్‌డౌన్ జీఓ పేజీ-2
తెలంగాణ లాక్‌డౌన్ జీఓ, పేజీ-3

ఫొటో సోర్స్, Telangana I&PR

ఫొటో క్యాప్షన్, తెలంగాణ లాక్‌డౌన్ జీఓ, పేజీ-3

లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలన్న డీజీపీ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అన్ని స్థాయిల్లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి అన్నారు.

వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ- పాస్‌ల కోసం https://policeportal.tspolice.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

సడెన్‌గా లాక్‌డౌన్ అంటే ఎలా? -హైకోర్టు

'ఇవాళ ఉదయం 10 గంటల వరకు మీరు కనీసం వీకెండ్ లాక్ డౌన్ కూడా పెట్టాలనే ఆలోచన లో లేరు. కానీ, సడెన్ గా రేపటి నుండి లాక్ డౌన్ ప్రకటించారు. ఇంత తక్కువ టైంలో ఇతర రాష్ట్రాల ప్రజలు ఎలా వారి ప్రాంతాలకు వెళ్లిపోతారు' అని హైకోర్టు ప్రశ్నించింది.

గత ఏడాది లాక్‌డౌన్ విధించినప్పుడు వలస కార్మికులు ఇబ్బందులు పడినట్లు ఈ సారి ఇబ్బంది పడకుండా చూడాలని పిటిషనర్ కోరారు.

దీనిపై అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ, 50 శాతం వలస కార్మికులు సొంత ఊళ్లకు వెళ్లారని, అవసరమైన వారికి ఎమర్జెన్సీ పాసులు ఇస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)