విశాఖలో కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన ఏడాదిన్నర పాప

పాపతో తండ్రి వీరబాబు
ప్రచురణ

విశాఖలో ఏడాదిన్నర పాప కరోనాతో ప్రాణాలు విడిచింది. నాలుగు రోజుల కిందట జ్వరం రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ పాపను చేర్పించారు.

ఆ తరువాత పరీక్షల్లో ఆ చిన్నారికి కోవిడ్ సోకినట్లు నిర్ధరణైంది.

పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రైవేట్ ఆస్పత్రి నుంచి కేజీహెచ్‌కు తరలించారు. అక్కడే పాప మృతి చెందింది.

పాప తండ్రి వీరబాబు సీఐఎస్ఎఫ్‌లో పనిచేస్తున్నారు. వారిది విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం చౌడుపల్లి గ్రామం.

నాలుగు రోజుల కిందట పాపకు జలుబు, జ్వరం, దగ్గు మొదలవడంతో స్థానిక వైద్యుల సూచన మేరకు ఆ చిన్నారిని తల్లిదండ్రులు గాజువాకలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.

అక్కడ మూడు రోజుల పాటు ఆ పాపకు చికిత్స అందించారు.

అయినా జ్వరం తగ్గకపోవడంతో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్ అని తేలింది.

మృతిచెందిన ఏడాదిన్నర పాప

దాంతో నిన్న విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.

పాప ప్రాణాపాయ స్థితిలో ఉందంటూ ఎంత బతిమాలినా అక్కడి వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది చికిత్స అందించలేదని తండ్రి వీరబాబు తెలిపారు.

బెడ్లు ఖాళీలేవని చెప్తున్నారని, ఎవరైనా సాయం చేయండంటూ ఆసుపత్రి ముందే పాప తల్లిదండ్రులు అందరిని ప్రాథేయపడ్డారు.

తండ్రే స్వయంగా అంబులెన్స్‌లో హ్యాండ్ పంపుతో పాపకి ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేశారు.

మరోవైపు, సీఎస్సార్ బ్లాక్ వద్ద పదుల సంఖ్యలో అంబులెన్సు‌లు క్యూ కట్టాయి.

ఎంతోమంది రోగులు బెడ్స్ లేక, అంబులెన్స్‌లోనే పడిగాపులు పడుతున్నారు.

ఆస్పత్రికి తీసుకొచ్చిన గంటన్నర వ్యవధిలోనే పాప ప్రాణాలు విడిచింది.

డాక్టర్లు ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం, కనీసం వైద్యులు బయటకు వచ్చి చూడకపోవడం వలనే తమ పాప మరణించిందంటూ తండ్రి వీరబాబు ఆరోపించారు.

కేజీహెచ్ అధికారులు దీనిపై స్పందించారు.

"ఏడాదిన్నర పాపను చేర్చుకోలేదని అనడం అవాస్తవం. కేజీహెచ్ సీఎస్సార్ బ్లాక్‌లో ఆ చిన్నారికి అడ్మిషన్ ఇచ్చాం. అయితే, కేజీహెచ్‌‌కు తీసుకుని వచ్చే సమయానికే ఆమె పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. పిడియాట్రీషన్‌ సహా ఇతర వైద్యులు కూడా ఆ పాపకు వైద్యం అందించారు. వైద్యం ప్రారంభించిన రెండు గంటల తరువాత ఆమె చనిపోయింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఉందనడం అవాస్తవం" అని కేజీహెచ్ సూపరింటెండెంట్ పి. మైథిలి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)