పవన్ కల్యాణ్ ఓడిపోయినా... నిలబడ్డారు: ప్రకాశ్ రాజ్-ప్రెస్ రివ్యూ

ప్రకాష్ రాజ్
ప్రచురణ

పవన్‌ది, తనది ఒకే భావజాలం అని నటుడు ప్రకాష్ రాజ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆంధ్రజ్యోతి ప్రచురించింది.

ఆ కథనం ప్రకారం.. పవన్‌ను చాలా ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను. ఆయనతో రాజకీయంగా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

పవన్ మాట్లాడుతూ... ప్రకాష్ రాజ్‌తో భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆయన అభిప్రాయాలను గౌరవిస్తాను అన్నారు.

పవన్ ఒక లీడర్. ఆయన్ను ప్రేమిస్తాను కాబట్టే పవన్ అలా ఉండాలని కోరుకుంటాను అని ప్రకాశ్‌రాజ్ చెప్పారు.

సెట్‌లో నాకు పవన్ కల్యాణ్‌కు మధ్య మంచి చర్చలు సాగేవి.

ప్రొటెస్ట్ పొయెట్రీ కర్ణాటకలో ఎలా ఉంటుంది.. నాకు పుస్తకాలు కావాలి అని ఆయన నన్ను అడిగారు. అలాగే నా దోసిట చినుకులు పుస్తకాలు చదివి మీ ఐడియాలజీ బాగుంది అని పవన్ అన్నారు. మా మధ్య ఇలాంటి చర్చలు చాలా జరిగాయి అని ప్రకాశ్ రాజ్ చెప్పారు.

పవన్ కల్యాణ్‌కు‌, నాకు సమాజం పట్ల, ప్రజల పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మహిళల గురించి ఇంకా సినిమాలు రావాలి. పురుషుల్లో మార్పు రావాలి. తల్లిదండ్రులు అబ్బాయిల్ని పెంచేప్పుడే సన్మార్గంలో పెట్టాలి. మహిళల్ని గౌరవించడం నేర్పాలి.

నేను ఈ సినిమాలో అమ్మాయిల్ని బాధ పెడుతూ ప్రశ్నించాను. 'ఆర్ యూ వర్జిన్' అని అడిగినప్పుడు బాధగా అనిపించింది. అయితే నేను నటుడిని, నా క్యారెక్టర్ ప్రకారం నటించాను. కానీ లోపల బాధగానే అనిపించింది.

పవన్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓడిపోయారు. రాజకీయం మనం అనుకునే దాని కంటే సంక్లిష్టమైనది. ఓడిపోయినా ప్రజల కోసం పవన్ నిలబడ్డారు. అదీ గొప్ప రాజకీయ నాయకుడి లక్షణం. పవన్‌లో ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అని ప్రకాశ్ రాజ్ అన్నట్లు ఆంధ్రజ్యోతి కథనం తెలిపింది.

'తిరుపతిలో చంద్రబాబు ప్రచార సభపై రాళ్ల దాడి'

సభలో పడిన రాయిని చూపిస్తున్న చంద్రబాబు

ఫొటో సోర్స్, ugc

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార సభపై రాళ్ల దాడి జరిగిందని ఆంధ్రజ్యోతి వార్తా కథనం ప్రచురించింది.

దాని ప్రకారం తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభపై రాళ్ల దాడి జరిగింది.

ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. రాళ్ల దాడి నుంచి కార్యకర్తలకు రక్షణ కల్పించాలని పోలీసులను చంద్రబాబు సభాముఖంగా కోరారని పత్రిక రాసింది.

కానీ వారి నుంచి స్పందన, సమాధానం లేవు. తీవ్రంగా పరిగణించిన ఆయన వాహనంపై నుంచి దిగి రోడ్డుపైనే బైఠాయించారు.

ప్రచారంలో పాల్గొనేందుకు సోమవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న చంద్రబాబు.. నగరంలోని కృష్ణాపురం ఠాణా కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు.

వాహనంపై నుంచే ఆయన మాట్లాడారు. రాత్రి సుమారు 7.45 గంటల సమయంలో ప్రసంగం ముగిస్తుండగా సమీపంలోని భవనాలపై నుంచి ఎవరో రాళ్లు విసిరారు. టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు అని ఆంధ్రజ్యోతి చెప్పింది.

తమపై పడిన రాళ్లను వారు చంద్రబాబుకు చూపించారు. గాయపడిన ఒక కార్యకర్తను ఆయన వాహనంపైకి పిలిపించి.. గాయాలను ప్రజలకు చూపించారు.

'పోలీసులు ఉన్నారా? లేరా? ఇంత పెద్ద మీటింగులో పోలీసులెవరూ లేరా' అని నిలదీశారు. 'రండిరా తడాఖా చూపిస్తాం. ధైర్యంగా ముందుకు రండి.. తాడోపేడో తేల్చుకుందాం. పోలీసులను అడ్డుపెట్టుకుని రాళ్ళు వేస్తే తోలు తీస్తా.. తాట తీస్తా' అని రాళ్లు రువ్వినవారిని హెచ్చరించారని పత్రిక వివరించింది.

స్పుత్నిక్ వి టీకా

ఫొటో సోర్స్, EPA

స్పుత్నిక్‌ వి టీకాకు అనుమతివ్వండి

భారతదేశంలో మూడో వ్యాక్సీన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని సీడీఎస్‌సీఓ సిఫారసు చేసిందని సాక్షి దినపత్రిక వార్త ప్రచురించింది.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వి కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎస్‌సీఓ)కు చెందిన విషయ నిపుణుల కమిటీ(ఎస్‌ఈసీ) సిఫార్సు చేసింది.

భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేయాలని డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ సంస్థ చేసిన విజ్ఞాపనను నిపుణుల కమిటీ పరిశీలించిందని పత్రిక రాసింది.

అనుమతి ఇవ్వొచ్చంటూ డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. డీసీజీఐ సైతం ఆమోదిస్తే స్పుత్నిక్‌ వి టీకా భారత్‌లో అందుబాటులోకి వస్తుంది.

దేశంలో ప్రజలకు అందే మూడో కోవిడ్‌-19 టీకా ఇదే అవుతుంది. అన్ని అనుమతులు లభిస్తే స్పుత్నిక్‌ వి టీకాను అత్యవసర వినియోగం కోసం రష్యా నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇండియాలో ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్, సరఫరా హక్కులను డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు గత ఏడాది సెప్టెంబర్‌లో రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌)తో భాగస్వామిగా మారింది.

స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ 91.6 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో నిర్ధారణ అయ్యింది.

డీసీజీఐ భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ టీకాల అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిని ప్రస్తుతం లబ్ధిదారులకు అందజేస్తున్నారని సాక్షి వివరించింది.

ద్రవ్యోల్బణం పెరిగింది

ఫొటో సోర్స్, PTI

ద్రవ్యోల్బణం మరింత పెరిగింది

ఆహార, ఇంధన ధరలు పెరగడంతో భారత్‌లో ద్రవ్యోల్బణం పెరిగినట్లు నమస్తే తెలంగాణ వార్త ప్రచురించింది.

దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం మరింత ఎగబాకింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.03 శాతంగా నమోదైన వినిమయ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. మార్చిలో 5.52 శాతానికి పెరిగి నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది.

ఆహార, ఇంధన ధరల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమని సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని పత్రిక రాసింది.

ఫిబ్రవరిలో 3.87 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం.. మార్చిలో 4.94 శాతానికి దూసుకెళ్లినట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్వో) వెల్లడించింది.

అలాగే 'ఫ్యూయల్‌ అండ్‌ లైట్‌' విభాగంలో ద్రవ్యోల్బణం 3.53 శాతం నుంచి 4.50 శాతానికి పెరిగినట్లు తెలిపింది.

రిటైల్‌ ద్రవ్యోల్బణం 2020-21 ఆర్థిక సంవత్సర జనవరి-మార్చి త్రైమాసికంలో 5 శాతంగా, ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి రెండు త్రైమాసికాల్లో 5.2 శాతంగా ఉండొచ్చని రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) ఇటీవల అంచనా వేసింది.

గతేడాది జూన్‌-నవంబర్‌ మధ్య కాలంలో వరుసగా ఆరు నెలలపాటు 6 శాతం గరిష్ఠ పరిమితిని అధిగమించిన వినిమయ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టి ఈ ఏడాది జనవరిలో 4.1 శాతానికి దిగివచ్చింది.

కూరగాయలు, తృణధాన్యాల ధరలు తగ్గడమే ఇందుకు కారణం. కానీ ఫిబ్రవరిలో ఇది మళ్లీ 5.03 శాతానికి ఎగబాకిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)