కరోనావైరస్: 24 గంటల్లో దేశంలో 1,31,968 పాజిటివ్ కేసులు.. 780 మరణాలు - News Reel

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

దేశంలో గత 24 గంటల్లో 1,31,968 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. 780 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారని.. 61,899 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,79,608 కాగా మొత్తం మృతుల సంఖ్య 1,67,642కి చేరింది.

అమెరికా: జార్జ్ ఫ్లాయిడ్ కేసులో కీలక సాక్ష్యం చెప్పిన డాక్టర్

అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ హత్య కేసులో వైద్య నిపుణుడు మార్టిన్ టోబిన్ కీలకమైన సాక్ష్యం చెప్పారు. అరెస్టు చేస్తున్న సమయంలో ఊపిరి ఆడకే ఫ్లాయిడ్ మరణించారని ఆయన కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

గత ఏడాది మే 25న ఫ్లాయిడ్‌‌ను అరెస్టు చేసే క్రమంలో తెల్ల జాతికి చెందిన పోలీసు అధికారి డెరెక్ షావిన్... ఆయన్ను నెలకు అదిమిపట్టి, మెడను మోకాలితో నొక్కిపట్టి కూర్చున్నారు. చాలా సేపు డెరెక్ అలాగే కూర్చుండిపోవడంతో ఫ్లాయిడ్ మరణించారు.

ఈ ఘటన వీడియో కూడా అప్పుడు బయటకు వచ్చింది.

దీంతో అమెరికాలో జాత్యహంకారం, నల్ల జాతీయులపై పోలీసుల కర్కశత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి.

అయితే, ఫ్లాయిడ్ ఫెంటానిల్ అనే ఔషధం ఓవర్‌డోస్ అవ్వడం వల్ల మరణించి ఉండొచ్చని డెరెక్ తరఫు న్యాయవాది వాదించారు.

కానీ, తాజాగా కోర్టులో మార్టిన్ టోబిన్ సాక్ష్యం చెబుతూ... ‘‘ఫ్లాయిడ్ మరణానికి ఫెంటానిల్ ఓవర్‌డోస్ కారణం కాదు. డెరెక్ వ్యవహరించిన తీరు వల్ల ఫ్లాయిడ్ స్థానంలో ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఎవరున్నా చనిపోయేవారు. నేలకు అదిమిపట్టి, మెడపై నొక్కి కూర్చోవడం వల్ల ఫ్లాయిడ్‌కు ఊపిరి తీసుకోవడం సాధ్యపడలేదు. ఫెంటానిల్ ఔషధం ఓవర్‌డోస్ అయితే, ఆక్సీజన్ తనకు అందడం లేదన్న విషయం ఆ వ్యక్తికి తెలియదు. నిద్రలోకి జారుకుంటున్నట్లుగా ఆ వ్యక్తి అయిపోతారు. కానీ, ఫ్లాయిడ్ తనకు ఊపిరి ఆడటం లేదంటూ పోలీసులను వేడుకోవడం వీడియోలో స్పష్టంగా కనిపించింది’’ అని వివరించారు.

కోవిడ్ రోగికి సజీవ దాతల నుంచి ఊపిరితిత్తి మార్పిడి... ప్రపంచంలో ఇలాంటి చికిత్స ఇదే తొలిసారి

జపాన్‌లో కోవిడ్‌తో బాధపడుతున్న ఓ మహిళకు సజీవ దాతల నుంచి ఊపిరితిత్తిని తీసుకుని వైద్యులు అమర్చారు. ఇలాంటి చికిత్స చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి.

కరోనావైరస్ సోకిన తర్వాత సదరు మహిళ ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఆమె భర్త, కొడుకు ఊపిరితిత్తుల నుంచి కొంత భాగాలను తీసుకుని, ఆమెకు వైద్యులు అమర్చారు.

ఈ చికిత్స తర్వాత ఆమె పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు.

సాధారణంగా చనిపోయినవారి నుంచి అవయవాలు సేకరించి, అవసరమైన రోగులకు వైద్యులు అమరుస్తుంటారు.

అయితే, ఊపిరితిత్తుల మార్పిడి కోసం ఇలా వేచిచూస్తున్నవారి సంఖ్య జపాన్‌లో చాలా ఎక్కువగా ఉంది. సరైన ఊపిరితిత్తి దొరికేందుకు ఆమెకు కొన్నేళ్ల సమయం పట్టే అవకాశాలున్నాయి.

దీంతో ఆ మహిళకు ఊపిరితిత్తి దానం చేసేందుకు ఆమె భర్త, కొడుకు ముందుకు వచ్చారు. దీని వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావొచ్చని వైద్యులు తెలియజేసినా, వారు దానం చేసేందుకు ఒప్పుకున్నారు.

దీంతో వైద్యులు 11 గంటలపాటు శస్త్ర చికిత్స నిర్వహించి, ఊపిరితిత్తి మార్పిడి చేశారు.

''ఈ చికిత్స ద్వారా ఓ కొత్త మార్గం తెరుచుకున్నట్లైంది'' అని ఈ శస్త్ర చికిత్సకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ హిరోషీ డేట్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)