ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్‌లో కేరళ నన్‌లను ఎందుకు దించేశారు.. ఏమిటీ మతమార్పిడి వివాదం

నన్‌లతో విచారణ
    • రచయిత, సమీరాత్మజ్ మిశ్రా
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో కేరళకు చెందిన ఇద్దరు నన్‌లను కొందరు ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భరోసా ఇవ్వడం, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆయనకు లేఖ రాయడం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్లు చేయడంతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది.

ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్‌ను టార్గెట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

"సంఘ్ పరివార్ విద్వేష ప్రచారం ఫలితంగానే, యూపీలో కేరళ నన్‌లపై ఈ దాడి జరిగింది. మైనారిటీలను అణచివేయడానికి అది ఒక సమాజానికి, మరో సమాజానికి మధ్య గొడవ పెడుతోంది" అన్నారు రాహుల్ గాంధీ.

గత వారం దిల్లీ నిజాముద్దీన్ నుంచి రైల్లో వస్తున్న ఇద్దరు నన్‌లు, వారితో ఉన్న మరో ఇద్దరు మహిళలపై కొందరు మత మార్పిడి అనుమానంతో ఫిర్యాదు చేశారు. దీంతో, వారిని ఝాన్సీ రైల్వే స్టేషన్లో దించేశారు. విచారణ తర్వాత వారిని వెళ్లనిచ్చారు.

కేరళ ముఖ్యమంత్రి ఈ ఘటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. తర్వాత కేంద్ర హోం శాఖ మొత్తం ఘటనపై రైల్వే పోలీసుల నుంచి (జీఆర్‌పీ) నుంచి నివేదిక తెప్పించింది.

మొత్తం రిపోర్టును హోంశాఖకు పంపించామని, కేసును జీఆర్పీ దర్యాప్తు చేస్తోందని ఝాన్సీ జీఆర్పీ డీఎస్పీ నయీమ్ ఖాన్ బీబీసీతో చెప్పారు.

"ఈ ఘటనకు సంబంధించిన మొత్తం రిపోర్టును హోం శాఖకు పంపించాం. కేసులో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. కానీ జీఆర్పీ తన స్థాయిలో దీనిని దర్యాప్తు చేస్తోంది. తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం" అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Ani

అసలు కేసు ఏంటి

మార్చి 19న(శుక్రవారం) ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్‌లో కేరళకు చెందిన ఇద్దరు నన్‌లు, మరో ఇద్దరు మహిళలతో ఒడిశాలోని రూర్కెలా వెళ్తున్నారు. అదే రైల్లో మరో కోచ్‌లో ఝాన్సీ వస్తున్న కొంతమంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలూ ఉన్నారు.

నన్‌లు మతమార్పిడి చేస్తున్నారని సందేహించిన ఏబీవీపీ కార్యకర్తలు రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు. ఝాన్సీలోని తమ కార్యకర్తలకు కూడా ఆ సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న జీఆర్పీ సిబ్బంది ఝాన్సీ రైల్వే స్టేషన్ చేరుకుని నలుగురు మహిళలను రైల్లో నుంచి దించేసి, విచారించారు. కానీ తర్వాత వారిపై వచ్చిన మతమార్పిడి ఆరోపణలు నిజం కాదని తేలడంతో వదిలేశారు.

విచారణ తర్వాత నలుగురిని మరో రైలులో రూర్కెలా పంపించామని జీఆర్పీ డీఎస్పీ నయీమ్ ఖాన్ చెప్పారు.

"ఏబీవీపీకి చెందిన అజయ్ శంకర్ తివారీ ఈ కేసులో మాకు లిఖిత ఫిర్యాదు ఇచ్చారు. మేం ఘటనా స్థలానికి చేరుకున్నాం. మా విచారణలో మిగతా ఇద్దరు మహిళల రూర్కెలాకు చెందినవారే అని తేలింది. మేం వాళ్ల గుర్తింపు కార్డులు కూడా పరిశీలించాం. వారు పుట్టుకతోనే క్రైస్తవులని తెలిసింది. అక్కడ మాతమార్పిడి ఏదీ జరగలేదు. మేం ఎవరితోనూ దురుసుగా ప్రవర్తించలేదు. నలుగురు మహిళలను మేం ఒడిశాలో వారి గమ్య స్థానానికి పంపించాం" అన్నారు.

అమిత్ షా

ఫొటో సోర్స్, TWITTER/AMIT SHAH

కఠిన చర్యలు తీసుకుంటాం- అమిత్ షా

క్రిస్టియన్ నన్‌ల పట్ల జరిగిన ఈ ఘటన గురించి కేరళ కాథలిక్ బిషప్ కౌన్సిల్ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేసింది

అయితే, ఆ తర్వాత ఈ విషయం చల్లారిపోయింది. కానీ, హోంమంత్రి అమిత్ షా కేరళలో ఒక సభలో పాల్గొన్నప్పుడు అక్కడి నేతలు ఆయన దగ్గర ఈ విషయం ప్రస్తావించారు. దాంతో, దీనిపై కఠిన దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చిన ఆయన జీఆర్పీ నుంచి మొత్తం నివేదిక తెప్పించుకున్నారు.

"నన్‌ల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసులో దోషులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చూస్తామని నేను కేరళ ప్రజలకు హామీ ఇస్తున్నా" అని బుధవారం కేరళలో ఒక ఎన్నికల ర్యాలీలో అమిత్ షా చెప్పారు.

కేరళ ముఖ్యమంత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

కేరళ సీఎం లేఖ

బుధవారమే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ కేసుకు సంబంధించి హోంమంత్రికి లేఖ రాశారు.

ఇలాంటి ఘటనలు దేశ ప్రతిష్టను, పరమత సహనం అనే దేశ పురాతన సంప్రదాయాన్ని మంటగలుపుతాయని అన్నారు.

ఆయన తన లేఖలో "ఇలాంటి ఘటనలను కేంద్రం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ద్వారా లభించిన హక్కులకు భంగం కలిగించే ఇలాంటి వారిపై, గ్రూపులపై అధికారులు కఠిన చర్యలు తీసుకునేలా మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను" అని రాశారు.

"యూపీలో జరిగిన ఇలాంటి ఘటనలు దేశంలో మళ్లీ జరగకూడదు. ఇది చాలా దారుణమైన విషయం. ఇలాంటి ఘటనలు ప్రతిష్టను మంటగలుపుతాయి. కేరళలో మత సామరస్యాన్ని దెబ్బ తీసేలా మా ప్రభుత్వం ఎలాంటి మత ప్రచారాలను అనుమతించదు" అన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో కూడా బయటికొచ్చింది. అందులో, పోలీసులు విచారణ కోసం నన్‌లను రైలు నుంచి దించేయడం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)