గసగసాల పంట కోసం చిత్తూరు జిల్లాలో డ్రోన్లతో వేట - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, ANI
చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతంలో గుట్టుగా సాగుతున్న గసగసాల సాగును అరికట్టేందుకు పోలీసులు డ్రోన్ల సాయంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
యాభై మందికిపైగా పోలీసులు డ్రోన్ కెమేరాలతో మదనపల్లి మండలం మాలేపాడు, పెంచుపాడు అడవులు, పొలాలపై జల్లెడ పట్టారు. పది కిలోమీటర్ల పరిధిలో ఏరియల్ సర్వే చేశారు.
చివరకు మాలేపాడు పంచాయతీ దేవళంపల్లెలో 15 సెంట్ల విస్తీర్ణంలో సాగు చేసిన 15వేల మొక్కలను, ఎగుమతికి సిద్ధంగా ఉంచిన మూడు బస్తాల కాయలను పోలీసులు స్వాధీనం చేసుకుని పంటను ధ్వంసం చేశారు. సాగు చేసిన రైతులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఈ రైతుల వెనుక ఓ మాఫియా ముఠా ఉందని, ముంబయికి చెందిన ఓ మహిళ చిత్తూరు జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, చౌడేపల్లె మండలానికి చెందిన వ్యక్తి ద్వారా గసగసాల విత్తనాలను సరఫరా చేశారని ఈ కథనం పేర్కొంది.
పంట పక్వానికి వచ్చాక గసగసాల కాయలను కిలో రూ.4 వేలకు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అంతా సజావుగా జరిగినా, పంట కోతకోసే సమయంలో పోలీసులు దాడులు చేయడంతో గుట్టురట్టయ్యిందని ఈ కథనం వెల్లడించింది.
గసగసాల పంట సాగుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. రాజస్థాన్ రాష్ట్రంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ పంట పండిస్తున్నారు. ఈ పంట సాగుకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
అయితే డ్రగ్స్ మాఫియా ముఠాలు హెరాయిన్, మార్ఫిన్ తయారీకి మారుమూల గ్రామాల్లో రైతులను ప్రలోభపెట్టి రహస్యంగా ఈ పంట సాగు చేయిస్తున్నాయి. గసగసాల కాయలకు గాట్లు పెడితే జిగురు వస్తుంది. ఈ జిగురును హెరాయిన్ తయారీకి ఉపయోగిస్తారు. కాయలోని గసాలను వంటలకు వాడుకుంటారు.
ఔషధాల తయారీలో మత్తు కలిగించే మార్ఫిన్ తయారీకి కూడా గసగసాల (ఓపీయం పాపీ సీడ్స్) కాయలను ముడిసరకుగా ఉపయోగిస్తారని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ స్కూళ్లలో కరోనా కలకలం-ఒక్కరోజే వందకుపైగా కేసులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో కరోన కేసులు పెరుగుతున్నాయని, ప్రత్యక్షంగా తరగతులు జరుగుతుండటంతో ఉపాధ్యాయులు, పిల్లలు కేసుల బారిన పడుతున్నారని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.
ఒక్క మంగళవారం నాడే హైదరాబాద్‌తోపాటు మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోని పలు పాఠశాలల్లో వందకు పైగా కేసులు నమోదైనట్లు ఈ కథనం పేర్కొంది. మంచిర్యాలలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 174మందికి టెస్టులు నిర్వహించగా 35మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఇటు హైదరాబాద్‌లో బండ్లగూడ పరిధిలోని తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 36 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఆనంద్‌నగర్ తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 165 మంది విద్యార్థులు ఉంటున్నారు.
తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో కొందరికి ఒంటి నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు కనిపించడంతో వారు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ 184 మందికి టెస్టులు నిర్వహించగా 36 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
అయితే ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేకపోగా కేవలం నీరసం, ఒంటి నొప్పులు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఇటు కామారెడ్డి టేక్రియాల్‌లోని కేజీబీవీలో 140మందికి టెస్టులు నిర్వహించగా వీరిలో 32మందికి పాజిటివ్ అని తేలింది.
రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసులు బైటపడ్డ స్కూళ్లలో కొందరు టీచర్లు, వార్డెన్లు, తల్లిదండ్రులకు కూడా కరోనా ఉన్నట్లు తేలిందనీ, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం పేర్కొంది.

నేతల వల్లే కాంగ్రెస్ నాశనం, గతి లేక టీడీపీలో ఉన్నా- జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవి కోసం పోటీలు పడి నేతలే కాంగ్రెస్‌ను నాశనం చేశారని, తాను టీడీపీలో ఉన్నా కాంగ్రెస్ నా మాతృ సంస్థ అని మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సాక్షి పత్రిక ఒక కథనం ప్రచురించింది.
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చిన దివాకర్ రెడ్డి టీ కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. ''త్వరలో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ మూతపడుతుంది. కాంగ్రెస్‌కు కాలం చెల్లింది. రాహుల్ విదేశాలకు వెళ్తాడు. సోనియా జపం చేసుకుంటుంది. సీతారామ ప్రాజెక్టు కింద భట్టి సాగు చేసుకుంటారు' అని జేసీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు ఈ కథనం పేర్కొంది.
’’పందెం కాస్తా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాలేదు. కేసీఆర్ వీపు పగలగొడతారు. 2023-24 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఉండదు.'' అని జేసీ వ్యాఖ్యానించినట్లు ఈ కథనం పేర్కంది.
"టీడీపీలో ఉన్నా కాంగ్రెస్ నాకు మాతృపార్టీ. కానీ, కాంగ్రెస్‌ను తిడితే ద్రోహులం అవుతాం. అక్కడ మేం బతికే చాన్స్ లేదు. గతి లేక టీడీపీలో కొనసాగుతున్నా. నిజానికి నాకు దివంగత వై.ఎస్. కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉండేది. ఒకరి కుటుంబ విషయాలు ఇంకొకరం చెప్పుకునేవాళ్లం. స్వతహాగా నేను చంద్రబాబు ద్వేషిని''అని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు సాక్షి కథనం పేర్కొంది.

ఏపీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఇకపై ఇద్దరు డిప్యూటీ మేయర్లు
ఆంధ్రప్రదేశ్‌లోని నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారని ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది.
ప్రభుత్వం నిర్ణయానికి సంబంధించిన ఆర్డినెన్సును గవర్నర్‌కు పంపిస్తామని ఆయన చెప్పినట్లు ఈ కథనం వెల్లడించింది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 18న మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరుగుతుందని, ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత రెండో డిప్యూటీ మేయర్, రెండో వైస్ ఛైర్మన్ ఎన్నికకు అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ఎక్కువ మందికి ప్రభుత్వ సేవలు అందించవచ్చనే ఉద్దేశంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని రామచంద్రారెడ్డి ద్వెల్లడించారు.
మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై రామచంద్రారెడ్డి విమర్శలు చేసినట్లు ఈ కథనం పేర్కొంది. 'ఎస్‌ఈసీ లాంటి సంస్థలకు నియంత్రణతో కూడిన అధికారాలుంటాయి. పదవి ఉందని ఇష్టారీతిన అధికారం చెలాయించడం మంచిది కాదని హైకోర్టు తీర్పుతో స్పష్టమవుతోంది.
వైసీపీని దెబ్బతీసి ప్రతిపక్ష పార్టీకి మేలు చేయాలని ఎస్‌ఈసీ చూశారు. ముందుగా జరపాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పక్కనపెట్టి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. దేశమంతా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంటే ఎన్నికల కారణంగా రాష్ట్రంలో ఆలస్యమవుతోంది' అని రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోతోంది?
- మోదీ జాబ్ దో, మోదీ రోజ్‌గార్ దో... ట్విటర్‌లో మార్మోగిపోతున్న హ్యాష్‌ట్యాగులు
- పెట్రోల్, గ్యాస్ ధరల వల్ల మీ జేబుపై ఎంత భారం పడుతుంది
- మోదీ చెబుతున్నట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి నిజంగా గత ప్రభుత్వాలే కారణమా?
- శాంతియుత నిరసనలు హింసాత్మకంగా ఎందుకు మారతాయి? పోలీసులతో జనం ఎందుకు ఘర్షణకు దిగుతారు?
- చింతల వెంకటరెడ్డి: మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- మీ 'టేక్ హోమ్ సాలరీ' రాబోయే రోజుల్లో తగ్గిపోనుందా... ఎందుకని?
- తెలంగాణలో కుల అహంకార హత్య: ప్రేమించి గర్భం దాల్చిన కూతురిని చంపేసిన తల్లిదండ్రులు
- పులి, మేకల మధ్య స్నేహ బంధం ఎలా సాధ్యం? వైరి జంతువుల మధ్య మితృత్వం వెనుక రహస్యం ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)























