భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాల నిర్వహణ కమిటీలో కేసీఆర్, జగన్, రామోజీరావు, రాజమౌళి... :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 259 మంది ప్రముఖులతో ఉన్నత స్థాయి జాతీయ కమిటీని ఏర్పాటు చేసిందని ఈనాడు ఒక కథనంలో తెలిపింది.
2021 ఆగస్ట్ 15 నుంచి మొదలై 2022 ఆగస్ట్ 15 వరకు ఏడాది పాటు జరిగే ఈ వేడుకల నిర్వహణ కమిటీలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్, భాజపా సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రముఖ గాయని లతా మంగేష్కర్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు దాదాపు అందరు కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, త్రివిధ దళాధిపతులు, లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ పక్షాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలకు స్థానం కల్పించారు.
ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ హోదాలో బండారు దత్తాత్రేయ, రాజకీయ పార్టీల నుంచి చంద్రబాబు నాయుడు, సీతారాం ఏచూరి, విభిన్న రంగాల నుంచి రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ప్రముఖ నృత్య దర్శకుడు ప్రభుదేవా, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, పుల్లెల గోపీచంద్, పీవీ సింధు, మిథాలీరాజ్‌లకు స్థానం దక్కింది.
సినిమా రంగ ప్రముఖులు ఏఆర్ రెహమాన్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, ఇళయరాజా, కేజే ఏసుదాస్‌లూ ఇందులో సభ్యులుగా నియమితులయ్యారు. ఈ కమిటీకి కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి రాఘవేంద్రసింగ్ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు.
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా నిర్వహించాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నది ఈ కమిటీ నిర్ణయిస్తుంది. తక్షణం ఈ కమిటీ అమల్లోకి వచ్చినట్లేనని కేంద్రం వెల్లడించింది. కోఆప్ట్ మెంబర్లను నియమించుకొనే అధికారాన్ని కమిటీకే కట్టబెట్టారు. ఈ కమిటీ తొలి సమావేశం ఈ నెల 8న జరగనున్నట్లు ఈ వార్తలో రాశారు.

ఫొటో సోర్స్, KTR/FACEBOOK
తెలంగాణ భారత్‌లో భాగం కాదా.. కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్
తెలంగాణకు దక్కాల్సిన అంశాల్లో సహాయ నిరాకరణ ఎందుకు? ఏళ్ల తరబడి విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రశ్నించారని సాక్షి ఒక కథనంలో తెలిపింది.
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వార్షిక సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. పారిశ్రామిక రంగంతో పాటు వివిధ రంగాల్లో తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు.
‘‘తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ కూడా కీలకమైన పారిశ్రామిక రంగంలో, న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులు, పథకాలు, ప్రోత్సాహకాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతోంది. నవజాత శిశువు లాంటి తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడటానికి సాయం అందించాలని ఏళ్లుగా కోరుతున్నా కేంద్రం నుంచి స్పందన రావడం లేదు. ఇలా వివక్ష చూపితే ఎలా.. మేం భారత్‌లో భాగం కాదా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలను కేంద్రం తుంగలో తొక్కిందని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు వంటి హామీలను గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఆరేండ్లలో రూ.57 వేల కోట్ల నుంచి రూ.1.40 లక్షల కోట్లకు చేరినా.. కేంద్రం నుంచి ప్రోత్సాహం కరువైందని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్ వెలుపల ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తామరని.. నల్గొండ, రామగుండం, సిద్దిపేటలో ఐటీ హబ్స్ ఏర్పాటు చేస్తామని ఈ సమావేశం సందర్భంగా కేటీఆర్ చెప్పారని ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్ పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ అంశంపై జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న ఏడు నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థినులకు బ్రాండెడ్ శానిటరీ నేప్‌కిన్స్ ఉచితంగా అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ‘‘మహిళా దినోత్సవం రోజున ఉచిత శానిటరీ నేప్‌కిన్స్ పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్ 15 నాటికి టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయాలి.
ఆ నెలాఖరు నాటికి ప్రతిష్ఠాత్మకమైన కంపెనీలతో సెర్ప్, మెప్మా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ ఏడాడి జూలై ఒకటో తేదీ నుంచి ప్రతి నెలా ఉచితంగా వాటిని అందజేస్తాం’’ అని సీఎం వివరించారు. కాగా, పోటీ పరీక్షలు రాసే విద్యార్థినులకు అత్యుత్తమ శిక్షణ అందించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీనికోసం ల్యాప్‌టా్‌పలు వాడుకోవాలని సూచించినట్లు ఈ వార్తలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా కాలంలో సుమారు రూ.13 లక్షల కోట్లు పడిపోయిన కుటుంబాల ఆదాయం
కరోనా సంక్షోభం, ఉద్యోగాలు కోల్పోవడం వల్ల దేశంలో కుటుంబాల ఆదాయం భారీగా పడిపోయిందని, కరోనా ప్రారంభం నుంచి దాదాపుగా రూ.13 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని యుబిఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఓ రిపోర్ట్‌లో తెలిపినట్లు ప్రజాశక్తి ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ పరిస్థితి 2021 మధ్య కాలం వరకు కొనసాగవచ్చని.. దీంతో వినిమయ డిమాండ్‌లో తగ్గుదల ఉండొచ్చని విశ్లేషించింది. గత కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ రికవరీలో ఉన్నప్పటికీ వినిమయంలో స్తబ్దత కొనసాగనుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు, మూడు త్రైమాసికాల్లో వృద్ధి సానుకూలంగా నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని యుబిఎస్ సెక్యూరిటీస్ ఇండియా నిపుణులు తాన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. 2021 మధ్యస్థ కాలం వరకూ ఆర్థిక వ్యవస్థ స్తబ్దతగానే ఉండొచ్చన్నారు. కరోనా కాలంలో ప్రజలు రూ.13 లక్షల కోట్ల ఆదాయం కోల్పోవడంతో ఆ ప్రభావం రానున్న కొన్ని నెలలపై కూడా పడనుందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో జిడిపి ఏకంగా 24 శాతం మేర క్షీణించింది. ఆ తర్వాతి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.5 శాతం మేర పడిపోయింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో మాత్రం స్వల్పంగా పెరిగింది. వరుస త్రైమాసికాలుగా పుంజుకుంటున్నప్పటికీ భవిష్యత్తు వృద్థి మాత్రం నూతన పెట్టుబడులు, విత్త సంస్థలపై ఒత్తిడి తగ్గడంపై ఆధారపడి ఉందని ఈ రిపోర్ట్ పేర్కొంది.
''కరోనాకు ముందు స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. మార్చి త్రైమాసికంలో కూడా సానుకూల వృద్థి చోటు చేసుకోనుంది. అయితే వృద్థి రేటు ఏ స్థాయిలో కొనసాగుతుందో లేదో వేచి చూడాలి'' అని పేర్కొంది. దేశంలో గృహ రుణాలపై తగ్గిన వడ్డీ రేట్లు రియాల్టీ రంగానికి మద్దతును ఇవ్వొచ్చని తెలిపింది. 2020లో గృహ అమ్మకాల్లో 31 శాతం తగ్గుదల చోటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసిందని ఈ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 వ్యాక్సీన్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రావడం సాధ్యమేనా?
- కశ్మీర్ ప్యాడ్ ఉమన్: శానిటరీ ప్యాడ్ కొనడానికే సిగ్గుపడిన ఆ మహిళ ఇప్పుడు వాటిని అందరికీ పంచుతున్నారు?
- శోభనం రాత్రి కోసం తెప్పించే స్పెషల్ స్వీట్’
- ఆంధ్రప్రదేశ్: ‘ప్రచారానికి వెళ్తే పేరంటానికా అని ఎగతాళి చేశారు... మగవాళ్లందరినీ ఓడించాం’
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- బంగ్లాదేశ్ నుంచి వచ్చి నిజామాబాద్‌లో దొంగ పాస్‌పోర్టులు తీస్తున్నారు... ఏంటీ దందా?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























