మహిళా దినోత్సవం రోజున మొబైల్ కొనే మహిళలకు 10 శాతం రాయితీ : ప్రెస్ రివ్యూ

ఏపీ సీఎం ప్రకటన

ఫొటో సోర్స్, FB/Andhra Pradesh CM

ప్రచురణ

మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళల కోసం ఏపీ సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సాక్షి కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో మహిళల సంక్షేమం, భద్రత దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ పనుల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తూ ఇప్పటికే విప్లవాత్మక చట్టం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి భద్రత, సంక్షేమం, పురోభివృద్ధికి సంబంధించి గురువారం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తన క్యాంపు కార్యాలయంలో హోం, మహిళా సంక్షేమం, విద్య, వైద్యం, పంచాయతీరాజ్, మెప్మా తదితర శాఖల అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా ముందు రోజు.. ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్‌ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

మహిళా ఉద్యోగులకు అదనంగా ఐదు క్యాజువల్‌ లీవ్స్‌ ఇవ్వాలని, దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్‌ కోడ్‌తో 2,000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

దిశ యాప్‌ కోసం ఎంపిక చేసిన షాపింగ్‌ సెంటర్లలో ఆ రోజు (8వ తేదీ) మొబైల్‌ ఫోన్ల కొనుగోలుపై మహిళలకు 10 శాతం రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

మహిళా భద్రత, సాధికారతపై షార్ట్‌ ఫిల్మ్‌ పోటీలు నిర్వహించాలని, ప్రతి వింగ్‌ నుంచి ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు సత్కారం చేయాలని నిర్ణయించారు.

పోలీసు శాఖలో పని చేస్తున్న మహిళలందరికీ ఆ రోజు స్పెషల్‌ డే ఆఫ్‌గా ప్రకటించనున్నట్లు సాక్షి వివరించింది.

పెట్రోలు

ఫొటో సోర్స్, Getty Images

ఇలా చేస్తే లీటర్‌ పెట్రోలు ధర రూ.75- ఆర్థిక వేత్తలు

పెట్రోల్‌పై జీఎస్టీ వసూలు చేస్తే ధర రూ.75 రూపాయలకు తగ్గించవచ్చని దేశంలోని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

పెట్రోలు, డీజిల్‌లపై ప్రస్తుతం వేస్తున్న పన్నులకు బదులుగా జీఎస్టీ వసూలు చేస్తే వాటి ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

వీటిపై ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా పన్నులు వేస్తున్నాయి. వీటిని రద్దు చేసి జీఎస్టీ వసూలు చేస్తే దేశవ్యాప్తంగా పెట్రోలు ధర లీటరుకు రూ.75, డీజిల్‌ ధర రూ.68గా ఉండే అవకాశముందని భారతీయ స్టేట్‌బ్యాంకుకు చెందిన ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

అయితే దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.లక్ష కోట్ల మేర ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని లెక్క కట్టారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 60 డాలర్లుగా, కరెన్సీ మారకం విలువ ఒక డాలరుకు రూ.73గా ఉంటుందని భావించి ఈ లెక్క వేశారని ఈనాడు చెప్పింది.

రవాణా ఛార్జీలు.. లీటరు డీజిల్‌కు రూ.7.25, పెట్రోలుకు రూ.3.82; డీలర్‌ కమీషన్‌...లీటర్‌ డీజిల్‌కు రూ.2.53, పెట్రోలుకు రూ.3.67; సెస్సు.. డీజిల్‌కు రూ.20, పెట్రోలుకు రూ.30గా ఉంటుందని లెక్కించారు.

ఇవి కాకుండా 28% జీఎస్టీని విధించి గణించారు. అలాంటప్పుడు పెట్రోలు ధర లీటరుకు రూ.75గా ఉండే అవకాశం ఉంది.

ముడిచమురు ధర బ్యారెల్‌కు ఒక డాలరు పెరిగితే దాని ప్రభావంగా డీజిల్‌ ధర లీటరుకు 50 పైసలు, పెట్రోలు ధర రూ.1.50గా పెరుగుతుందని అంచనా వేశారని ఈనాడు వివరించింది.

హైదరాబాద్

ఫొటో సోర్స్, Getty Images

ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆఫ్ లివింగ్‌లో హైదరాబాద్‌కు 24వ ర్యాంక్

కేంద్రం ఇచ్చిన ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకుల్లో హైదరాబాద్‌కు 24వ ర్యాంకు వచ్చినట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక వార్త ప్రచురించింది.

అత్యుత్తమ జీవన పమ్రాణాలతో హాయిగా జీవించేందుకు అనువైన నివాసయోగ్య నగరాల జాబితాలో, మునిసిపల్‌ పనితీరు సూచీలో.. హైదరాబాద్‌ సహా తెలంగాణ నగరాలన్నీ వెనుకబడ్డాయి.

కేంద్రం తాజాగా విడుదల చేసిన ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీ-2020లో కేవలం 55.4 స్కోర్‌తో హైదరాబాద్‌ 24 స్థానంలో నిలిచింది. మునిసిపల్‌ పనితీరులో 49.08 స్కోరుతో 17వ ర్యాంకు పొందింది.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, ఆ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్‌ మిశ్రా గురువారం ఈ సూచీలను విడుదల చేశారు.

ఈజ్‌ఆప్‌ లివింగ్‌ సూచీలో 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా.. పుణె ఈసారి రెండో స్థానానికి పడిపోయంది. మూడో స్థానంలో అహ్మదాబాద్‌ నిలవగా.. చెన్నై, సూరత్‌ వరుసగా 4, 5 స్థానాల్లో నిలిచాయని పత్రిక రాసింది.

ఇక పది లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీలో సిమ్లా అగ్రస్థానంలో నిలవగా.. భువనేశ్వర్‌కు రెండో ర్యాంకు లభించింది.

ఏపీలోని కాకినాడ నాలుగో స్థానంలో నిలిచింది. జీవన నాణ్యత, నగరాల ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత, పౌరుల అభిప్రాయం.. ఈ నాలుగు ప్రమాణాల ఆధారంగా ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీని రూపొందించారని ఆంధ్రజ్యోతి వివరించింది.

కేటీఆర్

ఫొటో సోర్స్, FB/Kalvakuntla Taraka Rama Rao - KTR

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై నిలదీస్తాం-కేటీఆర్

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని పోరాడి సాధించుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నట్లు నమస్తే తెలంగాణ పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం తెలంగాణకు మరోసారి ధోకా ఇచ్చింది. ఇప్పటికే ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం.. తాజాగా కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టే యోచన లేదని ప్రకటించింది.

రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన పరిశ్రమ విషయంలో చేతులెత్తేసింది. పార్లమెంట్‌ సాక్షిగా పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది.

కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పనులను ఎప్పుడు ప్రారంభించనున్నారంటూ సమాచార హక్కు చట్టం కింద సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్‌ అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ సమాధానమిచ్చిందన పత్రిక వివరించింది.

దేశంలో ఎక్కడా ప్రస్తుతానికి గానీ లేదా భవిష్యత్తులోగానీ రైల్వేశాఖకు కోచ్‌ ఫ్యాక్టరీల అవసరమే లేదని పేర్కొంది..

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న కోచ్‌ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని పెంచి కోచ్‌లు తయారు చేస్తున్నామని, అందువల్ల కాజీపేటలో కొత్త కోచ్‌ ఫ్యాక్టరీకి అవకాశం లేదని స్పష్టం చేసింది.

కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్రం చెప్పడంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని పత్రిక చెప్పింది.

తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన వాటిని కూడా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.

ఈ నిర్ణయంతో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల తన వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకున్నదని విమర్శించారు.

పార్లమెంట్‌ సాక్షిగా తెలంగాణకు ఇచ్చిన హామీని తిరస్కరించే లేదా మాట మార్చే హక్కు బీజేపీకి లేదని స్పష్టంచేశారు. తమ హక్కుల కోసం పోరాడి సాధించుకుంటామని తేల్చి చెప్పారని నమస్తే తెలంగాణ రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)