కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో 20 కోట్లు దండుకున్న ముఠా: ప్రెస్ రివ్యూ

ప్రచురణ

నిరుద్యోగులను మోసం చేసిన ఒక ముఠా, ఉద్యోగాలిప్పిస్తామంటూ వారి నుంచి 20 కోట్లు వసూలు చేసిందని సాక్షి కథనం ప్రచురించింది.

ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు వచ్చినట్లు ఆర్డర్‌ కాపీలు చేతిలో పెట్టి.. కోల్‌కతా తీసుకెళ్లి ఫేక్‌ శిక్షణ ఇచ్చి.. నిరుద్యోగులను మోసం చేసింది ఆ ముఠా.

తమిళనాడు కేంద్రంగా ఉన్న ఈ ముఠా చేతిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలువురు నిరుద్యోగులు మోసపోయారని సాక్షి రాసింది.

ముఠా నాయకుడు 27 ఏళ్ల దేవప్రియన్, సభ్యుడు 50 ఏళ్ల హరిహరకుమార్‌ను చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేయడంతో వీరి బండారం బయటపడింది.

ఆ వివరాలను డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నరసింహరాజు, యుగంధర్, ఎస్‌ఐ విక్రమ్‌ వెల్లడించారుని సాక్షి తెలిపింది.

తమిళనాడులోని విల్లుపురానికి చెందిన దేవప్రియన్‌ చెన్నై ఎయిర్‌పోర్టులో పనిచేసేవాడు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ కేంద్ర మంత్రికి సన్నిహితంగా ఉన్న వ్యక్తితో పరిచయం పెంచుకుని ఎయిర్‌పోర్టులో ఉద్యోగం మానేశాడు.

ఢిల్లీ వెళ్లి అక్కడ మంత్రి పేషీలో మరికొందరితో పరిచయాలు పెంచుకున్నాడు. తర్వాత మోసాలు మొదలు పెట్టాడు.

పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చెన్నైలకు చెందిన పలువురిని తన ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. రైల్వే, ఐటీ తదితర శాఖల్లో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వసూలు చేశాడు.

ఫేక్‌ ఆర్డర్‌ కాపీలు నిరుద్యోగుల చేతిలో పెట్టి నిజంగానే ఉద్యోగాలు వచ్చినట్లు భ్రమ కల్పించేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే డబ్బు వెనక్కి ఇచ్చేవాడు.

వసూలు చేసిన డబ్బుతో పాండిచ్చేరి, చెన్నై ప్రాంతాల్లో విలాసవంతమైన విల్లాలు, పంట పొలాలు కొనుగోలు చేశాడు. ఇతని మోసం ఖాతాలో చెన్నైకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు గుర్తించారని పత్రిక రాసింది.

చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురానికి చెందిన ఓ వ్యక్తి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని నమ్మి దేవప్రియన్‌కు 20 రోజుల క్రితం రూ. 26 లక్షలు ముట్టచెప్పాడు.

అయితేఅతని కదలికలపై అనుమానం రావడంతో తన నగదు ఇచ్చేయాలని డిమాండ్‌ చేశాడు. అతను చెల్లని చెక్కు ఇవ్వడంతో బాధితుడు చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది.

కాగా, ఈ లింకులో దొరకాల్సిన కేటుగాళ్లు చాలామంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారని సాక్షి వివరించింది.నిరుద్యోగులను మోసం చేసిన ఒక ముఠా, వారి నుంచి 20 కోట్లు వసూలు చేసిందని సాక్షి కథనం ప్రచురించింది.

ఇంట్లో తెలిసిపోతుందనే విద్యార్థిని కథ అల్లింది

ఇంట్లో వాళ్లకు భయపడే విజయనగరం జిల్లాలో విద్యార్థిని కిడ్నాప్ అయినట్లు చెప్పిందని ఈనాడు దిన పత్రిక ఒక కథనం ప్రచురించింది.

విజయనగరం జిల్లాలో గుర్ల వద్ద ఓ డిగ్రీ విద్యార్థిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేసినట్లుగా నమోదైన కేసులో మిస్టరీ వీడింది.

తన కుటుంబసభ్యులను నమ్మించేందుకు ఆ విద్యార్థిని 'కట్టు'కథ అల్లినట్లు పోలీసుల విచారణలో తేలింది.

స్నేహితులతో బయటకు వెళ్లినట్లు ఇంట్లో తెలిసిపోతుందని విద్యార్థిని ఆవిధంగా నాటకమాడింది.

కుటుంబసభ్యులను నమ్మించేందుకు తానే కాళ్లు, చేతులు కట్టుకున్నట్లు ఆమె పోలీసుల విచారణలో అంగీకరించింది.

ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజకుమారి ఓ ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారని ఈనాడు రాసింది.

''డిగ్రీ విద్యార్థిని ఫిబ్రవరి 27న బాబాయ్‌ దగ్గరకు వెళ్తానని చెప్పి హాస్టల్‌లో పర్మిషన్‌‌ తీసుకుని తనకు తెలిసిన స్నేహితుడిని కలిసేందుకు బయటకు వెళ్లింది. అదే సమయంలో ఆమె సోదరుడు తన గురించి హాస్టల్‌లో వాకబు చేసినట్లు తెలుసుకుంది. స్నేహితుడిని కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో పాలకొల్లు నుంచి పాలకొండ వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు ఎక్కింది. గుర్ల దాటిన తర్వాత బస్సు దిగిన యువతి.. రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లోకి వెళ్లి తనకు తానే కాళ్లు, చేతులను చున్నీతో కట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా నటించినట్లు అంగీకరించింది'' అని ఎస్పీ రాజకుమారి తెలిపారని ఈనాడు వివరించింది.

నేడు యాదాద్రికి కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిని నేడు పరిశీలిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ గురువారం సందర్శించనున్నారు.

యాదాద్రి కొండపై ఆలయ ప్రధాన ఆలయంతో పాటు పరిసరాల అభివృద్ధి పనులు తుది దశకు చేరి ఉద్ఘాటనకు సిద్ధమవుతున్న తరుణంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

కొండపై బాలాలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రధానాలయం, కొండపై పరిసరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతిని పరిశీలిస్తారు.

3 నెలల్లో ప్రధానాలయ ఉద్ఘాటన చేసి, స్వామి గర్భాలయ దర్శనాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని పత్రిక రాసింది.

జీయర్‌స్వామి సూచించిన ఆగమ, వైదిక నియమానుసారం గర్భాలయం, ముఖ మండపం, ఉప ఆలయాలు, క్యూకాంప్లెక్స్‌లు, ఇతర పనులను సీఎం స్వయంగా పరిశీలిస్తారు.

ప్రాకార మండపాలు, మాఢవీధులు, తిరువీధుల్లో నక్షత్ర మొక్కలు, సుగంధ పుష్పాల ఉద్యానవన అభివృద్ధి క్యూకాంప్లెక్స్‌, ప్రసాదాల కాంప్లెక్స్‌, శివాలయం, విష్ణు పుష్కరిణిని కేసీఆర్‌ అణువణువునా పరిశీలించనున్నారు.

అలాగే కొండచుట్టూ రింగు రోడ్డు నిర్మాణ పనులు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ నిర్మాణం, గండిచెరువు వద్ద పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణాలను సీఎం పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని ఆంధ్రజ్యోతి వివరించింది.

కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ 81 శాతం విజయవంతం

భారత్ బయోటెక్ కోవగ్జిన్ టీకా మూడో దశ ట్రయల్స్ ఫలితాలను వెల్లడించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

భారత్‌ బయోటెక్‌ టీకా 'కొవాగ్జిన్‌' మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతమయ్యాయి. ఫలితాలను సంస్థ బుధవారం వెల్లడించింది.

18-98 మధ్య వయస్సు గల మొత్తం 25,800 మందిపై నిర్వహించిన ఈ ట్రయల్స్‌లో టీకా మధ్యంతర క్లినికల్‌ సామర్థ్యం 80.6 శాతంగా నమోదైనట్టు సంస్థ ప్రకటించింది. ఇంతమంది వలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడం దేశంలోనే ఇది తొలిసారి.

మూడో దశ ట్రయల్స్‌లో పాల్గొన్న మొత్తం వలంటీర్లలో 2,433 మంది 60 ఏండ్లు పైబడిన వారని, 4,500 మందికి ఇతర ఆరోగ్య సమస్యలున్నట్టు సంస్థ వెల్లడించింది.

మొదటి రెండు దశల క్లినికల్‌ ట్రయల్స్‌తో పోలిస్తే, మూడో దశలో టీకా ఫలితాలు బాగా మెరుగైనట్లు తెలిపింది. రెండో డోస్‌ ఇచ్చిన తర్వాత వలంటీర్లకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు సోకలేదని ప్రకటించింది.

'కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ చరిత్రలో ఇది చరిత్రాత్మకమైన రోజు. మూడో దశ ట్రయల్స్‌లో 'కొవాగ్జిన్‌' 80.6 శాతం సమర్థతను చూపించింది' అని భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌, ఎండీ కృష్ణ ఎల్ల తెలిపారని పత్రిక రాసింది.

బ్రిటన్‌లో కనుగొన్న కొత్త కరోనా స్ట్రెయిన్‌తో పాటు వేగంగా వృద్ధి చెందుతున్న ఇతర కరోనా ఉత్పరివర్తనాలకు వ్యతిరేకంగా తమ టీకా రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంపొందిస్తుందని పేర్కొన్నారు.

మరోవైపు, 'కొవిషీల్డ్‌' రెండు డోసుల సామర్థ్యం 70 శాతంగా ఉన్నదని సీరమ్‌ గతంలో పేర్కొంది.

మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా కొందరికి కొవాగ్జిన్‌ టీకాను ఇచ్చారు. మరికొందరికి కేవలం గ్లూకోజ్‌లాంటి ఇంజెక్షన్‌ను ఇచ్చి పరిశీలించారు.

టీకా ఇచ్చిన అందరిలో ప్రతిరక్షకాలు ఉత్పత్తయినట్లు గుర్తించారు. ఒకవైపు అత్యవసర వినియోగం కింద వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగానే.. టీకా సామర్థ్యాన్ని మరింత పెంచడానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ భారీ ఎత్తున మూడవ దశ ప్రయోగాలు జరిపిందని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)