స్నేక్ డాన్స్ ప్రాక్టీస్ చేసేందుకు కొండ చిలువను పెంచుకున్నాడు... : ప్రెస్ రివ్యూ

కొండచిలువ

ఫొటో సోర్స్, FB/Pallem Ajaybabu

ప్రచురణ

పశ్చిమగోదావరి జిల్లాలో డాన్స్ షో కోసం ఒక యువకుడు పెంచుకుంటున్న కొండచిలువను అటవీ శాఖ అధికారుల స్వాధీనం చేసుకున్నారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

డ్యాన్స్‌ షో కోసం ఓ యువకుడు ఏకంగా కొండచిలువను పెంచుకోవడం కలకలం రేపింది.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం లక్ష్మీనగర్‌లోని నాగిరెడ్డి అనే వ్యక్తి భగవాన్‌ కోబ్రా డ్యాన్స్‌ గ్రూపు నిర్వహిస్తుంటాడు.

నిజమైన పాముతో స్నేక్‌ డ్యాన్స్‌ చేసేందుకు, అతడు దీనిని తీసుకుని వచ్చి పెంచుతున్నాడని పత్రిక రాసింది.

పరిసరాల్లోని పిల్లలు ఆడుకుంటున్న సమయంలో బంతి భగవాన్‌ ఇంటి బాత్రూమ్‌లో పడింది. తెచ్చుకునేందుకు వెళ్లిన పిల్లలకు అక్కడ పాము కనిపించడంతో భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు.

వెంటనే స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అటవీశాఖ అధికారులతో వచ్చి కొండచిలువను స్వాధీనం చేసుకున్నారని కథనంలో తెలిపారు.

ఎనిమిది నెలల వయసు.. 11 అడుగుల పొడవు.. 45 కిలోల బరువున్న దీనిని నల్లజర్లలోని అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్టు పట్టణ ఎస్‌ఐ ఫజల్‌ రహ్మాన్‌ తెలిపారని ఆంధ్రజ్యోతి రాసింది.

మోసగించిన మహిళ

ఫొటో సోర్స్, RachakondaPoliceCommissionerate/FB

మ్యాట్రిమోనీ సైట్లలో నకిలీ ఫోటోలతో గొంతు మార్చి ఎన్ఆర్ఐలకు వల...

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో నకిలీ ప్రొఫైళ్లు పెట్టి, గొంతులు మార్చి ఎన్ఆర్ఐలను మోసం చేసిన ఒక మహిళను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

పురుషుడిగా, మహిళగా, అమ్మాయిగా.. ఎలా కావాలంటే అలా అప్పటికప్పుడు గొంతు మార్చేసి మాట్లాడుతుంది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి నిమిషాల్లో ఖాతాలు ఖాళీ చేసేస్తుంది.

స్వాతి.. అర్చన.. జూటూరి వరప్రసాద్‌.. జూటూరి ఇందిరా ప్రియదర్శిని.. పుష్యతి... ఇలా రకరకాల పేర్లతో ఎంతోమంది ఎన్‌ఆర్‌ఐలకు టోపీ పెట్టిన మాయ'లేడీ'ని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు కటకటాల్లోకి పంపించారు.

నెల్లూరు జిల్లా కోవూరు మండలం రంగనాయకులపేటకు చెందిన స్వాతి (30) ఎస్వీ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసింది.

అధ్యాపకుడిగా పనిచేసే కోరం దుర్గాప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఘట్‌కేసర్‌ పోచారంలో నివాసముంటోంది. విలాసవంతమైన జీవితానికి అలవాటై మోసాలు చేయడం ప్రారంభించింది.

పెళ్లి చేసుకుంటానంటూ ఆమె నిండా ముంచేసిందని పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారని ఈనాడు రాసింది.

గత ఏడాది బెయిల్‌పై విడుదలైనా ఆమె తీరు మార్చుకోలేదు. స్థానికులైతే పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే ఉద్దేశంతో ఈసారి ఎన్‌ఆర్‌ఐలను లక్ష్యంగా చేసుకుంది.

గుర్తు తెలియని మహిళల ఫొటోలను గూగుల్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసి నకిలీ ప్రొఫైల్స్‌ను అన్ని మ్యాట్రీమోనీ వెబ్‌సైట్లలో అప్‌లోడ్‌ చేసింది. విదేశాల్లో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని, పెళ్లి తర్వాత కూడా అక్కడే ఉంటానని, ఎన్‌ఆర్‌ఐలు మాత్రమే సంప్రందించాలని ప్రొఫైల్‌లో పేర్కొంది.

నేరుగా పెళ్లి కొడుకులు ఫోన్‌ చేస్తే అంతగా ఆసక్తి చూపించేది కాదు. మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి, వాళ్లు ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుందని ఆమె షరతు విధించేదని కథనంలో రాశారు.

దీంతో పెళ్లి కొడుకులు తమ తల్లిదండ్రులతో మాట్లాడించేవారు. ఒక (అడ్‌కామ్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆమె వాళ్లతో అమ్మాయి తండ్రి/తల్లి/సోదరి/సోదరుడిగా గొంతు మార్చి మాట్లాడేది. పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు, కట్నం, కల్యాణ మండపం, ముహుర్తాలు తదితర అంశాలపై 'పెళ్లి పెద్దలు'గా చర్చించేది.

అమ్మాయి సెలవులపై రెండు, మూడ్రోజుల కిందటే భారత్‌కు వచ్చిందని, కావాలంటే నేరుగా కలిసి మాట్లాడొచ్చని చెప్పేది. తరువాత చాలా మందికి ఇక్కడి ఫోన్‌ నంబర్‌ ఇచ్చింది. ఆ నంబర్‌కు పెళ్లి కొడుకుల తల్లిదండ్రులు ఫోన్‌ చేయగానే నాకిష్టమే అని అంగీకారం తెలిపేది. కాకపోతే పెళ్లికి ముందే కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరేదని పత్రిక రాసింది.

కాబోయే కోడలే కదా అనే ఉద్దేశంతో చాలా మంది డబ్బులిచ్చారు. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేగానే ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తూ వచ్చింది. ఈ తరహాలోనే పలువురు ఎన్‌ఆర్‌ఐలకు టోపీ పెట్టింది. ఇటీవల ఫిర్యాదు రావడంతో రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక ఆధారాల సాయంతో ఆమె ఆటకట్టించారు.

ఘట్‌కేసర్‌లో అదుపులోకి తీసుకుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. మరిన్ని వివరాలు సేకరించడంపై పోలీసులు దృష్టి సారించారని ఈనాడు వివరించింది.

ధరల్లో ఎంత తేడా వస్తుంది

ఫొటో సోర్స్, Getty Images

చెకిన్ లగేజీ తక్కువుంటే, టికెట్ ధర తగ్గుతుంది

చెకిన్ లగేజీ తక్కువగా ఉంటే విమానం టికెట్ ధరలో రాయితీ ఇస్తామని పౌర విమానయాన శాఖ చెప్పినట్లు సాక్షి కథనం ప్రచురించింది.

మీకు ఎక్కువగా లగేజీ లేదా ? చిన్న బ్యాగుతోనే విమానంలో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే మీ టిక్కెట్‌ ధర మరింత చౌకగా లభించనుంది.

కేవలం కేబిన్‌ లగేజీ మాత్రమే ఉన్నవారికి దేశీయ విమానాల్లోని టిక్కెట్‌ ధరల్లో డిస్కౌంట్‌ ఇవ్వడానికి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసిందని పత్రిక చెప్పింది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం విమాన ప్రయాణికులు కేబిన్‌ లగేజీ కింద 7 కేజీలు, చెక్‌ ఇన్‌ లగేజీ కింద 15 కేజీలు తీసుకువెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ బరువున్న సామాన్లు తీసుకువెళితే అదనపు చార్జీలు ఉంటాయి.

అయితే ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులు టిక్కెట్‌ బుకింగ్‌ సమయంలోనే తాము ఎంత బరువైన లగేజీ తీసుకువెళతారో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడే తక్కువ లగేజీ ఉన్నవారికి టిక్కెట్‌ డిస్కౌంట్‌ ధరకి వస్తుందని తెలిపింది.

విమానయాన సంస్థలను నష్టాల నుంచి బయటపడేయడానికి కేంద్రం విమాన చార్జీలను 10-30శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. ప్రయాణికులకు కూడా ఊరట కల్పించడానికి ఈ విధానాన్ని తీసుకువచ్చిందని సాక్షి వివరించింది.

తెలంగాణ సచివాలయం, సెక్రటేరియట్
ఫొటో క్యాప్షన్, కొత్త సచివాలయం డిజైన్

అపూర్వంగా సచివాలయ నిర్మాణం

తెలంగాణ నూతన సచివాలయం డిసెంబర్ నాటికి పూర్తవుతుందని నమస్తే తెలంగాణ దినపత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణ నూతన సచివాలయం సర్వ హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నది. ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణం పూర్తిచేసి నూతన సచివాలయ భవనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఇంజినీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

దాదాపు 50 మంది ఇంజినీర్లు, 10 మంది ఆర్కిటెక్టులు, రెండువేల మంది కార్మికులు మూడు షిఫ్టులలో 24 గంటలూ పనిచేస్తున్నారు.

ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారులు వివిధ ప్రాంతాలకు నేరుగా సచివాలయం నుంచే హెలికాప్టర్‌లో వెళ్లడానికి వీలుగా ఈశాన్యం వైపున హెలిప్యాడ్‌ను నిర్మిస్తున్నారు.

ఈ ఏడంతస్తుల మేడను దక్కనీ నిర్మాణ శైలి, సంస్కృతిలో ఉంటుంది. ఈ భవనం అనేక ప్రత్యేకతలతో నిర్మాణమవుతున్నది.

ఈ భవనానికి ప్రధాన ద్వారం వద్ద ఉపరితలం నుంచి డోమ్‌ వరకు 11 అంతస్తులు ఉంటుంది. దీనిపైన రెండు అంతస్తుల స్కైలాండ్‌, ఆపై మరో రెండు అంతస్తుల డోమ్‌ ఫ్లోర్‌ నిర్మించనున్నారని నమస్తే తెలంగాణ చెప్పింది.

దీనిపై ఒక్క అంతస్తు ఎత్తులో ఆశోకచక్రం వస్తుంది. ఇక్కడ మొత్తం ఎత్తు 278 అడుగులు ఉంటుందని అంచనా. మొత్తం సచివాలయానికి 18 డోమ్‌లు వస్తాయి.

మధ్యలో విశాలమైన పచ్చికబయలు దాని చుట్టూ భవనం నిర్మాణం అవుతుంది. లాన్‌ మధ్యలో వాటర్‌ ఫౌంటెయిన్‌ ఏర్పాటు చేస్తారు.

భవన సముదాయం ఏడంతస్తులు నిర్మించనున్నారు. ఈ మొత్తం ఎత్తు 119 అడుగులు కాగా, ఒక్కో అంతస్తు 14 ఫీట్లు ఉండేలా డిజైన్‌చేశారు.

ఒక్కో అంతస్తులో మూడు మంత్రిత్వ శాఖలుఒక్కో అంతస్తులో మూడు మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఒక్కో మంత్రిత్వశాఖకు 8,640 చదరపుటడుగులు స్థలాన్ని కేటాయిస్తున్నారు.

ఇందులోనే ప్రతి మంత్రిత్వశాఖకు ఒక మీటింగ్‌ హాల్‌ ఉంటుంది. ప్రతి అంతస్తులో ఉద్యోగులు లంచ్‌ చేయడానికి ఒక డైనింగ్‌ రూమ్‌ నిర్మిస్తున్నారని పత్రిక చెప్పింది.

సచివాలయం ఒక పర్యాటక ప్రదేశాన్ని తలపించనుంది. సచివాలయం ముందు భాగంలో అతిపెద్ద పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటి మధ్యలో రెండు ఫౌంటెన్లు నిర్మించనున్నారు.

సచివాలయం ముందు 67 ఫీట్ల రోడ్డు ఉంది. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద ముఖ్యమంత్రి వచ్చేందుకు ప్రత్యేక మార్గం ఉంటుందని నమస్తే తెలంగాణ వివరించింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)