పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఎనిమిది దశల్లో.. మార్చి 27న మొదటి విడత పోలింగ్.. తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరీలకూ షెడ్యూల్ విడుదల

ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎనిమిది దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిపింది.

మొదటి దశ పోలింగ్ మార్చి 27న, రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 1న, మూడో దశ ఏప్రిల్ 6, నాలుగో దశ ఏప్రిల్ 10న జరుగుతాయి.

అయిదో దశ పోలింగ్ ఏప్రిల్ 17న ఉంటుంది. ఆరో దశ ఏప్రిల్ 22, ఏడో దశ ఏప్రిల్ 26, చివరిదైన ఎనిమిదో దశ పోలింగ్ ఏప్రిల్ 29న ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు.

తమిళనాడు:

తమిళనాడులో ఒకే విడతలలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఏప్రిల్ 6న అక్కడ పోలింగ్ ఉంటుంది.

కేరళ:

కేరళ రాష్ట్రంలోనూ ఒకే దశలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. అక్కడ పోలింగ్ ఏప్రిల్ 6న ఉంటుంది.

అస్సాం:

అస్సాంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. మార్చి 27న మొదటి దశ, ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ ఉంటుంది.

పుదుచ్చేరి:

పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తారు. అక్కడ పోలింగ్ తేదీ ఏప్రిల్ 6.

పశ్చిమబెంగాల్‌లో 294 అసెంబ్లీ సీట్లున్నాయి. ఆ అసెంబ్లీ గడువు మే 30తో ముగుస్తోంది.

అస్సాం అసెంబ్లీలో 126 సీట్లుండగా అక్కడి ప్రస్తుత సభకు మే 31తో గడువు పూర్తవుతోంది.

తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లున్నాయి.. మే 24తో అక్కడి ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగుస్తోంది.

కేరళలో 140 సీట్లుండగా జూన్ 1 వరకు సభకు గడువు ఉంది. పుదుచ్చేరీలో 30 సీట్లు ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో నామినేషన్లు

కరోనావైరస్ కారణంగా ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రకటించారు.

పశ్చిమబెంగాల్‌లో లక్షకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. తమిళనాడులో 89 వేలు, కేరళలో 40 వేలు, అస్సాంలో 33 వేలు, పుదుచ్చేరిలో 1500 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఈసీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)