అమ్మ స్తనంపై పాము కాటు.. బిడ్డకు పాలిస్తుండగా ఘటన, మృతి - ప్రెస్ రివ్యూ

పాము

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

చిన్నారికి పాలిస్తుండగా రొమ్ముపై పాము కాటేడయంతో ఓ తల్లి మరణించినట్లు ఈనాడు పత్రిక కథనం ఇచ్చింది.

‘‘మహారాష్ట్ర చంద్రాపూర్‌ మండలం సోనాపూర్‌ నుంచి కొందరు కూలీలు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలంలోని ఊటుకూరు వచ్చారు. మిరప కోతలకు వెళుతూ గ్రామంలోని బీసీ కాలనీ పాఠశాల దగ్గర గుడారంలో ఉంటున్నారు.

మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతుండగా, పాప ఆకలితో ఏడ్చింది. దీంతో తల్లి శృతి ప్రమోద్‌ భోయర్‌ (21)కు బిడ్డకు తన పాలిచ్చారు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ పాము ఆమె రొమ్ముపై కాటేసింది. పాము బిడ్డను కూడా కాటేస్తుందేమో అనే భయంతో ఆమె దాన్ని చేతితో పట్టుకుని విసిరేశారు. దీంతో కొద్ది దూరంలో నిద్రిస్తున్న రూపేష్‌ ప్రకాష్‌ చప్డే అనే యువకుడిపై పడిన పాము అతడిని కూడా కాటేసింది.

వారిని వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. శృతి చనిపోయారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. శృతి మృతదేహానికి పరీక్ష పూర్తయ్యాక బంధువులు స్వస్థలానికి తీసుకెళ్తార’’ని ఈనాడు కథనం వెల్లడించింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

విద్యార్థిని హత్య-అట్టుడికిన నరసరావుపేట

ఓ డిగ్రీ విద్యార్థినిని సహవిద్యార్థి హత్య చేసిన ఘటనతో గుంటూరు జిల్లా నరసరావు పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని సాక్షి పత్రిక కథనం ప్రచురించింది.

‘‘గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన అనూష నరసరావుపేటలోని ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. బొల్లాపల్లి మండలం పమిడిపాడు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా అదే కాలేజీలో చదువుతున్నాడు.

అనూష, విష్ణు కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా యువతి మరో యువకుడితో చనువుగా ఉంటోందని విష్ణు యువతిని అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే అనూషను మాట్లాడుకుందాం అని పిలిచి ఆమెతో గొడవకు దిగాడు.

తీవ్ర ఆగ్రహానికి లోనైన విష్ణువర్ధన్ పాలపాడు రోడ్డు గోవిందపురం మేజర్ కాలువ దగ్గర అనూషను గొంతు నులిమి హత్య చేసి కాలువలోకి పడేశాడు. అనంతరం నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

ప్రేమ వ్యవహారంతోనే తమ కుమార్తెను విష్ణువర్ణన్‌ రెడ్డి దారుణంగా హత్య చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారని, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తి వివరాలు తెలియజేయాల్సి ఉంద’’ని సాక్షి కథనం తెలిపింది.

మరోవైపు విద్యార్ధిని హత్యకు నిరసనగా సహవిద్యార్ధులు ఆందోళనకు దిగడంతో నరసరావుపేటలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. స్థానికులు, కుటుంబసభ్యులు, తోటి విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. మృతదేహంతో పల్నాడు బస్టాండ్ వద్ద బైఠాయించారు.

కాలేజీపైనా రాళ్లు రువ్వడంతోపాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. రోడ్డుపై విద్యార్ధి సంఘాల నేతలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించినట్లు సాక్షి కథనం పేర్కొంది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, digilocker

రవాణా శాఖ ఆఫీసుకు వెళ్లకుండానే లైసెన్స్‌ సర్వీసులు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ నవీకరణ, చిరునామా మార్పు, లెర్నర్‌ లైసెన్స్‌లో వాహన స్థాయి మార్పులులాంటి 17 రకాల సేవల కోసం తెలంగాణలో రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవచ్చంటూ ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ఈ సర్వీసులను ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా పొందే విధంగా ఆన్‌లైన్‌ విధానం తీసుకొస్తున్నట్లు ఈ కథనం పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మొత్తం 59 రకాల సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తోంది.

గతంలో ఆన్‌లైన్‌ ద్వారా టైమ్‌ స్లాట్ తీసుకుని..ఆయా రవాణా శాఖ కార్యాలయాలకు నిర్ధారిత సమయాల్లో హాజరు కావాల్సి ఉండేది. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందులకు గురయ్యేవారు.

ఈ నేపథ్యంలో 17 రకాల సేవల కోసం కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి నుంచైనా - ఏ సమయంలోనైనా (ఎనీ వేర్‌- ఎనీ టైమ్‌) పథకం కింద ఆన్‌లైన్‌ ద్వారానే పత్రాలు పొందేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టింది.

ఇందుకు అవసరమైన అన్ని రకాల ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా ధృవపత్రాలను అప్‌లోడ్‌ చేసి నిర్ధారిత ఫీజులను చెల్లిస్తే సరిపోతుందని రవాణా శాఖ తెలిపినట్లు ఈ కథనం పేర్కొంది.

ఈ పత్రాలు అన్నీ అన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తుదారులకు ఆయా ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా పంపుతారు. మరిన్ని సేవలను ఎక్కడ నుంచైనా - ఏ సమయంలోనైనా పథకం పరిధిలోకి తీసుకువచ్చేందుకు యోచిస్తున్నట్లు రవాణాశాఖ అధికారులు వెల్లడించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

ప్రతీకాత్మక చిత్రం
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి పేరు చెప్పి రూ. 11.5 కోట్లు కొట్టేశారు

ఒక మైనింగ్‌ వ్యాపారికి మాయమాటలు చెప్పి ఏకంగా రూ.11.50 కోట్లు దోచుకున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ఇచ్చింది.

‘‘హైదరాబాద్‌ నగర శివార్లలోని బాచుపల్లిలో కడప ప్రాంతానికి చెందిన మైనింగ్‌ వ్యాపారి పి.వీరారెడ్డి బాచుపల్లిలోని ఏపీఆర్‌ ప్రణవ్‌ అంటిల్లా విల్లాలో ఉంటున్నారు. పక్క విల్లాలో ఉంటున్న అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తి వీరారెడ్డితో పరిచయం పెంచుకున్నారు. తాను ఐపీఎ్‌సకు ఎంపికయ్యానని, తన భార్య శ్రుతి సిన్హా మానవ హక్కుల కమిషన్‌ దక్షిణ భారత విభాగానికి చైర్మన్‌ అని, తన తండ్రి రాఘవ రెడ్డి డీసీపీ అని.. తమకు 77 బస్సులున్నాయని, 32 ఎకరాల పొలం ఉందని వీరారెడ్డికి అబద్ధాలు చెప్పి నమ్మించారు.

వీరారెడ్డి తన తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నట్టు తెలుసుకుని.. తమకు తెలిసిన ప్రవల్లిక అనే అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉందని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన వీరారెడ్డి ఆమెతో మాట్లాడుతానని అడగ్గా.. శ్రుతిసిన్హాతో ఫోన్‌లో మాట్లాడించాడు. ఇలా విజయ్‌కుమార్‌ రెడ్డి, శ్రుతి సిన్హా 2017 నుంచి అతడిని రకరకాలుగా నమ్మిస్తూ దశలవారీగా రూ.11.50 కోట్లు తీసుకున్నారు.

విలాసవంతమైన జీవితానికి, జల్సాలకు అలవాటు పడిన వీరిద్దరూ డబ్బుల కోసం తప్పుడు దారి పట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం వీరారెడ్డిని మోసం చేసి ఖరీదైన కార్లు, బంగారం కొనుగోలు చేశారు. నగరశివార్లలోని ఓ రిసార్ట్‌లో ఏకంగా 40 రోజులు గడిపి నలభై లక్షలు చెల్లించారు.

విలాసాలపై శ్రుతి మోజు మరింతగా పెరగడం, వీరారెడ్డి నుంచి డబ్బు కోసం ఒత్తిడి పెరుగుతుండడంతో విజయ్‌కుమార్‌ రెడ్డి ఈ నెల 5న ఉరి వేసుకుని చనిపోయాడు. వీరారెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో ఈ మోసానికి సంబంధించిన తీగ దొరికింది.

అదే సమయంలో విజయ్‌కుమార్‌ రెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో తాను మోసపోయినట్టు తెలుసుకున్న వీరారెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలింది. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి.. శ్రుతి సిన్హాను, ఆమెకు సహకరించిన రాఘవరెడ్డి, రణధీర్‌రెడ్డి అలియాస్‌ రాణా, రామకృష్ణారెడ్డి అనే మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరంతా విజయ్‌కుమార్‌ రెడ్డి కుటుంబసభ్యులే.

నిందితుల నుంచి రూ. 50 లక్షల విలువ చేసే బంగారం, వెండి, ఏడు ఫోన్లు, మూడు బీఎండబ్ల్యూ కార్లు, రెండు ఫోర్డ్‌ కార్లు, రూ.రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నార’’ని ఆ కథనం పేర్కొంది.

రైళ్లలో భద్రతా చర్యలను పరిశీలిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా

ఫొటో సోర్స్, South Central Railway/twitter

ఫొటో క్యాప్షన్, రైళ్లలో భద్రతా చర్యలను పరిశీలిస్తున్న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా

తెలుగు రాష్ట్రాల్లో 22 ఎక్స్‌‌ప్రెస్‌ రైళ్ల పునరుద్ధరణ-అన్ని సీట్లకు రిజర్వేషన్‌

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రైళ్లను రద్దుచేసిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) అన్‌లాక్‌ తర్వాత దశలవారీగా పునరుద్ధరిస్తున్నదని, ఇప్పటికే 180 రైళ్లు నడుస్తుండగా, త్వరలో మరో 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా పునరుద్ధరించాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తున్నట్లు ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ఈ రైళ్లను ఏప్రిల్‌ 1 నుంచి మార్గాలవారీగా ప్రారంభించనున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రైళ్లను పునరుద్ధరిస్తున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించారు. మిగిలిన ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా దశలవారీగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

రైలు ప్రయాణికులకు స్టేషన్‌లో అప్పటికప్పుడు టికెట్‌ తీసుకొనే సౌకర్యం లేదు. కనీసం 4 గంటల ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకోవాలి. మూడు నెలల ముందు నుంచే రిజర్వేషన్‌కు అవకాశం ఉన్నది.

అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో బెర్తులు, ఏసీ టైర్లు, ఫస్ట్‌క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ సదుపాయాలతోపాటు సాధారణ టికెట్‌కు కూడా తప్పకుండా రిజర్వేషన్‌ చేయించుకోవాలి. జనరల్‌ టికెట్‌ కూడా రిజర్వేషన్‌ ఉండటంతో సాధారణ టికెట్‌ ధరపై రూ.15 అదనంగా చెల్లించాలి.

ప్రయాణికులంతా కరోనా నిబంధనలు పాటించడానికి రిజర్వేషన్‌ విధానాన్ని అమలుచేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ప్యాసింజర్‌ రైళ్ల రాకపోకలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)