బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్-2020: ముగిసిన ఓటింగ్... విజేతను ప్రకటించేది ఎప్పుడంటే

బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్-2020 పురస్కారం కోసం నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.
భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ఉన్న ప్రజలు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. పురస్కారం కోసం పోటీలో ఉన్న ఐదుగురు నామినీల్లో తమకు ఇష్టమైనవారికి ఓటు వేశారు. నామినీల జాబితాను బీబీసీ ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే.
షూటర్ మను భాకర్, స్ప్రింటర్ ద్యుతి చంద్, చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి, కుస్తీ క్రీడాకారిణి వినేశ్ ఫోగట్, భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి... ఈ పురస్కారానికి నామినీలు.
దేశంలోని ప్రముఖ స్పోర్ట్స్ రచయితలు, జర్నలిస్టులు, నిపుణులు, బీబీసీ ఎడిటర్లతో కూడిన జ్యూరీ వీరిని ఎంపిక చేసింది.
నామినీల్లో ప్రజల ఓట్లు ఎక్కువగా పొందినవారు ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ 2020’ పురస్కారం గెలుచుకుంటారు.
మార్చి 8న దిల్లీలో నిర్వహించే ఓ వర్చువల్ వేడుకలో విజేతను ప్రకటిస్తారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం కూడా ఇదే రోజు. బీబీసీ భారతీయ భాషల వెబ్‌సైట్లు, బీబీసీ స్పోర్ట్ వెబ్‌సైట్‌లోనూ విజేత ఎవరన్నది ప్రేక్షకులు చూడొచ్చు.
ఇదే వేడుకలో 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్', 'ఎమర్జింగ్ ప్లేయర్' అవార్డులను కూడా బీబీసీ ప్రదానం చేయనుంది.
గత ఏడాది బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గెలుచుకున్నారు. దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష లైఫ్ టైమ్ అచీవ్‌మెంటు అవార్డు పొందారు.
ఈ సారి బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కోసం పోటీలో ఉన్న ఐదుగురు క్రీడాకారిణులు వీళ్లే...
1. మను భాకర్
వయసు: 19 ఏళ్లు, క్రీడ: ఎయిర్‌గన్ షూటింగ్
మను భాకర్ 16 ఏళ్ల వయసులోనే.. 2018లో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ ప్రపంచ కప్‌లో మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణం సాధించారు. దీంతో అతి చిన్న వయసులోనే ప్రపంచ కప్‌లో స్వర్ణం సాధించిన భారత షూటర్‌గా రికార్డు సృష్టించారు. అదే ఏడాదిలో కామన్‌వెల్త్ గేమ్స్‌లో కూడా 240.9 పాయింట్లతో రికార్డ్ సృష్టించి.. మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించారు. 2019 ప్రపంచ కప్‌లో కూడా మహిళల 10మీ ఎయిర్ పిస్టల్ పోటీల్లో స్వర్ణం సాధించారు.
2. ద్యుతీ చంద్
వయసు 26 ఏళ్లు, క్రీడ: అథ్లెటిక్స్
మహిళల 100 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్ ప్రస్తుతం భారత జాతీయ ఛాంపియన్. నేపల్స్‌లో 2019లో జరిగిన వరల్డ్ యూనివర్సైడ్ 100 మీటర్ల ఈవెంట్‌లో ద్యుతీ చంద్ స్వర్ణం సాధించారు. 2020లో ఆమెకు అర్జున అవార్డ్ లభించింది. 2016లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో మహిళల 100 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు ఎంపికైన భారతీయులలో ద్యుతి మూడవ వ్యక్తి. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల పరుగులో ద్యుతి రజతం గెలుచుకున్నారు. ఇది 1998 తర్వాత భారత్‌కు వచ్చిన తొలి అవార్డు. హార్మోన్ టెస్టులో విఫలమైన ద్యుతీ చంద్‌పై అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2014లో నిషేధం విధించింది. ఆమె శరీరంలో టెస్టోస్టిరాన్ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు తేలింది. దీన్ని 'హైపర్‌ఆండ్రోజెనిజమ్' అంటారు. అయితే ఆమె ఈ నిషేధంపై పోరాడారు. ఇలా నిషేధం విధించడం వివక్షతో కూడిన నిర్ణయమని, లోపభూయిష్టమైనదని తేలడంతో 2015లో ఆమెపై నిషేధాన్ని ఎత్తివేశారు. తనకు ఎదురైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ద్యుతి.. దేశంలో సమర్ధవంతమైన మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.
3. కోనేరు హంపి
వయసు: 33 ఏళ్లు, క్రీడ: చెస్
కోనేరు హంపి చదరంగం క్రీడలో అత్యుత్తమ భారతీయ క్రీడాకారుల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హంపిలో ప్రతిభను చాలా చిన్న వయసులోనే ఆమె తండ్రి గుర్తించారు. అత్యంత చిన్న వయసులోనే.. అంటే 15 ఏళ్ల ఒక నెల 27 రోజులకే 2002లో ఆమె గ్రాండ్‌మాస్టర్ అయ్యారు. 2008లో చైనాకు చెందిన హౌ యిఫాన్ ఈ రికార్డును బద్దలుగొట్టేవరకు హంపినే గ్రాండ్‌మాస్టర్‌గా ఉన్నారు. 2019 డిసెంబర్‌లో హంపి మహిళల 'ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్' టైటిల్ గెలుచుకున్నారు. రెండేళ్ల ప్రసూతి విరామం తరువాత ఆమె ఈ ఘనత సాధించారు. తరువాత 2020లో కైర్న్స్ కప్ గెలిచారు. కోనేరు హంపికి 2003లో అర్జున అవార్డ్, 2007లో పద్మశ్రీ అవార్డ్ లభించాయి.
4. వినేశ్ ఫోగట్
వయసు: 26 ఏళ్లు, క్రీడ: ఫ్రీస్టైల్ రెజ్లింగ్
రజత పతకం, ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్
అంతర్జాతీయ రెజ్లింగ్ మహిళా క్రీడాకారుల కుటుంబానికి చెందిన వినేశ్ ఫోగట్, 2018లో జకార్తా ఆసియన్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా రికార్డ్ నెలకొల్పారు. అంతే కాకుండా, కామన్‌వెల్త్ క్రీడల్లో రెండుసార్లు స్వర్ణం సాధించారు. కామన్‌వెల్త్ క్రీడల్లో, ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ ఆమె. 2019 సెప్టెంబర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించారు. 2020 జనవరిలో రోమ్ ర్యాకింగ్ సీరీస్‌లో వినేశ్ స్వర్ణం గెలుచుకున్నారు. వీటన్నిటితోపాటూ గత ఏడాది వినేశ్ కరోనావైరస్‌ను కూడా జయించారు.
5. రాణి
వయసు: 26 ఏళ్లు, క్రీడ: హాకీ
కెప్టెన్, భారత మహిళల హాకీ జట్టు
రాణి 2020లో ప్రతిష్ఠాత్మక 'వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకున్న తొలి హాకీ ప్లేయర్. టోక్యో ఒలింపిక్స్‌లో అడుగు పెట్టేందుకు 2019 నవంబర్‌లో అమెరికాతో ఆడిన హాకీ మ్యాచ్‌లో రాణి కొట్టిన గోల్ కీలక పాత్ర పోషించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టులో కూడా రాణి ఉన్నారు. అతి చిన్న వయసులోనే ప్రపంచ కప్‌లో పాల్గొన్న భారత హాకీ ప్లేయర్‌గా రాణి 2010లో రికార్డ్ నెలకొల్పారు. అంతే కాకుండా 2010 ప్రపంచ కప్‌లో 'యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డ్ కూడా గెలుచుకున్నారు. 2018 ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు రజతం సాధించింది. 2018 ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అదే ఏడాది కామన్‌వెల్త్ గేమ్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచారు. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన రాణికి 2020లో ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది.

ఇవి కూడా చదవండి:
- దిల్లీ అల్లర్లలో మరణించిన అంకిత్ శర్మ, రతన్‌లాల్ కుటుంబాలు ఇప్పుడెలా ఉన్నాయి
- ‘రెండు కాళ్లూ కట్టేసి గోళ్లు పీకేశారు.. మూడు రోజుల పాటు నిద్రపోనివ్వలేదు’
- ప్రపంచవ్యాప్తంగా అందరికీ కోవిడ్-19 వ్యాక్సీన్ అందుబాటులోకి రావడం సాధ్యమేనా?
- భారత్ నుంచి వెళ్లే పెట్రోల్‌ను నేపాల్‌లో అంత చౌకగా ఎలా అమ్ముతున్నారు
- ఇంటి పనులు చేసిన భార్యకు రూ. 5.6 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశించిన కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























