బిహార్: పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్‌కు మరణ శిక్ష - ప్రెస్ రివ్యూ

గ్రాఫిక్ చిత్రం
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం- ప్రిన్సిపల్‌కు మరణశిక్ష

బిహార్‌లో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భవతి కావడానికి కారకుడైన ప్రిన్సిపల్‌కు పట్నాలోని పోక్సో కోర్టు మరణశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. ఈ అత్యాచారం ఘటనలో ప్రిన్సిపల్‌కు సహకరించిన టీచర్‌కు జీవిత ఖైదు, రూ.50వేల జరిమానా విధించినట్లు ఈ కథనం పేర్కొంది.

స్కూల్‌ గంట కొట్టిన తర్వాత ఇంటికి వెళుతున్న చిన్నారిని ప్రిన్సిపల్‌ అరవింద్‌ కుమార్‌ తన గదికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న టీచర్‌ అభిషేక్‌ అరవింద్‌కు సహకరించాడు.

కొన్నాళ్ల తర్వాత కడుపులో నొప్పి అంటూ చిన్నారి బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో చిన్నారి గర్భవతి అని తేలింది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ మీదా, అతనికి సహకరించిన టీచర్‌ మీదా ఫిర్యాదు చేశారు.

ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికల్లో నేరం నిరూపణ కావడంతో పొక్సో చట్టం కింద శిక్ష విధించారు. 2018లో నమోదైన ఈ కేసును ఓ అరుదైన కేసుగా పోక్సో కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

ఓబీసీ రిజర్వేషన్లు

ఫొటో సోర్స్, Getty Images

నాలుగు కేటగిరీలుగా ఓబీసీలు- జస్టిస్‌ రోహిణి కమిషన్‌ ప్రతిపాదన

జాతీయ స్థాయిలో ఓబీసీ జాబితాలోని కులాలను నాలుగు ఉపవర్గాలుగా విభజించాలని, జనాభాను బట్టి ఆయా ఉపవర్గాలకు రిజర్వేషన్లను కేటాయించాలని జస్టిస్‌ రోహిణి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్‌ సిఫార్సు చేయబోతున్నట్టు నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ఓబీసీలోని మొత్తం 2,633 కులాలను నాలుగు వర్గాలుగా విభజించి, వాటికి 1, 2, 3, 4 నంబర్లను కేటాయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జాతీయస్థాయిలో ఓబీసీలకు ఉన్న 27శాతం రిజర్వేషన్లను ఈ నాలుగు వర్గాలకు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు.

1వ వర్గంలో 1,674 కులాలు, 2వ వర్గంలో 534 కులాలు, 3వ వర్గంలో 328 కులాలు, 4వ వర్గంలో 97 కులాలు చేర్చేందుకు కమిషన్‌ ప్రతిపాదించినట్లు ఈ కథనం పేర్కొంది.

ఓబీసీల్లో ఉన్న 2,633 ఉపకులాలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలు సమానంగా అందడంలేదని, సుమారు 1,000 ఉపవర్గాలకు రిజర్వేషన్‌ ఫలాలు దక్కడం లేదని నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ ప్రయోజనాలను జనాభా ప్రాతిపదికన సమానంగా అందజేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2017న అక్టోబర్‌ 2 జస్టిస్‌ రోహిణి నేతృత్వంలో ఓ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్‌ త్వరలోనే రాష్ట్రాలలో పర్యటించి సూచనలు, సలహాలు తీసుకుంటుందని నమస్తే తెలంగాణ తన కథనంలో పేర్కొంది.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, YSR Congress Party/twitter

స్కోచ్‌ సీఎం ఆఫ్‌ ద ఇయర్‌ వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి

పరిపాలనలో సంస్కరణలు, విప్లవాత్మక పథకాలతో సంక్షేమాన్ని ప్రజల ముంగిటికే తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని 'సీఎం ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డుకు స్కోచ్‌ గ్రూపు ఎంపిక చేసినట్లు సాక్షి పత్రిక ఓ కథనం ఇచ్చింది.

పాలనలో ఉత్తమ ప్రతిభ విభాగంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాలనలో విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేసిందని స్కోచ్‌ గ్రూప్‌ దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

రాష్ట్రంలో చేపట్టిన 123 ప్రాజెక్టులపై ఏడాది పొడవునా జరిగిన అధ్యయనంలో పాలనలో ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు తేలిందని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ తెలిపారు.

మంగళవారం క్యాంపు క్యార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి 'సీఎం ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డును ఆయనకు అందజేసినట్లు సాక్షి కథనం వెల్లడించింది.

భుజాలపై మనిషితో మూడు కిలోమీటర్ల నడక - మహిళకు అత్తింటి వారి శిక్ష

భర్త నుంచి విడిపోయి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఓ యువతిని అత్తమామలు దారుణంగా శిక్షించిన ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌ గుణలో జరిగినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

గుణ జిల్లాలోని బన్స్‌ఖేడీ గ్రామంలో రెండేళ్ల కిందట ఓ యువతి ఓ వ్యక్తిని పెళ్లాడింది. తర్వాత మనస్పర్ధలు రావడంతో అతని నుంచి విడిపోయి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త తల్లిదండ్రులు బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఆమె చేసిన పనికి శిక్ష అంటూ ఓ వ్యక్తిని ఆమె భుజాలపై కూర్చోబెట్టి మూడు కిలోమీటర్లు నడిపించారు. చెప్పులు కూడా లేకుండా ఆ వ్యక్తిని మోస్తూ బాధితురాలు నడుస్తుండగా, భర్త తరఫు బంధువులు వెనక నుంచి కర్రలు, క్రికెట్‌ బ్యాట్‌లతో కొడుతూ కనిపించారు.

ఈ నెల 9న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది. భర్త నుంచి విడిపోయి వేరే వ్యక్తితో ఉండటాన్ని సహించలేక అతని బంధువులు ఈ దాడి చేశారని పోలీసులు వెల్లడించారు.

ఫిర్యాదు మేరకు ఐదుగురిని అరెస్ట్‌ చేశామని, బాధితురాలు ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని పోలీసులు వెల్లడించినట్లు ఈనాడు తన కథనంలో పేర్కొంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)