విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం - ప్రెస్ రివ్యూ

ప్రచురణ

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిందని ఈనాడు దినపత్రిక కథనం ప్రచురించింది.

విశాఖపట్నం స్టీలు ప్లాంటును 100% ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే బుధవారం ట్వీట్‌ చేశారని కథనంలో రాశారు.

జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఇందుకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొన్నారు.

ఈ సంస్థపై యాజమాన్య హక్కులను వదులుకొని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ఆయన తెలిపారు.

''ప్రైవేటీకరణ ద్వారా యాజమాన్య హక్కులతో పాటు, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 100% షేర్‌హోల్డింగ్‌ను ఉపసంహరించుకోవడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ జనవరి 27న ఆమోదముద్ర వేసింది'' అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారని తెలిపింది..

'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' అన్న ఉద్ధృత పోరాటం ఫలితంగా 1971లో శంకుస్థాపన చేసుకున్న ఈ నవరత్న సంస్థలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికే 100% వాటాలున్నాయి.

సముద్రతీరంలో ఏర్పాటైన తొలి సమీకృత ఉక్కు కర్మాగారం ఇదే. ఒకప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయిన సంస్థ.. తర్వాతి కాలంలో తేరుకొని రూ. 21,851 కోట్ల టర్నోవరు సాధించే స్థాయికి చేరింది.

నాలుగేళ్లలో 203.6% వృద్ధి సాధించింది. 2010 నవంబరు 17న దీనికి నవరత్న హోదా కల్పించారు. దేశంలో అతిపెద్ద సింగిల్‌ సైట్‌ ప్లాంటు ఇదేనని ఈనాడు వివరించింది.

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ

రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించడంతో తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక వార్తా కథనం ప్రచురించింది.

'తెలంగాణ ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-30' పేరిట.. పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేసేవారికి రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక తాయిలాలు ప్రకటించిన నేపథ్యంలో చాలా మంది దృష్టి వాటిపై పడింది!

ఈ-వాహనాలతో తాయిలాలు అంతటితో అయిపోవు. తగ్గిన ఇంధన, నిర్వహణ ఖర్చు రూపంలో వాటిని వాడినంతకాలం అందుతూనే ఉంటాయని కథనంలో రాశారు.

మామూలు వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు కొద్దిగా ఎక్కువే అయినా.. నిర్వహణ, ఇంధన ఖర్చులు తక్కువ.

అందుకే మార్కెట్‌లో ఈ వాహనాలకు ప్రజాదరణ క్రమంగా పెరుగుతోంది. కంపెనీలూ ఈ దిశగా దృష్టి సారిస్తున్నాయి.

దీంతో ప్రస్తుతం 147 రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలు మనదేశంలో అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు రూ.25 వేల నుంచి రూ.1.46 లక్షల దాకా (ఎక్స్‌ షోరూమ్‌ ధర) ఉన్నాయని పత్రిక రాసింది.

ఎలక్ట్రిక్‌ వాహనాలతో సగటు ప్రయాణ ఖర్చు భారీగా తగ్గిపోతుంది. ఉదాహరణకు.. సాధారణ బైక్‌లు మోడల్‌ను బట్టి సగటున లీటర్‌ పెట్రోలుకు 30-60 కిలోమీటర్ల దాకా మైలేజీని ఇస్తాయి.

అంటే.. కిలోమీటరుకు సగటున రూ.1.50-2.25 దాకా ఖర్చవుతుంది. అదే ఈ-బైక్‌లతో అయితే కిలోమీటరు ప్రయాణానికి సగటున 20 పైసల నుంచి 40 పైసల దాకా ఖర్చవుతుంది. కార్లకు కూడా ఇలాగే సగటు ప్రయాణ ఖర్చు తగ్గుతుంది అని ఆంధ్రజ్యోతి వివరించింది.

టాయిలెట్‌లో చిక్కిన చిరుత పులి, కుక్క

కర్ణాటకలో ఒక ఇంటి టాయిలెట్‌లో చిరుతపులి, కుక్క ఇరుక్కుపోయినట్లు సాక్షి దినపత్రిక వార్త ప్రచురించింది.

కర్ణాటకలోని బిలినెళ్లి అనే గ్రామంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో బుధవారం ఓ వీధి కుక్కతో పాటు చిరుత పులి దర్శనమివ్వడం స్థానికంగా కలకలం రేపింది.

ఇంటి యజమానురాలు బాత్రూం వెళ్దామని డోర్‌ తీయగా చిరుత, దాన్ని చూస్తూ భయంతో వణికిపోతున్న వీధి కుక్క దర్శనమివ్వడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె.. డోర్‌కు గొళ్లెం పెట్టి, పోలీసులకు సమాచారం చేరవేసిందని పత్రికలో రాశారు.

ఇంతకీ ఈ రెండు జంతువులు మరుగుదొడ్డిలోకి ఎలా చేరాయని ఆరా తీస్తే.. గ్రామంలో సంచరిస్తున్న వీధి కుక్క, అనుకోని అతిధి చిరుత కంట పడింది.

దాని నుంచి తప్పించుకునే క్రమంలో వీధి కుక్క.. సమీపంలోని ఓ ఇంటి మరుగుదొడ్డిలో దాక్కుంది. ఆ కుక్క హమ్మయ్యా అనుకునే లోపు చిరుత దాన్ని వెంబడిస్తూ అదే బాత్రూంలోకి చేరింది.

ఇంతలో ఇంటి యజమానురాలు బాత్రూం డోర్‌ తీసి, పోలీసులకు సమాచారమిచ్చింది. హుటాహుటిన రంగప్రవేశం చేసిన పోలీసులు.. పులి బారి నుండి కుక్కను రక్షించి, పులిని బంధించాలని ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసులు బాత్రూం పైకప్పును తొలగించి రెస్క్యూ అపరేషన్‌ చేపడుతుండగా.. చిరుత అమాంతంపైకి ఎగిరి, గోడల మీదుగా దూకుతూ అక్కడి నుంచి తప్పించుకుంది.

ఈ మొత్తం సన్నివేశాలన్నీ బాత్రూం డోర్‌ మధ్య సందుల్లో నుంచి స్థానికులు చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారిందని సాక్షి రాసింది.

తెలంగాణలో పదో తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లే

పదో తరగతిలో పరీక్ష పేపర్లను ఆరింటికి కుదించినట్లు నమస్తే తెలంగాణ దినపత్రిక వార్త ప్రచురించింది.

ముందుగా ఊహించినట్టుగానే పదో తరగతి పరీక్షకు ప్రశ్నాపత్రాలను కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ఏడాది 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని డిసైడ్‌ అయింది. ప్రతి సబ్జెక్టుకు ఒకే పేపర్‌ ఉంటుందని, దానికి 80 మార్కులు ఉంటాయని వెల్లడించింది.

ఇంటర్నల్‌ మార్కులు యథావిధిగా 20 ఉంటాయని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారని పత్రిక పేర్కొంది.

పేపర్ల కుదింపు 2020-21 విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ఆమె స్పష్టంచేశారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు నష్టం జరుగొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

గతంలో అమలుచేసిన పేపర్‌-1, పేపర్‌-2ను విలీనంచేసి ఒకే ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తామని పేర్కొన్నారు. రెండో భాష (సెకండ్‌ లాంగ్వేజ్‌) పేపరులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన తెలిపారు.

ప్రశ్నలను సిలబస్‌లోని ముఖ్యమైన యూనిట్ల నుంచి ఎంపికచేస్తామని, ప్రశ్నల సంఖ్యను పెంచి విద్యార్థులకు మరింత చాయిస్‌ ఇవ్వనున్నామని వెల్లడించారు.

పరీక్ష సమయాన్ని అరగంట పెంచారు. ఇదివరకు 2.45 గంటలు ఉండగా.. ఇప్పుడు 3.15 గంటలు పరీక్ష రాసేందుకు అనుమతిస్తారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)