ఆంధ్రా స్కూల్‌ సీసీటీవీ కెమెరాలో ఏముంది? - ప్రెస్‌రివ్యూ

రైతుల నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

గణతంత్ర దినోత్సవంనాడు దిల్లీ నడిబొడ్డులో ఉన్న ఐటీవో వద్ద జరిగిన హింసాత్మక దృశ్యాలు సమీపంలోనే ఉన్న దుర్గాబాయ్‌ దేశ్‌ ముఖ్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌(ఆంధ్రా స్కూల్‌) ప్రహరీగోడకు అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యాయని, ఈ ఫుటేజీని పోలీసులు తీసుకువెళ్లారని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన ట్వీట్‌ పలు చర్చలు రేకెత్తిస్తోందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

''తెలుగు వారు నిర్వహించే ఈ స్కూలులో అనేకమంది తెలుగు పిల్లలు చదువుకుంటారు. ఐటీవో వద్దే రైతులకూ, పోలీసులకు మధ్య రాళ్లు రువ్వుడు ఘటనలు, లాఠీచార్జ్‌ జరిగాయి.

ఒక ట్రాక్టర్‌ బోల్తాపడి నవ్రీత్‌ సింగ్‌ అనే యువకుడు మరణించినట్లు కూడా పోలీసులు ప్రకటించి ఆ మేరకు సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు.

ఈ యువకుడిని పోలీసులు కాల్చి చంపారని, ట్రాక్టర్‌ బోల్తాపడే ముందే ఈ కాల్పులు జరిగాయని కొందరు రైతులు ఆరోపించారు.

సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ఈ మేరకు ట్వీట్లు చేసినందుకు పోలీసులు దేశద్రోహం కింద కేసులు కూడా పెట్టారు.

అయితే రాంపూర్‌లోని జిల్లా ఆసుపత్రిలో జరిగిన పోస్ట్‌మార్టమ్‌ ప్రకారం షాక్‌తో పాటు మెదడులో రక్తస్రావం జరిగినందువల్ల నవ్రీత్‌ సింగ్‌ మరణించారని ప్రకటించారు.

కుటుంబ సభ్యులు మాత్రం ఈ నివేదికను వ్యతిరేకిస్తూ అతడి మెదడులో బుల్లెట్‌ గాయాన్ని స్పష్టంగా చూశామని డాక్టర్లు తమకు చెప్పినట్లు తెలిపారు.

మరోవైపు తమ సీసీటీవీ రికార్డులో మాత్రం ఏ దృశ్యాలూ నమోదు కాలేదని ఆంధ్రా స్కూలు అధికారి ఒకరు తెలిపారు. జనవరి 26నాడు పెద్ద ఎత్తున రైతులు రాగా.. తాము ఆరుగురు నేతలను లోపలకు అనుమతించామన్నారు.

ఆ దృశ్యాల్లో ఏమీలేదని ధ్రువపరుచుకున్న తర్వాత వెళ్లిపోయారని.. అనంతరం పోలీసు అధికారులు ఆ ఫుటేజ్‌ మొత్తం తీసుకువెళ్లారని ఆయన చెప్పారు.

విచిత్రమేమంటే తమ సీసీటీవీలో ఎటువంటి దృశ్యాలు రికార్డు కాలేదని ఆంధ్రా స్కూలు అధికారి చెబుతుండగా, ట్రాక్టర్‌ బోల్తా పడినట్లు దిల్లీ పోలీసులు ఎక్కడి నుంచి ఫుటేజ్‌ సంపాదించారు? అన్నది తేలాల్సి ఉంది''అని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌

ఫొటో సోర్స్, Facebook/Prakashrathod

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌

శాసన మండలిలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయిన ఎమ్మెల్సీ

కర్ణాటక శాసన మండలిలో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ సభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ సెల్‌ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూశారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

''ప్రకాశ్‌ రాథోడ్‌ అశ్లీల వీడియోలు చూస్తున్న దృశ్యాలను కొన్ని కన్నడ వార్తా ఛానెళ్లు ప్రచారం చేశాయి. ప్రజా సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ పని ఏమిటంటూ ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్‌ చేశాయి. రాథోడ్‌ చేసిన పనిని తప్పుబట్టిన భాజపా ఆయనను వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

అయితే తనపై వచ్చిన ఆరోపణలను ప్రకాశ్‌ రాథోడ్‌ ఖండించారు. తాను ఎలాంటి వీడియోలు చూడలేదని, సెల్‌ఫోన్‌లో మెమొరీ నిండిపోవడంతో కొన్నింటిని డిలీట్‌ చేసినట్లు తెలిపారు.

కర్ణాటకలో 2012లోనూ ముగ్గురు మంత్రులు శాసనసభలో అశ్లీల వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ఈ ఘటన తర్వాత వారు ముగ్గురూ తమ పదవులకు రాజీనామా చేశారు''అని ఆ కథనంలో పేర్కొన్నారు.

వాట్సాప్

ఫొటో సోర్స్, EPA

భారత్‌లో వాట్సాప్‌కు 5% వినియోగదారులు గుడ్‌బై

వాట్సాప్‌ గోప్యతా విధానంలో మార్పులు నచ్చక భారత్‌లోని ఆ యాప్‌ యూజర్లలో 5 శాతం మంది గుడ్‌బై చెప్పారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

''వాట్సాప్‌ను డిలీట్‌ చేసి సిగ్నల్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్‌లకు వినియోగదారులు మళ్లిపోతున్నారు. 'లోకల్‌సర్కిల్స్‌' తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

దేశంలోని 232 జిల్లాల్లో 17 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 55 శాతం మంది వాట్సాప్‌కు ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

21 శాతం మంది కొత్త యాప్‌లను చురుగ్గా వినియోగిస్తున్నారు. ఇతర మెసేజింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారిలో 16 శాతం మంది వాట్సాప్‌ను డిలీట్‌ చేయలేదు. వినియోగాన్ని తగ్గించారంతే.

కానీ వాట్సాప్‌ బిజినెస్‌ చాట్‌, పేమెంట్‌ ఫీచర్‌ను ఉపయోగించబోమని 75 శాతం మంది స్పష్టం చేశారు.

వాట్సాప్‌ తన యూజర్ల సమాచారాన్ని ఫేస్‌బుక్‌, ఇతర సంస్థలకు ఇచ్చేందుకు కొత్త గోప్యతా విధానాన్ని తెచ్చింది. అయితే వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో దాని అమలును మే 15వ తేదీకి వాయిదా వేసింది''అని ఆ కథనంలో పేర్కొన్నారు.

రిషభ్ పంత్

ఫొటో సోర్స్, Getty Images

87ఏళ్లలో తొలిసారి రంజీ ట్రోఫీ రద్దు

ఫస్ట్‌క్లాస్ దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సీజన్‌ను ఈసారి రద్దు చేస్తున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ తెలిపినట్లు ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

''దేశంలో రంజీ ట్రోఫీ రద్దు కావడం 87 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్రాల క్రికెట్ సంఘాలు అన్నీ దాదాపు విజయ్ హజారే ట్రోఫీ నిర్వహణకే మొగ్గు చూపడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అలాగే, వినూ మన్కడ్ ట్రోఫీలో భాగంగా అండర్-19 జాతీయ వన్డే టోర్నమెంట్, మహిళల 50 ఓవర్ టోర్నమెంట్ నిర్వహించనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జే షా రాష్ట్ర విభాగాలకు లేఖ రాశారు.

ఒక్కో మ్యాచ్‌కు ఆటగాళ్లకు గరిష్టంగా రూ. 1.5 లక్షలు చెల్లించే ఈ బ్లూరిబండ్ టోర్నమెంట్ కోసం బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శ జే షా ఆసక్తిగా ఉన్నప్పటికీ, రెండు నెలలపాటు రెండు దశల్లో రంజీ ట్రోఫీని నిర్వహించడం ప్రస్తుత కోవిడ్ సమయంలో కష్టసాధ్యమైన పని. ఈ నేపథ్యంలో రంజీ సీజన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు''అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)