మూఢ నమ్మకాలు: శూలంతో పొడిచి.. డంబెల్‌తో కొట్టి.. కన్న బిడ్డలను చంపిన తల్లిదండ్రులు -ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులే అత్యంత దారుణంగా కొట్టి చంపినట్లు ఈనాడు ఓ కథనం ప్రచురించింది. చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన వెలుగుచూసింది.
‘‘శివనగర్‌కు చెందిన ఎన్.పురుషోత్తంనాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఇతని భార్య పద్మజ ఓ విద్యాసంస్థ కరస్పాండెంట్, ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. వీరికి అలేఖ్య (27), సాయిదివ్య (22) పిల్లలున్నారు.
వీరిలో పెద్ద కుమార్తె భోపాల్‌లో పీజీ చేస్తుండగా.. చిన్నకుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.
వీరంతా గత ఏడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు.
ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తాను పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హత్యకు గురైనవారు, హంతకులు అందరూ పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయారని, మృతులు మళ్లీ బతుకుతారనే మూఢ నమ్మకంతో చంపేసినట్లు ప్రాథమికంగా తెలిందని పోలీసులు చెప్పార’’ని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
నేడు సుప్రీంకోర్టులో పంచాయతీ ఎన్నికల కేసు..
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూలును సమర్థిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు విచారించనుందని సాక్షి తెలిపింది.
‘‘జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ హృషీకేష్‌రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా విచారించనుంది.
సప్లిమెంటరీ జాబితాలో తొలుత 39వ ఐటెమ్‌గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించాల్సి ఉండింది.
అయితే ఆ ధర్మాసనం నుంచి ఈ పిటిషన్‌ను తొలగిస్తున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తాజాగా పేర్కొంది. అనంతరం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ద్విసభ్య ధర్మాసనం జాబితాలో చేర్చింది’’ అని ఆ కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
సిగరెట్ పెట్టెల్లో.. ల్యాప్‌టాప్‌లో బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్
సిగరెట్ పెట్టెల్లో.. ల్యాప్‌టాప్‌లో బంగారం రహస్యంగా దాచి విమానాల్లో స్మగ్లింగ్ చేస్తున్న మఠాను పోలీసులు పట్టుకున్నారని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
‘‘దుబాయ్ నుంచి చెన్నై ఎయిర్ పోర్టులో దిగి కాసేపట్లో బయటకువెళ్లే సమయంలో వీరిని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో చివరి నిమిషంలో వీరిని నిలిపేశారు. కాసేపు పక్కన వేచి ఉండమని చెప్పి.. స్కానర్లతో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే.. ఐదుగురు ప్రయాణికులు తమ ప్యాంట్లోలోని రహస్య ప్రదేశంలో దాచిన బంగారు తునకలు బయటపడ్డాయి.
దీంతో పోలీసులు తమదైన శైలిలో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ.. ప్రశ్నించారు. సిగరెట్ ప్యాకెట్లలోనూ.. చివరకు ల్యాప్ టాప్‌లోనూ బంగారమే కనిపించింది. మొత్తంగా వీరు 3.46 కిలోల బంగారం దాచిపెట్టి తీసుకొచ్చినట్లు గుర్తించారు.
కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాల నుండి అక్రమంగా రవాణా చేసిన బంగారం విలువ 1.75 కోట్లు ఉంటుందని అంచనా’’ అని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, Chickens - generic
తెలంగాణలో బర్డ్‌ఫ్లూ లేదు
తెలంగాణలో బర్డ్‌ఫ్లూ ఎవియన్ ఇన్‌ఫ్లూ యెంజా జాడలు లేవని, కోళ్లతోపాటు కాకులు, ఇతర వలస పక్షులకూ ఈ వైరస్ సోకిన దాఖలాలు కనిపించడం లేదని అటవీశాఖ, బర్డ్‌వాచర్స్, స్వచ్ఛంద సంస్థల పరిశీలనలోవెల్లడైందని నమస్తే తెలంగాణ తెలిపింది.
‘‘దేశంలోని పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాపిస్తున్నట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో తెలంగాణ లోని అన్ని అభయారణ్యాలు, అటవీ ప్రాంతాలు, జూపార్క్‌లలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్ ఇతర జూపార్క్‌లలో పక్షులుండే ఎన్‌క్లోజర్‌లు, మోట్‌లలో సున్నం చల్లి, నీటిని స్ప్రే చేస్తున్నారు. సందర్శకులు పక్షులకు దగ్గరగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లోగానీ, వెలుపల గానీ బర్డ్ ఫ్లూ సోకిన దాఖలాలు ఇంతవరకు లేవని అటవీశాఖ ఓఎసీ (వైల్డ్‌లైఫ్) శంకరన్ వెల్లడించారు. తాము గత కొన్ని రోజులుగా వలస పక్షుల కదలికలపై ప్రత్యేక పరిశీలన జరుపుతున్నామని, ఇంత వరకు ఏ ఒక్క వలస పక్షి కూడా అస్వస్థతతో అకస్మాత్తుగా నేలరాలినట్టు కనిపించలేదని దక్కన్ బర్డ్ వాచర్ సొసైటీ ప్రతినిధి సుధీర్‌మూర్తి తెలిపారు.
వైరస్ క్యారియర్‌గా భావిస్తున్న ‘బార్ హెడెడ్ గూస్' జాతికి చెందిన పక్షులు హైదరాబాద్‌కు వలస వచ్చినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేవని చెప్పార’’ని ఆ కథనం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- ‘వాయిదా కాదు.. రద్దు చేయాలి.. ఉద్యమం అప్పుడే అయిపోలేదు’.. వ్యవసాయ చట్టాలపై రైతు నాయకులు
- సేఠ్ ఆబిద్: బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- లీసా మోంట్గోమేరీ: 67 ఏళ్ల తరువాత తొలిసారిగా ఒక మహిళకు మరణ శిక్ష అమలు చేసిన అమెరికా
- కరోనావైరస్: భారత్‌లో జనవరి 16 నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్... ఎలా చేస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు?
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- ఆలయానికి వెళ్లిన మహిళపై గ్యాంగ్ రేప్, హత్య... పూజారే నిందితుడు
- దక్షిణ కొరియాలో ప్రమాద ఘంటికలు, తగ్గిన జననాలు, పెరిగిన మరణాలు
- కడుపు పెరుగుతుంటే కవల పిల్లలనుకున్నారు.. డాక్టర్ చెప్పింది విని ఆశ్చర్యపోయారు
- జాక్ మా: ఈ చైనా బిలియనీర్ రెండు నెలల్లో రూ.80వేల కోట్లు ఎలా కోల్పోయారు?
- మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరు
- "నేనెలాగూ బ్రతకను.. నా బిడ్డను అయినా కాపాడండి" - మరణం అంచుల దాకా వెళ్లిన 22 ఏళ్ల మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























