ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వింత వ్యాధి కలకలం... పశ్చిమ గోదావరి జిల్లాలో నురగలు కక్కుతూ ఆస్పత్రిలో చేరుతున్న బాధితులు

అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లిలో 25 మంది, భీమడోలులో ఇద్దరు, ఏలూరులో ఇద్దరు చొప్పున ఆసుపత్రి పాలయ్యారని ఈనాడు ఓ కథనంలో తెలిపింది.
భీమడోలు మండలంలో బాధితుల సంఖ్య 36కు చేరింది. దెందులూరు మండలం కొమిరేపల్లిలో గురువారం రాత్రి తొలి కేసు నమోదవగా, శుక్రవారం కొత్తగా 24 మంది వ్యాధి బారినపడ్డారు. వీరిలో పురుషులు 16, మహిళలు 9 మంది ఉన్నారు. వీరిలో 21 మంది కోలుకోగా నలుగురు చికిత్స పొందుతున్నారు.
మూడు చోట్లా బాధితులందరిలోనూ కళ్లు తిరగటం, స్పృహ కోల్పోవడం, నీరసంతో చతికిలపడటం, నోటి నుంచి నురగ రావడం వంటి లక్షణాలు కనిపించాయి. ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు స్పష్టంచేశారు.
ఏలూరులో డిసెంబర్ 4న మొదలైన ఈ అంతుచిక్కని వ్యాధి కలవరం దాదాపు రెండు వారాలపాటు కొనసాగింది.
మొత్తం 622 మంది వరకు ఆస్పత్రిలో చేరారు. క్రమంగా కేసుల సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే శుక్రవారం నగరంలోని రామకృష్ణాపురానికి చెందిన ఒక బాలిక, తూర్పువీధికి చెందిన ఓ వృద్ధుడు ఇవే లక్షణాలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఘటన ‘వన్‌టైం ఎపిసోడ్’ (ఒకసారి సంభవించే ఘటన)గా ఉన్నత స్థాయి కమిటీ అభిప్రాయపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు.
కొమిరేపల్లిలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ... ‘గత ఏడాది డిసెంబరులో ఏలూరులో పలువురు అకస్మాత్తుగా పడిపోయిన సంఘటనకు కారణాలపై అధ్యయనం చేయడానికి జాతీయ సంస్థలు వివిధ రకాల నమూనాలను సేకరించాం. ముంబయి, దిల్లీ, పుణె, హైదరాబాద్, ఇతరచోట్ల ఉన్న వివిధ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించిన నివేదికను త్వరలో సీఎం జగన్‌కు అందచేస్తాం. అవసరమైనచోట్ల నీటి, ఆహార పదార్థాల నమూనాలు పరీక్షించేందుకు ప్రయోగశాలలను అభివృద్ధి చేయబోతున్నాం. ఏలూరు కెనాల్ వెంట ఉన్న గ్రామాల్లో నమూనాలను సేకరిస్తాం’ అని వివరించారు.
అనంతరం సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ మాట్లాడుతూ... ‘సీఎం జగన్ ఆదేశాలతో కొమిరేపల్లికి వచ్చాం. వైద్యుల చికిత్సతో బాధితులు వెంటనే కోలుకుంటున్నారు. ఎవ్వరూ కంగారుపడాల్సిన అవసరంలేదు. వైద్య బృందాలు అన్ని వేళల్లోనూ సిద్ధంగా ఉంటాయి’ అని భరోసా ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
కోల్గేట్ సంస్థకు జరిమానా..
ఎక్కువ ధరకు పేస్ట్ అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలపై కోల్గేట్ సంస్థకు సంగారెడ్డి వినియోగదారుల ఫోరం రూ. 10 వేల జరిమానా విధించిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
న్యాయవాదిగా పనిచేస్తున్న సీహెచ్ నాగేందర్ 2019 ఏప్రిల్ 7న సంగారెడ్డి పట్టణంలోని రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ మాల్‌లో 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్ రూ. 92కు కొనుగోలు చేశారు. దీంతోపాటు 20 గ్రాముల కోల్గోట్ మాక్స్ టూత్‌పేస్ట్ రూ. 10లకు కొనుగోలు చేశారు. పది రూపాయలకు 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్‌కు రూ.92 తీసుకున్నారు. రూ. 17 ఎక్కువ ఎందుకు తీసుకున్నారంటూ ఆయన కోల్గేట్ సంస్థ వారికి నోటీసులు పంపించారు.
సంస్థ నుంచి సమాధానం రాకపోవడంతో సంగారెడ్డిలో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అనంతరం కోల్గేట్ సంస్థ వారు అదనంగా వసూలు చేసిన రూ. 17 తిరిగి ఇవ్వాలని, ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ. 10 వేలు, ఖర్చుల కింద రూ. 5 వేలు అదనంగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం చైర్మన్ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు చెప్పారు.
వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్ సంస్థను ఆదేశించారు. ఇవన్నీ నెల రోజుల్లోగా వినియోగదారుడు నాగేందర్‌కు చెల్లించాలన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వ్యాక్సీన్: కోవిన్ యాప్‌లో పేర్లు కనిపించడంలేదు
కరోనా టీకా కార్యక్రమంలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
కోవిన్ (కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్) యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించాలని కేంద్రం భావించింది. అయితే ఆ యాప్ మొరాయిస్తుండటంతో కార్యక్రమానికి విఘాతం కలుగుతోంది.
లబ్ధిదారులు నిర్దేశిత టీకా కేంద్రానికి వెళ్లి చూస్తే, యాప్‌లో కొందరివి పేర్లు కనిపించట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. వారికి మెసేజ్‌లు వచ్చిన కేంద్రంలో కాకుండా ఇతర కేంద్రాల్లో కొందరి పేర్లు ఉంటున్నాయి. అంతేకాదు ఇంకొందరివైతే ఎక్కడా పేర్లు కనిపించట్లేదు.
మరికొందరివి వేరే జిల్లాల్లో ఉంటున్నాయి. అయితే ఏ కేంద్రంలో లబ్ధిదారుల పేర్లు ఉన్నాయో గుర్తించే అవకాశం ఈ యాప్‌లో లేకపోవడంతో సమస్యలు వచ్చి పడుతున్నాయి. లబ్ధిదారులకు మెసేజ్‌లు పంపిస్తే కొందరికి వారి మొబైల్ ఫోన్లకు వెళ్లట్లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంటిపేర్లు తప్పు రావడం, అడ్రస్‌లు వేరుగా ఉండటం, గుర్తింపు కార్డులో ఉన్న వివరాలకు, యాప్ లోని వివరాలకు పొంతన కుదరకపోవడం, వయసు తప్పుగా ఉండటం, హోదాలు మారిపోతుండటం జరుగుతోందని చెబుతున్నారు. దీంతో అంతా గందరగోళంగా మారింది.
డ్రై రన్ సందర్భంగానే ఈ యాప్‌లో సమస్యలున్నాయని కేంద్రానికి ఫిర్యాదు చేసినా, ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ నెల 16 నుంచి యాప్‌తో సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీంతో 50 శాతం కార్యక్రమం యాప్‌తో నడుస్తుంటే, మిగిలిన 50 శాతం మాన్యువల్ పద్ధతిలో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏనుగుకు నిప్పు... కాలిన గాయాలతో మృతి
ఏనుగుకు కొందరు నిప్పుపెట్టడంతో కాలిన గాయాలతో మరణించిందని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.
తమిళనాడులోని నీలగిరి అటవీ ప్రాంత గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. మాసినగుడి గ్రామంలోకి 40 ఏళ్ల అడవి ఏనుగు ఇటీవల ప్రవేశించింది. దీంతో దానిని తరిమేందుకు కొందరు గ్రామస్తులు ప్రయత్నించారు.
ఇందులో భాగంగా కాలుతున్న టైర్‌ను ఏనుగుపైకి విసిరారు. అయితే అది ఏనుగు చెవులకు చిక్కుకున్నది. కాలుతున్న టైర్ మంటలకు తాళలేక అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది.
కాగా, తల వెనుక, చెవుల వద్ద తీవ్రంగా కాలిన గాయాలతో పడి ఉన్న ఆ ఏనుగును అటవీ సిబ్బంది గమనించారు. తెప్పకాడు ఏనుగు శిబిరానికి తీసుకెళ్లి చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ఏనుగు ఈ నెల 19న చనిపోయినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఏనుగుకు నిప్పుపెట్టిన ముగ్గురిని గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- సింగర్ సునీత వివాహం: మహిళలు రెండో పెళ్లి చేసుకోవడం తప్పా
- అతి సాధారణ మహిళలు నాజీ క్యాంపుల్లో ‘రాక్షసుల్లా’ ఎలా మారారు?
- భారత్‌ను పొగిడిన పాకిస్తానీ టీవీ ప్రజెంటర్ - దేశద్రోహి అంటున్న నెటిజన్లు.. సమర్థిస్తున్న సెలబ్రిటీలు
- ఇస్లామిక్ స్టేట్: పాకిస్తాన్ నుంచి సిరియాలోని మిలిటెంట్లకు నిధులు ఎలా వెళ్తున్నాయి?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సిరాజ్: తండ్రి కల నెరవేర్చాడు.. కానీ చూసి సంతోషించడానికి ఆ తండ్రి ఇప్పుడు లేరు
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
- అర్నబ్ గోస్వామి వాట్సాప్ చాట్ లీక్ వివాదం.. ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు.. మోదీపై ఆరోపణలు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























