ప్రేయసిని చంపి శవాన్ని గోడలో పూడ్చేశాడు - ప్రెస్ రివ్యూ

కుల దురహంకార హత్య

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తనతో కలిసి ఉంటున్న ప్రేయసిని హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోని గోడలో దాచిపెట్టాడని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

‘‘ఈ దారుణ ఘటన పాల్‌గఢ్‌ జిల్లాలోని వనగామ్‌లో వెలుగులోకి వచ్చింది. నేరస్థుడిని అరెస్టు చేసి గోడలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు.

నిందితుడు గత ఐదేళ్లుగా 32 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే, గత కొన్ని నెలలుగా ఆమె కనిపించకుండా పోయింది.

మహిళ కుటుంబసభ్యులు ఆమె గురించి నిందితుడిని ప్రశ్నించగా.. పని నిమిత్తం గుజరాత్‌లోని వాపికి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు.

కొంతకాలం ఎదురుచూసిన కుటుంబసభ్యులు ఆమె తిరిగి రాకపోవడంతో చివరికి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళతో సహజీవనం చేస్తున్న అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

వివాహం చేసుకోవాలని కోరుతుండటంతో నిందితుడు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతదేహాన్ని గోడలో దాచిపెట్టినట్లు నిందితుడు పేర్కొన్నట్లు తెలిపారు. వెలికితీసిన మృతదేహం దాదాపు అస్థిపంజరంగా మారింది. దీన్ని బట్టి గత అక్టోబరులో ఆమెను హత్య చేసినట్లు భావిస్తున్నారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

కరోనా వ్యాక్సినేషన్

ఫొటో సోర్స్, Getty Images

కోవాగ్జిన్‌తో దుష్ప్రభావాలొస్తే పరిహారం ఇస్తామన్న భారత్ బయోటెక్

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిచేసిన ‘కోవాగ్జిన్‌’ ఇచ్చే ముందు లబ్ధిదారుల నుంచి తప్పనిసరిగా అంగీకార పత్రం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.

ఆ కంపెనీ కన్సెంట్‌ కాపీని శనివారం అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖలకు కేంద్రం పంపింది. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ మోడ్‌లో మాత్రమే కొవాగ్జిన్‌ టీకాను తీసుకునేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. అందుకే టీకా తీసుకునే వారి నుంచి అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నామని కేంద్రం పేర్కొంది.

తొలి రెండు దశల ప్రయోగ పరీక్షల్లో కోవాగ్జిన్‌ ప్రభావంతో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించామని, చివరి దశ ట్రయల్స్‌ జరుగుతున్నాయని తెలిపింది.

తమ వ్యాక్సీన్‌ వల్ల హాని జరిగితే అందుకు పూర్తి బాధ్యత తామే వహిస్తామని, అవసరమైన చికిత్స అందిస్తామని అంగీకార పత్రంలో భారత్‌ బయోటెక్‌ హామీ ఇచ్చింది. వ్యాక్సీన్‌ వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తినట్లు రుజువైతే నష్టపరిహారం కూడా అందిస్తామని పేర్కొంది.

ఈ రిస్క్‌కు అంగీకరిస్తున్నట్లు టీకా వేయించుకునే వారు, లబ్ధిదారుడికి ఈ రిస్క్‌ గురించి వివరించినట్లుగా ఒప్పుకుంటూ టీకా ఇచ్చే వ్యక్తి అంగీకార పత్రంపై సంతకాలు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

హార్దిక్ పాండ్యా సోదరులతో తండ్రి హిమాన్షు

ఫొటో సోర్స్, Facebook/Hardikpandya

గుండెపోటుతో పాండ్యా తండ్రి మృతి

భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యాల తండ్రి హిమాన్షు పాండ్యా శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. హిమాన్షు సూరత్‌లో కార్ల ఫైనాన్స్ వ్యాపారాన్ని నడిపేవాడు. అయితే కొడుకుల క్రికెట్ శిక్షణ కోసం ఆ వ్యాపారాన్ని వదిలేసి.. వడోదరకు వచ్చి స్థిరపడ్డారు.

వడోదరకు వచ్చిన తర్వాత హిమాన్షు తన కొడుకులిద్దరినీ మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోర్ క్రికెట్ అకాడమీలో చేర్పించారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ క్రమక్రమంగా భారత జట్టులో తమ స్థానాలను సంపాదించుకున్నారు.

ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ పూర్తయిన తరువాత హార్దిక్ పాండ్యా గత నెలలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. హార్దిక్ గతంలో వెన్నునొప్పికి గురయ్యాడు. దాంతో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక కాలేదు.

క్రునాల్ పాండ్యా వడోదరాలో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2021లో భాగంగా బరోడాకు నాయకత్వం వహించాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో 2 ఇన్నింగ్స్‌లలో 4 వికెట్లు తీసి 77 పరుగులు చేశాడు. క్రునాల్ బరోడాను ఎలైట్ సి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిపాడు.

మొబైల్ ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

190 ఇన్‌స్టంట్‌ రుణ యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించిన గూగుల్‌

హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసుల అభ్యర్థనపై నిబంధనలను పాటించని రుణ యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించిందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులు మొత్తం 190 యాప్‌లపై గూగుల్‌కు ఫిర్యాదు చేయగా.. ఈ యాప్‌లను తొలగించినట్లు గూగుల్‌ శనివారం హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో వాటి బారిన పడకుండా సామాన్యుడికి విముక్తి కలిగింది.

మరోవైపు ఇన్‌స్టంట్‌ రుణ యాప్‌లపై హైదరాబాద్‌ పోలీసులు వేగంగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. వారి దర్యాప్తులో కీలక సూత్రధారి ల్యాంబో చిక్కాడు.

అతడి విచారణలో మరింత సమాచారాన్ని సేకరించి.. అమాయకులను పట్టి పీడించిన పలు యాప్‌ సంస్థల బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించి.. రూ.160 కోట్లను ఫ్రీజ్‌ చేశారు.

క్రికెట్‌ బెట్టింగ్‌లను నిర్వహించిన చైనా యాప్‌ నిర్వాహకులు.. వాటిలో వచ్చిన లాభాలతో ఈ ఇన్‌స్టంట్‌ రుణయాప్‌లను నడిపిస్తున్నట్లు అనుమానిస్తున్నామని హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌ క్రైం జాయింట్‌ పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)