‘గుంటూరు జిల్లాలో టీడీపీ నేత హత్య’ - ప్రెస్ రివ్యూ

హత్య

ఫొటో సోర్స్, ANI

ప్రచురణ

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి, తెలుగుదేశం పార్టీ నేత పురంశెట్టి అంకులు (65) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారని ఈనాడు తెలిపింది.

‘‘దాచేపల్లి పట్టణంలోని ఓ అపార్టుమెంటు వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను గొంతు కోసి హతమార్చారు.

ఒక ఫోన్‌కాల్‌ రావడంతో సొంతూరి నుంచి అంకులు దాచేపల్లికి రాత్రి 7 గంటల సమయంలో వెళ్లారు.

కారును రహదారిపై నిలిపి నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటు వద్దకు ఒంటరిగా వెళ్లారు. తర్వాత కొద్దిసేపటికే మొదటి అంతస్థులో శవమయ్యారు. ఒంటరిగా వెళ్లిన అంకులు తిరిగి రాకపోయేసరికి డ్రైవరుకు అనుమానం వచ్చి అక్కడకు వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది.

కాసేపటికి తెదేపా నాయకులు అక్కడకు చేరుకొని ఆందోళన చేపట్టారు. హత్యకు నిరసనగా అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పెదగార్లపాడుకు అంకులు పదేళ్లపాటు సర్పంచిగా పనిచేశారు. ఆయన భార్య పున్నమ్మ సర్పంచిగా, కుమారుడు పరంజ్యోతి ఎంపీటీసీ సభ్యునిగా పనిచేశారు.

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఘటనా స్ధలానికి చేరుకొని హత్యపై ఆరాతీశారు. ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, పెదగార్లపాడు వైకాపా నాయకులు, పోలీసుల ప్రోద్బలంతోనే హత్య జరిగిందని యరపతినేని ఆరోపించారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం దాచేపల్లికి వస్తారని యరపతినేని చెప్పారు’’ అని ఆ కథనం వెల్లడించింది.

కరోనావైరస్ వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Reuters

'హైదరాబాద్‌లో కరోనా టీకా వేయించుకునేవారికి టైమ్ స్లాట్ల కేటాయింపు'

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునే వినియోగదారులకు టైమింగ్‌ స్లాట్‌ కేటాయించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపినట్లు ‘నమస్తే తెలంగాణ’ తెలిపింది.

టీకా వేయించుకునేవారికి వారి నివాస స్థలానికి దగ్గరలో ఉన్న కరోనా టీకా కేంద్రంలోనే వ్యాక్సినేషన్‌కు అనుమతిస్తారు.

ముందుగా నమోదు చేసుకున్నవారికి నివాస స్థలానికి సంబంధించిన పిన్‌కోడ్‌, టీకా కేంద్రం కోడ్‌, చిరునామాతో పాటు టీకా వేసే తేదీ, సమయంతో కూడిన స్లాట్‌ వివరాలను మెసేజ్‌ రూపంలో పంపిస్తామని వైద్యాధికారులు తెలిపారు.

మెసేజ్‌ వచ్చిన వారే నిర్ణీత తేదీలో స్లాట్‌ సమయానికి టీకా కేంద్రానికి వెళ్లి టీకా వేసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వెంకటి తెలిపారు.

కరోనావైరస్ వ్యాక్సిన్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాక్సీన్ ధర ప్రభుత్వానికి రూ.200..ప్రజలకు రూ.1000

ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సీన్ ధరను ఖరారు చేస్తూ సీరం ఇన్‌‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా ప్రకటన చేశారని వెలుగు దినపత్రిక తెలిపింది.

వ్యాక్సీన్‌ను ప్రభుత్వానికి రూ .200 కు, ప్రజలకు రూ.1000 అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.

సౌదీ, ఇతర దేశాలకు కరోనా వ్యాక్సీన్ ఎగుమతికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆయన చేప్పారు.

50 మిలియన్ డోసుల కోవిషీల్డ్ వ్యాక్సీన్‌ డ్రగ్ రెగ్యులేటర్ క్లియరెన్స్ పొందిందన్నారు. ఇన్నాళ్లు తాము పడిన శ్రమకు తగిన ఫలితం వచ్చిందన్నారు.

నారా చంద్రబాబునాయుడు

ఫొటో సోర్స్, @TDP

చంద్రబాబుపై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదైందని ఆంధ్రజ్యోతి తెలిపింది

విజయనగరం జిల్లా రామతీర్థం వద్ద విజయసాయిరెడ్డి కారుపై జరిగిన దాడి చంద్రబాబే చేయించారనే ఆరోపణల నేపథ్యంలో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.

చంద్రబాబుతో పాటు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులపై కేసు నమోదు చేసినట్లు‌ అధికారులు వెల్లడించారు.

ముగ్గురిపై పీడీపీపీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)