నర్సింగ్ యాదవ్ మృతి.. ముఠామేస్త్రీ, బాషా, క్షణక్షణం వంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరు - ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Facebook/Narsing yadav
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నర్సింగ్ యాదవ్ కన్నుమూశారని ‘వెలుగు దినపత్రిక’ తెలిపింది.
కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించారు.
పలు సినిమాల్లో కామెడీ, విలన్ పాత్రలు పోషించిన నర్సింగ్ యాదవ్.. తెలుగు , తమిళ, హిందీ భాషల్లో కలిపి మొత్తం 300 సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
విజయనిర్మల దర్శకత్వం వహించిన హేమాహేమీలుతో నర్సింగ్ యాదవ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. క్షణక్షణం, గాయం, ముఠామేస్త్రీ, మాస్, శంకర్ దాదా ఎంబీబీయస్, అనుకోకుండా ఒక రోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, రేసుగుర్రం, పిల్లజమీందార్, సుడిగాడు, కిక్ తదితర చిత్రాల్లో ఆయన చేసిన క్యారక్టర్‌లకు చాలా మంచి పేరు వచ్చింది.
రజినీకాంత్ నటించిన బాషాలోనూ మంచి క్యారక్టర్ చేశారు. చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీనెంబర్ 150లోనూ నటించారు. 1963 మే 15న హైదరాబాద్‌లో జన్మించిన ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు.

ఫొటో సోర్స్, BJP
కరోనావైరస్: 'మేడిన్ ఇండియా' టీకా పనులు అంతిమ దశలోకి.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి
ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమానికి భారత్ సర్వసిద్ధంగా ఉందని, ఆ పనులు అంతిమ దశలో ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నట్లు ఈనాడు తెలిపింది.
దేశీయంగా తయారైన టీకా, ప్రజలందరికీ త్వరలోనే అందుబాటులో రానుందని మోదీ వెల్లడించారు. గురువారం మోదీ రాజ్‌కోట్‌లో ఎయిమ్స్ ఆస్పత్రికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేస్తూ 2020లో కరోనా చూపిన ప్రభావం, టీకా తయారీలో భారత్ సన్నద్ధత గురించి మాట్లాడారు.
మహమ్మారి కారణంగా 2020లో నిరాశపూరిత వాతావరణం అలముకుంటే, 2021 చికిత్స అనే ఆశను మోసుకొస్తోందని అన్నారు. దేశ ప్రజలందరికీ ‘మేడిన్ ఇండియా’ టీకా అందుబాటులోకి వస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు.
టీకాపై పుకార్లను నమ్మొద్దని ప్రజలకు పిలుపిచ్చారు. ఇప్పటికే దుష్ప్రచారం చేసే పనిలో కొందరు నిమగ్నమయ్యారని. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎప్పటివరకు మందు రాదో, అప్పటివరకు ఊరటలేదని తాను చెబుతూ ఉండేవాడినని, ఇప్పుడు మందు వచ్చిందని, అయితే అప్రమత్తత వీడొద్దని ప్రజలకు ప్రధాని సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
మరో ఐదుగురికి కొత్త వైరస్
దేశంలో గురువారం మరో ఐదుగురికి కరోనా కొత్త స్ట్రెయిన్ నిర్ధారణ అయిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.
పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్ (ఎన్‌ఐవీ)కి పంపిన నమూనాల్లో నాలుగింటిలో, ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటరాగేటివ్ బయోలజీ (ఐజీఐబీ)కి పంపిన నమూనాల్లో ఒకదాంట్లో కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు. దీంతో మొత్తం సంఖ్య 25కు చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మరోవైపు దేశంలో బుధవారం 21,822 మందికి కరోనా నిర్ధారణ అయింది. 299 మంది చనిపోయారు. కాగా, దేశంలో యాక్టివ్ కేసులు 2.57 లక్షలకు తగ్గాయి.
కొత్త సంవత్సర వేడుకలు కరోనా వ్యాప్తికి కారణం కాకుండా చూడాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ‘భారత్‌లో తయారీ’ స్ఫూర్తితో వెంటిలేటర్ల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని.. సంవత్సరం వ్యవధిలో ప్రభుత్వ ఆస్పత్రులకు 36,433 వెంటిలేటర్లు సరఫరా చేసినట్లు కేంద్రం ప్రకటించింది. కొవిడ్‌కు పూర్వం అన్ని ఆస్పత్రుల్లో 16 వేల వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
నేటి నుంచి మళ్లీ జియో ఉచిత కాల్స్
ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్లకు నూతన సంవత్సర కానుకను ప్రకటించిందని నమస్తే తెలంగాణ తెలిపింది. కొత్త సంవత్సరంలో మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
ఇకపై జియో కస్టమర్లు దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జి (ఐయూసీ) విధానం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది.
‘ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత కాల్స్‌ను పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడే ఉన్నాం. 2021 జనవరి 1 నుంచి జియో వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు’ అని రిలయన్స్ జియో గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా తమ అన్‌లిమిటెడ్ ప్యాక్ యూజర్లకు జనవరి 1 నుంచి ఉచితంగా వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేయనున్నట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- వెలగపూడిలో మాల వర్సెస్ మాదిగ: మధ్యలో చిక్కుకున్న అంబేడ్కర్-జగ్జీవన్ రాం
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- నార్వే: జీతాల దాపరికంలేని దేశం
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- కరోనావైరస్ చరిత్రను చైనా ప్రభుత్వం తనకు అనుకూలంగా రచించుకుంటోందా?
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- ‘మా ఇంట్లో అమిత్ షా భోంచేశారు, కానీ నాతో మాట్లాడలేదు’
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు· "జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























