‘‘లాక్‌డౌన్ నా భార్య, కూతురు ప్రాణాలను తీసింది. మా బతుకులు తలకిందులు అయ్యాయి’’

ఫొటో సోర్స్, Ritesh Uttamchandani
కరోనావైరస్‌కు కళ్లెం వేసేందుకు మార్చి 24న దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పుడు తన జీవితం తలకిందులు అవుతుందని రాజన్ యాదవ్ అసలు ఊహించలేదు.
ఆ సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రాజన్ ఉన్నారు. వేల మంది తమ కలలు సాకారం చేసుకోవడానికి ఇక్కడకు వస్తుంటారు.
రాజన్ కథ కూడా అలాంటిదే.
పదేళ్ల క్రితం భార్య సంజుతో ఆయన ఇక్కడకు వచ్చారు. తన 11 ఏళ్ల కొడుకు నితిన్, ఆరేళ్ల కూతురు నందినిలను చూసుకునేందుకు సంజు ఇంట్లోనే ఉండేవారు. రాజన్ ఇంటికి సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవారు.
2017లో బ్యాంకు లోన్ తీసుకుని వీరు ఆటో కొనుక్కొన్నారు. అప్పటి నుంచి వీరి జీవితం సాఫీగా సాగిపోయేది. పిల్లలకు బంగారు భవిష్యత్ ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో కూడా చేర్పించారు.
అయితే, రెండేళ్ల తర్వాత అదే ఆటోలో తన భార్య, కుమార్తె మృతదేహాలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని రాజన్ అనుకోలేదు.

ఫొటో సోర్స్, Ritesh Uttamchandani
ఈ ప్రమాదానికి కారణం తన నిర్ణయమేనని రాజన్ బాధపడుతున్నారు. అయితే, ఆయనకు అప్పుడు వేరే మార్గం కూడా కనిపించలేదు.
మార్చి, ఏప్రిల్ నెలల్లో తమ దగ్గరున్న డబ్బులతో వీరు ఇంటి అద్దె, లోన్ కట్టుకోవడంతోపాటు ఇంట్లోకి సరకులు కొనుక్కున్నారు. మే నెలలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారని వీరు భావించారు. కానీ అలా జరగలేదు. మళ్లీ లాక్‌డౌన్ పొడిగించారు.
అయితే, వీరి దగ్గరున్న డబ్బులు అడుగంటిపోయాయి. దీంతో ఉత్తర్ ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ జిల్లాలోని తమ గ్రామానికి వెళ్లిపోదామని వీరు నిర్ణయించుకున్నారు. వలసదారుల కోసం ప్రత్యేకంగా నడిపిన రైళ్లలో టికెట్ల కోసం వరుసగా వారం రోజులు వీరు దరఖాస్తు చేసుకున్నారు. కానీ టికెట్లు దొరకలేదు.
బాగా అలసిపోయిన తర్వాత, 1,500 కి.మీ. దూరం ఆటోలోనే వెళ్లిపోవాలని వీరు నిర్ణయించుకున్నారు. చివరగా మే 9న ముంబయి నుంచి బయలుదేరారు.
మూడు రోజుల తర్వాత, ఇంటికి కేవలం 300 కి.మీ. దూరంలో ఉండగా తమ ఆటోను ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో సంజు, నందిని అక్కడికక్కడే మరణించారు.

ఫొటో సోర్స్, Ritesh Uttamchandani
చాలామంది ఇలానే...
లాక్‌డౌన్ నడుమ దేశంలోని ప్రధాన నగరాలను విడిచి సొంత ఊళ్లకు వెళ్లే క్రమంలో చాలా మంది వలసదారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.
ఆంక్షలతో ఆదాయాన్ని కోల్పోవడం, దాచుకున్న డబ్బులు అయిపోవడంతో వలస కార్మికులకు ఆనాడు వేరే మార్గం కనిపించలేదు. రవాణా సదుపాయాలను కూడా నిలిపివేయడంతో.. చాలా మంది సైకిళ్లు, ఆటోలు, లారీలు, నీళ్ల ట్యాంకీలు, పాల వ్యాన్లపై ప్రమాదకరంగా సొంత ఊళ్లకు బయలుదేరారు. కొందరైతే నడుచుకుంటూ కూడా ప్రయాణమయ్యారు.
కోవిడ్-19తో డాక్టర్లు ఆసుపత్రుల్లో పోరాడుతుండగా.. రోడ్లపై వలస కార్మికులు తమ జీవితాలను పణంగా పెడుతూ చావుబతుకుల పోరాటమే చేశారు.
సొంత ఊళ్లకు వెళ్లే క్రమంలో చిన్న పిల్లలను ఎత్తుకుని ఇబ్బంది పడుతున్న, గర్భిణులు నడుస్తున్న చిత్రాలు చాలా మందికి కళ్లలో నీరు తెప్పించాయి.
వలస కార్మికులపై కథనం రాయడంలో భాగంగా దిల్లీ విడిచి వెనక్కి వెళ్తున్న ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబాన్ని బీబీసీ బృందం కలిసింది. వీరిలో ముగ్గురు పిల్లలున్నారు. వీరు పాడైన సైకిల్‌పై ఎండలో ఇంటికి వెళ్తూ కనిపించారు.

ఫొటో సోర్స్, Ritesh Uttamchandani
ఆకలి భయంతో...
తన కుటుంబం ఆకలితో అలమటిస్తుందనే భయంతో ముంబయిని వదిలిపెట్టాలని రాజన్ నిర్ణయం తీసుకున్నారు. వెళ్లేటప్పుడు వారు సరిపడా ఆహారాన్ని తమతో తీసుకెళ్లారు. ఆటోపై సొంత ఊరికి వెళ్తున్నామని, జాగ్రత్తగా ఉండాలని పిల్లలకు సంజు చెప్పిన సంగతిని రాజన్ గుర్తుచేసుకున్నారు.
రోజూ ఉదయం 5 నుంచి 11 వరకు రాజన్ ఆటో నడిపేవారు. ఆ తర్వాత సాయంత్రం ఆరు వరకు విరామం తీసుకొనేవారు. మళ్లీ రాత్రి 11 వరకు ఆటో నడిపేవారు. ఇది చాలా కష్టమైన ప్రయాణం. కానీ ముంబయిలోనే ఉంటే మనుగడకే ముప్పని భావించి ప్రాణాలనే పణంగా పెట్టి వారు ముందుకు వెళ్లారు.
అయితే, కేవలం రాజన్, నితిన్ మాత్రమే తమ గ్రామానికి చేరుకోగలిగారు. తర్వాత కొన్ని రోజులపాటు వీరికి ఏం చేయాలో కూడా తెలియలేదు.
‘‘ఇదంతా ఏదో కలలా అనిపించేది. కానీ ఇది నిజమని నా కొడుకు గుర్తుచేసేవాడు’’అని రాజన్ గుర్తు చేసుకున్నారు.
చాలాసార్లు అమ్మ, చెల్లి ఎక్కడున్నారని నితిన్ అడిగే ప్రశ్నలకు రాజన్ దగ్గర సమాధానాలు కూడా ఉండేవికాదు. ముంబయిలో ఇదివరకటిలా మన జీవితాలు ఉండబోవని నితిన్‌కు ఆయన చెప్పలేకపోయేవారు.
రాజన్ పొలాల్లో పనిచేస్తూ, తన సోదరులకు సాయం చేస్తూ గడిపేవారు. చాలా సమయం చెట్టుకింద కూర్చొని ఆకాశంలోకి చూస్తూ ఉండిపోయేవారు.
ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేవారు కాదు. రాజన్ తల్లిదండ్రులు తన కొడుకుని చూసుకునేవారు.
‘‘ఇంత హడావిడిగా ఎందుకు ముంబయిని వదలి ప్రయాణం అయ్యాను? లాక్‌డౌన్ సమయంలో డబ్బుల కోసం నేను తీవ్రంగా ప్రయత్నించానా? ఇలా ఎన్నో ప్రశ్నలు నన్ను వెంటాడుతూ ఉండేవి’’అని ఆయన చెప్పారు.
అలానే, మూడు నెలలు గడిచిపోయాయి. రాజన్ మానసిక ఆరోగ్యం గురించి ఆయన తల్లిదండ్రులు బాధపడేవారు. అయితే కొడుకు అడిగిన ఓ ప్రశ్న రాజన్‌లో కొత్త ఆలోచనలకు కారణమైంది.
‘‘నాన్న..నేను డాక్టర్ అవ్వాలని అమ్మ చెప్పేది. ఆ కల సాధ్యం అవుతుందా? నన్ను ఈ గ్రామంలోనే వదిలేస్తావా?’’అని నితిన్ ప్రశ్నించినట్లు రాజన్ వివరించారు.

ఫొటో సోర్స్, Ritesh Uttamchandani
మానసిక ఆరోగ్యంపై ప్రభావం..
పిల్లల చదువుకు తొలి ప్రాధాన్యం ఇస్తానని సంజుకు ఇచ్చిన మాట వెంటనే రాజన్‌కు గుర్తుకువచ్చింది.
నితిన్‌పై సరిగా దృష్టిపెట్టడంలేదని అప్పుడే రాజన్‌కు అర్థమైంది. తన కొడుకు భవిష్యత్ గురించి ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. కానీ ముంబయికి తిరిగి వెళ్లాలని అప్పుడు ఆయన అనుకోలేదు.
‘‘అసలు నేను అలా ఎలా ఆలోచించగలను? నా జీవితంలో సగం పాత్ర ఆమెదే. ఆమె వళ్లే నేను ముంబయికి వచ్చాను. ఆమె లేకుండా అక్కడ నాకు జీవితమే లేదు’’అని రాజన్ చెప్పారు.
మరోవైపు తనకు జీవనాధారమైన ఆటో కూడా పూర్తిగా దెబ్బతింది. దానికి మరమ్మతులు చేయించడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు.
అయితే, సంజుకు ఇచ్చిన మాటను ఎలాగైనా నిలబెట్టుకోవాలని రాజన్ నిర్ణయించుకున్నారు. సాయం చేయాలని స్థానిక రాజకీయ నాయకులు, అధికారులను ఆయన కలిశారు. కానీ ఎలాంటి ఫలితమూ లభించలేదు.
సంజు నగలు అమ్మి ఆటోను బాగు చేయించాలని తన తల్లిదండ్రులు చెప్పారు. కానీ అలా చేయడానికి రాజన్‌కు ఇష్టపడలేదు. ఎందుకంటే తాము సంతోషంగా గడిపిన క్షణాలను ఆ నగలు గుర్తుచేసేవి.
‘‘చివరి గుర్తులను కూడా అమ్మకానికి పెట్టినట్లు అనిపించేది. సంజును అవి గుర్తుచేసేవి’’.
అయితే, నితిన్‌కు మంచి చదువు చెప్పించేందుకు కృషి చేస్తానని సంజుకు ఇచ్చిన మాటను ఆయన పదేపదే గుర్తుచేసుకున్నారు.
‘‘మా కష్టాలు పిల్లల చదువును ప్రభావితం చేయకూడదని సంజు చెప్పేది’’.

ఫొటో సోర్స్, Ritesh Uttamchandani
మళ్లీ ఆటో నడుపుకుంటూనే..
ఎట్టకేలకు ఆయన ఆటోకు మరమ్మతులు చేయించగలిగారు. అయితే, దాన్ని ముంబయికి పంపేందుకు ఆయన దగ్గర డబ్బులులేవు.
తన ముందున్న ఏకైక మార్గం మళ్లీ ఆటోను వెనక్కి నడుపుకుంటూ వెళ్లడమే. ప్రమాద సమయంలో ఆటో నుంచి వచ్చిన పెద్ద శబ్దం ఇప్పటికీ తనకు గుర్తుకు వస్తుంటుంది.
‘‘అది ఏదో మానసిక యుద్ధం చేస్తున్నట్లు అనిపించేది. ఆటోను ఆత్మవిశ్వాసంతో నడుపుతున్నట్లు నటించేవాణ్ని’’అని ఆయన వివరించారు.
వారాలపాటు ఆలోచించిన తర్వాత మళ్లీ నితిన్‌తో ముంబయికి వెళ్లాలని నవంబరులో ఆయన నిర్ణయం తీసుకున్నారు. ‘‘ప్రమాదం జరిగిన మార్గాన్ని వదిలిపెట్టి వేరే వైపు నుంచి నేను ముంబయి చేరుకున్నాను. కానీ సంజు, నందిని లేని లోటు నాకు బాగా తెలుస్తోంది’’అని రాజన్ చెప్పారు.
ప్రయాణ సమయంలో నితిన్ చాలా పరిణితితో నడుచుకున్న తీరును రాజన్ గుర్తుకు చేసుకున్నారు. ‘‘నాన్న నువ్వు ఎలా ఉన్నావు? అని తను మళ్లీమళ్లీ అడిగేవాడు. అంతా బాగైపోతుందని చెప్పేవాడు. వాడికి సంజునే ప్రపంచం. కానీ ఇప్పుడు వాడికి నేను మాత్రమే మిగిలాను’’అని ఆయన చెప్పారు.
‘‘తనకు సంజు ఇవ్వాలనుకునే మంచి జీవితాన్ని ఎలాగైనా నేను ఇస్తాను. వాడికి కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను’’.
నాలుగు రోజుల ప్రయాణం అనంతరం నితిన్‌తో రాజన్ ముంబయి చేరుకున్నారు. ఉండటానికి ఒక ఇల్లు చూసుకోవడంపై వీరు మొదట దృష్టిపెట్టారు.
ఓ స్నేహితుడు తన అద్దె ఇంట్లో ఒక గదిలో ఉండమని వీరికి ఆశ్రయమిచ్చాడు. రద్దీగా ఉండే ముంబయిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకోవడమంటే మాటలు కాదు.
మొదటి కొన్నిరోజులు వీరికి చాలా కష్టంగా ఉండేది. సంజు లేకుండా ఇక్కడ బతకడం ఎంత కష్టమోనని రాజన్‌కు చాలా భయమేసేది.
చివరగా ఇక గదిని ఆయన అద్దెకు తీసుకున్నారు. అయితే, ఇది పూర్తి ఇల్లు కాదు. రోజులో చాలావరకు ఆ గదిలోనే ఆయన ఉండేవారు. ఎందుకంటే ఇక్కడ కరోనావైరస్ కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. తన జీవితాన్ని మరోసారి పణంగా పెట్టాలని ఆయన అనుకోలేదు.

ఫొటో సోర్స్, Ritesh Uttamchandani
అయితే, ఆయన తెచ్చుకున్న డబ్బులు నెమ్మదిగా అయిపోయాయి. దీంతో ఆటోను మళ్లీ నడిపించాలని ఆయన నిర్ణయం తీసుకొన్నారు.
ఇక్కడ ఆకలి, కరోనాభయం మధ్య యుద్ధమే జరిగుతుంది. అయితే, చివరికి ఆకలే విజయం సాధిస్తుంది. చాలా మంది వసల కార్మికులకు ఇంటిలో కూర్చుంటే తిండి కూడా ఉండదు.
మొదట కొన్ని రోజులపాటు రాజన్ ఆటోలో ఎవరూ ఎక్కేవారు కాదు. చాలా మంది ప్రభుత్వ రవాణా సాదుపాయాల వైపే మొగ్గుచూపేవారు. దీంతో ఆయనకు పెద్దగా ఆదాయం వచ్చేదికాదు.
నితిన్ ఆన్‌లైన్ క్లాస్‌లకు కూడా ఆ డబ్బులు సరిపోయేవికాదు. మరోవైపు ఇంటిపనులు కూడా ఆయనే చూసుకోవాల్సి వచ్చేది. ‘‘సంజు అన్ని పనులు చూసుకునేది. నేను కేవలం డబ్బులు సంపాదించడానికి ఆటో తొక్కేవాణ్ని’’.
కానీ ఇప్పుడు వంట చేసేందుకు రోజు ఉదయం ఆరు గంటలకు రాజన్ నిద్ర లేస్తున్నారు. వంట తర్వాత హోం వర్క్ చేయడంలో నితిన్‌కు ఆయన సాయం చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు నితిన్ ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరయ్యేలా చూస్తున్నారు.

ఫొటో సోర్స్, Ritesh Uttamchandani
తొమ్మిది తర్వాత ఆటో నడుపుతున్నారు. మధ్యాహ్నం భోజనం కోసం మళ్లీ ఆయన ఇంటికి వస్తున్నారు. సాయంత్ర మళ్లీ ఆటోతో వెళ్లి అర్ధరాత్రి తర్వాతే వస్తున్నారు.
రాజన్ ఇంటిలో లేనప్పుడు ఇరుగుపొరుగు వారు నితిన్‌ను చూసుకుంటున్నారు.
‘‘ప్రయాణికుల కోసం ఎదురుచూస్తూనే చాలా సమయం గడిచిపోతోంది. కొన్నిసార్లు కొంతవరకు సంపాదించగలుగుతున్నా. ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఆటో ఎక్కిన రోజులు చాలా ఉన్నాయి’’.
పరిస్థితులు మళ్లీ మునుపటిలా మారాలని ఆయన ఎదురుచూస్తున్నారు. కోవిడ్-19 వ్యాక్సీన్ ఆయనలో ఆశలు చిగురింపచేస్తోంది. అయితే దీనిపై ఆయనకు చాలా సందేహాలు కూడా ఉన్నాయి.
‘‘నా లాంటి పేద ప్రజలకు వ్యాక్సీన్ ఇస్తారా? రోజూ నా జీవితాన్ని పణంగా పెట్టి ఆటోను నడుపుతున్నాను. నాకు కరోనావైరస్ సోకితే నా కొడుకు ఏమైపోతాడు. నా లాంటి పేదవారి కోసం ఎవరైనా ఆలోచిస్తారని అనిపించడంలేదు. లాక్‌డౌన్ విధించే సమయంలోనూ మమ్మల్ని పట్టించుకోలేదు. అప్పుడే ఎవరైనా ఆలోచించి ఉంటే.. సంజు, నందిని బతికుండేవారు’’అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఈ గవర్నమెంటు స్కూల్‌లో సీట్లు లేవు
- బెంగాల్‌తో తెలుగువారికి ఉన్న అనుబంధం ఏంటో తెలుసా?
- సిలికాన్ వాలీ తల్లిదండ్రులు తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచుతున్నారు.. ఎందుకు?
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- బాయ్‌ఫ్రెండ్ వల్ల గర్భం వచ్చింది.. భర్తకు తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తర్వాత...
- ‘మర్చంట్ ఆఫ్ డెత్’: దేశాల మధ్య శత్రుత్వం పెంచి ఆయుధాలు విక్రయించి ధనవంతుడైన వ్యాపారి
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- అప్పు త్వరగా తీర్చేయాలని పాకిస్తాన్‌ను సౌదీ ఎందుకు అడుగుతోంది?
- అనిల్‌కపూర్ : పెద్ద హీరోలు వద్దన్న పాత్రలు చేయడానికి ఏ మాత్రం సిగ్గుపడని హీరో
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
























