తెలంగాణ.. కోటిన్నర కోవిడ్ వ్యాక్సీన్లు వేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం: ప్రెస్ రివ్యూ

కరోనా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రచురణ

తెలంగాణలో కోటిన్నర కరోనా టీకాలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోందని ఈనాడు వార్తాపత్రిక కథనం ప్రచురించింది.

తెలంగాణలో లక్షిత ప్రజలకు కొవిడ్‌ టీకా వేయడంపై తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

టీకా అందుబాటులోకి రాగానే.. యుద్ధప్రాతిపదికన అందించడానికి సర్కారు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది.

దీనిపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) వద్ద ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో పలు అంశాలపై లోతుగా చర్చించారు.

తొలివిడతలో దేశవ్యాప్తంగా 30 కోట్ల జనాభాకు టీకా వేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల నుంచి 75 లక్షల మందికి తొలివిడతలో టీకా వేసే అవకాశాలున్నట్లు సర్కారు భావిస్తోందని ఈనాడు రాసింది.

నిర్దేశించిన వ్యక్తులకు 2 డోసుల చొప్పున 3-4 వారాల వ్యవధిలో ఇవ్వాలి. ఈ లెక్కన రాష్ట్రానికి సుమారు కోటిన్నర డోసులు రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది.

టీకాలు వేసేందుకు రాష్ట్రం మొత్తమ్మీద 10 వేల బృందాలను ఏర్పాటు చేస్తారు. నర్సు.. ఏఎన్‌ఎం.. ఆశా కార్యకర్త.. ఇలా ఒక్కో బృందంలో ఈ ముగ్గురూ ఉంటారు.

ఒక్కో బృందం రోజుకు 100 మందికి టీకాలిస్తుంది. ఈ బృందాలు ఒక్క రోజులో లక్ష మందికి.. వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల మందికి టీకాలు వేస్తాయి.

చూస్తుండగానే లక్షిత ప్రజలకు కొవిడ్‌ టీకా తొలి డోసు పూర్తవుతుంది. మరో 3-4 వారాల వ్యవధిలో రెండో డోసు టీకాకు కూడా ఇదే కార్యాచరణ ఉంటుంది.

కొవిడ్‌ టీకాలను నిల్వ ఉంచడం అత్యంత ప్రాధాన్యాంశం కావడంతో.. ప్రభుత్వం అతి శీతల యూనిట్‌లను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేస్తున్నట్లు ఈనాడు వివరించింది.

ప్రకాశం బ్యారేజీ

కృష్ణా నదిపై మూడు కొత్త బ్యారేజీల నిర్మాణం

కృష్ణా నదిపై మరో మూడు బ్యారేజీలు కట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సాక్షి పత్రిక కథనం ప్రచురించింది.

కృష్ణా డెల్టా పరిధిలోని 13.08 లక్షల ఎకరాలకు సమర్థంగా నీరందించడంతో పాటు.. డెల్టా పరిరక్షణే లక్ష్యంగా కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సముద్రంలో కలుస్తున్న కృష్ణా వరద జలాలను ఒడిసి పట్టేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించాలని జలవనరుల శాఖను ప్రభుత్వం ఆదేశించింది.

ప్రకాశం బ్యారేజీ దిగువన చోడవరం–రామచంద్రాపురం మధ్య రూ.1,215 కోట్లతో, బండికొల్లంక–రావిఅనంతవరం మధ్య రూ.1,350 కోట్లతో బ్యారేజీల నిర్మాణానికి ఇప్పటికే సర్కార్‌ ఉత్తర్వులిచ్చిందని పత్రిక రాసింది.

కృష్ణా డెల్టాలో సకాలంలో ఖరీఫ్‌ పంటల సాగుకు నీరందించేందుకు దివంగత సీఎం వైఎస్సార్‌ 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు.

డెల్టాకు మరింత సమర్థంగా నీరందించేందుకు ప్రకాశం బ్యారేజీకి ఎగువన.. పులిచింతలకు దిగువన పది టీఎంసీల సామర్థ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు.

ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకూ 1,235.27 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయని సాక్షి వివరించింది.

పులి

పులులను పట్టేసేందుకు చర్యలు

తెలంగాణలో మనుషులపై దాడి చేస్తున్న పెద్ద పులులను పట్టుకునేందుకు ప్రభుత్వం వ్యూహంతో వెళ్తోందని నమస్తే తెలంగాణ పత్రిక కథనం ప్రచురించింది.

మనుషులపై పెద్దపులుల దాడులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ అటవీ అధికారులతో సమన్వయం చేసుకొంటున్నది.

విస్తృతంగా కెమెరాట్రాప్‌ల ఏర్పాటు, టైగర్‌ ట్రాకర్‌ బృందాలను నియమించడంతోపాటు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో దండోరా వేయిస్తున్నది.

మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్‌ అటవీ అధికారులతో పులుల వలసపై ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

కవ్వాల్‌ అభయారణ్యంలో సాగుతున్న ‘మ్యాన్‌ ఈటర్‌ టైగర్‌ ఆపరేషన్‌' తీరును అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌ శోభ సోమవారం స్వయంగా పరిశీలించనున్నారు.

ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లో అటవీశాఖ అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.

పులిదాడిలో నెల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో అటవీశివారు గ్రామాలను అప్రమత్తం చేశారు. కొండాపూర్‌, బెజ్జూరులో అదనంగా 31 కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.

మహారాష్ట్ర సరిహద్దుల నుంచి వస్తున్న పెద్దపులు లు ఎన్ని? వాటిలో నరభక్షక పులులున్నాయా? అన్న దిశగా ఆరా తీస్తున్నారు.

చంద్రాపూర్‌ పరిధిలోనే దాదాపు 4 నుంచి 5 పెద్దపులులు నరమాంసానికి అలవాటు పడినట్టు తెలుస్తున్నది. రెండేండ్లుగా మ్యాన్‌ ఈటర్‌ పులుల సంఖ్య పెరుగుతున్న ట్టు అక్కడి అధికారులు అంగీకరిస్తున్నారని నమస్తే తెలంగాణ చెప్పింది.

పెద్దపులుల పంజాకు ఒక్క చంద్రాపూర్‌ పరిసరాల్లోనే 21 మంది బలైనట్టు లెక్కలున్నాయి. ఈ క్రమం లో మూడు రాష్ర్టాలను కలుపుతూ ఉన్న టైగర్‌ కారిడార్లలో పెట్రోలింగ్‌ పెంచడం, ఉమ్మడిగా బేస్‌ క్యాంపుల ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నారని పత్రిక వివరించింది.

అలియా భట్

ఫొటో సోర్స్, Alia Bhatt/FB

'ఆర్ఆర్ఆర్' కోసం హైదరాబాద్‌కు అలియా భట్

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ హైదరాబాద్ చేరుకుందని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ ఎప్పుడు అడుగుపెడుతుందా అని చిత్ర బృందంతోపాటు అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. అలియాభట్‌ సోమవారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో అడుగుపెట్టనున్నారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఇటీవల పుణెలో వారంరోజులు షెడ్యూల్‌ పూర్తి చేసుకొచ్చిన రాజమౌళి టీమ్‌ సోమవారం ఉదయం రామోజీ ఫిల్మ్‌ సిటీలో తాజా షెడ్యూల్‌ ప్రారంభించనున్నారని ఆంధ్రజ్యోతి చెప్పింది.

ఆర్ఎఫ్‌సీలోని ‘చంద్రముఖి’ హౌస్‌లో తీసే కీలక సన్నివేశాలతో అలియా సెట్‌లో అడుగుపెట్టనున్నారనీ, హీరో రామ్‌చరణ్‌, అలియాపై సీన్స్‌ తీయబోతున్నారని సమాచారం.

ఇప్పటికే చంద్రముఖి సెట్‌లో షూటింగ్‌కు సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయని తెలిసింది.

ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ నటిస్తుండగా, ఆయనకు జోడీగా అలియాభట్‌ నటిస్తున్నారు. కొమురం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌కు జోడీగా ఓలీవియా మోరీస్‌ కనిపిస్తారని పత్రిక వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)