వైఎస్ జగన్: 'నా తండ్రి ప్రారంభించిన పోలవరాన్ని పూర్తి చేయడం కొడుకుగా నా బాధ్యత' - ప్రెస్‌ రివ్యూ

ప్రచురణ

తండ్రి ప్రారంభించిన ప్రాజెక్టును పూర్తి చేయడం కొడుకుగా తన బాధ్యతని, అందువల్ల పోలవరాన్ని తానే పూర్తి చేస్తానని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రకటించినట్లు సాక్షి పత్రిక వెల్లడించింది.

2022నాటికి ఖరీఫ్‌కు నీళ్లందిస్తామని బుధవారంనాడు శాసనసభలో పోలవరం ప్రాజెక్టు వ్యవహారంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వ చేసిన పాపాలను కడిగేస్తున్నామని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా మార్చుకున్నారని, ప్రధాని మోదీ కూడా ఇక్కడ జరిగిన అవినీతి గురించి ప్రస్తావించారని సీఎం జగన్‌ గుర్తు చేసినట్లు సాక్షి రాసింది.

అయితే పోలవరం చర్చ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అవగాహన రాహిత్యంతో జగన్‌ రాష్ట్ర పాలనను ప్రమాదంలోకి నెడుతున్నారని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించినట్లు సాక్షి తెలిపింది. పోలవరంపై మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా టీడీపీ శాసనసభ్యులు సభ నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొంది.

ఏపీలో పరిస్థితి చేయి దాటిపోతోంది - కేంద్ర ఆర్ధికమంత్రి సురేశ్‌ ప్రభు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థల నిధులను ఎన్నికల ప్రయోజనాల కోసం దారి మళ్లిస్తున్నారని, పరిస్థితులు చేయిదాటక ముందే తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని కేంద్ర మాజీ మంత్రి, ఏపీ నుంచి ఎన్నికైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేశ్‌ ప్రభు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసినట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

తన లేఖకు ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌ నరేశ్‌ కుమార్‌ తనకు రాసిన లేఖను కూడా సురేశ్‌ ప్రభు జత చేసినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

ఈ కథనం ప్రకారం ఉచిత పథకాల ద్వారా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం తన ఆధ్వర్యంలోని కార్పొరేషన్ల నిధులను దారి మళ్లిస్తోందని సురేశ్‌ ప్రభు తన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, ప్రభుత్వ రుణ చెల్లింపు సామర్ధ్యాన్ని నిత్యం తనిఖీ చేస్తూ ఉండాలని సురేశ్ ప్రభు కేంద్ర ఆర్ధికమంత్రికి సూచించారు.

నరేశ్‌ కుమార్‌ సూచనలను పరిశీలించి, రాష్ట్రలో పరిస్థితులు అదుపు తప్పక ముందే నియంత్రణ చర్యలు తీసుకోవాలని సురేశ్‌ ప్రభు తన లేఖలో సూచించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నవారంతా క్వారంటైన్‌కు....

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలంతా వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరక్టర్‌ శ్రీనివాసరావు సూచించినట్లు నమస్తే తెలంగాణ పత్రిక రాసింది.

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు, కార్యకర్తల్లో ఎరికైనా కరోనా అనుమానాలుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, రాష్ట్రంలో రెండో దశ( సెకండ్‌ వేవ్‌) కరోనాకు కారణం కావద్దని ఆయన హెచ్చరించినట్లు ఈ కథనం పేర్కొంది.

ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని, రెండో దశలోకి వెళ్లకుండా అందరూ జాగ్రత్తలు పాటించాలని శ్రీనివాసరావు సూచించినట్లు ఈ కథనం పేర్కొంది.

మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారు రెండు నెలల తర్వాత ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని వైద్య విద్య సంచాలకులు రమేశ్‌ రెడ్డి వెల్లడించినట్లు కూడా నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.

కోవిడ్‌ సోకిన వారంతా 3 నెలలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని ఆయన సూచించినట్లు ఈ కథనం తెలిపింది.

విందులో కూర వివాదం - ఒకరి హత్య-రూ.7.50 లక్షలకు ఒప్పందం

పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన విందు భోజనంలో వివక్ష చూపారంటూ అబ్బాయి తరఫువారు అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యవహారం చివరకు వివాదంగా మారి హత్యకు దారి తీసినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాసింది.

భువనగిరి యాదాద్రి జిల్లా దాచారంలో జరిగిన ఈ ఘటనలో అబ్బాయి తరఫువారి మధ్యే గొడవ జరిగి చివరకు హత్య వరకు వెళ్లింది. పాకాలలో పెళ్లి కూతురు ఇంటికి వచ్చిన పెళ్లి కొడుకు తరఫు బంధువులు విందులో మాంసం కూర వడ్డింపులో వివక్ష చూపిస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

పెళ్లి కొడుకు తరఫు బంధువులలోనే చంద్రయ్య అనే కులపెద్దతో వెంకటయ్య అనే వ్యక్తి గొడవపడ్డారు. బంధువులు సర్దిచెప్పడంతో అప్పటికి ఆగినా రాత్రి దాచారంలో పెళ్లి సందర్భంగా ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.

ఈ ఘర్షణలో చంద్రయ్య కుమారులైన పరుశురామ్‌, నాగరాజులపై వెంకటయ్య, మరికొందరు బంధువులు దాడి చేశారు. వెంకటయ్య బంధువులలో ఒకరు గొడ్డలితో దాడి చేయడంతో పరుశు రాములు అనే యువకుడు మృతి చెందాడు. నాగరాజు అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే ఈ వ్యవహారం కేసు కాకుండా ఉండేందుకు ఇరువర్గాల మధ్య రూ. 7.50 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)