దిల్లీలో రైతుల ఆందోళన: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండోరోజూ కొనసాగుతున్న నిరసన

సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు వరసగా రెండోరోజూ కొనసాగుతున్నాయి.
శుక్రవారం(నవంబర్ 27న) ఉత్తరప్రదేశ్ రైతులు కూడా రోడ్లపైకి వస్తారని, అన్ని జాతీయ రహదారులు దిగ్బంధిస్తారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికైత్ చెప్పారు.
రోడ్డుపైనే వంటలు చేసుకోడానికి వీలుగా రైతులు తమ ట్రాక్టర్లలో సరుకులు తీసుకుని హైవేలపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
"వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా మేం దేశంలోని రైతులకు అండగా నిలుస్తున్నాం. ఇది దేశంలోని రైతులందరి డిమాండ్" అన్నారు.
ప్రభుత్వం ఎంఎస్‌పీని చట్టంలో భాగంగా చేయాలి. అప్పుడే రైతులు రోడ్లపైనుంచి పక్కకు వెళ్తారు. లేదంటే రైతులందరూ రహదారులపైకి వచ్చి దిల్లీకి వళ్తారు అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
దిల్లీ వైపు వెళ్తున్న రైతులు, అడ్డుకుంటున్న అధికారులు
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడానికి దిల్లీవైపు వెళ్లాలని ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకోడానికి దిల్లీ-హరియాణా సరిహద్దుల్లో పోలీసులను మోహరించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు గస్తీ కాస్తున్నారు.
రైతుల ఒక సమూహం బ్యారికేడ్లు పెట్టిన సింధు బార్డర్ దాటిందని బీబీసీ ప్రతినిధులు దిల్‌నవాజ్ పాషా, పీయూష్ నాగ్‌పాల్ తెలిపారు.

రైతులను అడ్డుకోడానికి పోలీసులు రాజధాని సరిహద్దులో ప్రతిదగ్గరా భారీగా బ్యారికేడ్లు పెట్టారు. కానీ, కొన్నిచోట్ల రైతులు వాటిని తొలగించి ముందుకు వెళ్తున్నారు.
అయితే చాలా ప్రాంతాల్లో పోలీసులు కదిలించడానికి వీలు లేనంతగా భారీగా అడ్డంకులు ఏర్పాటుచేశారు. వాటిని తొలగించలేకపోతున్నప్పటికీ, నినాదాలు చేస్తున్న రైతులు, ముందుకు కదిలేందుకు ప్రయత్నిస్తున్నారు.
శుక్రవారం సాయంత్రానికి దిల్లీ సరిహద్దులకు దాదాపు 50 వేల మంది రైతులు చేరుకుంటారని సంయుక్త్ కిసాన్ మోర్చా, కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ చెప్పాయి.
మెట్రో సేవలకు అంతరాయం
రైతుల నిరసన ప్రదర్శనలతో తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల శుక్రవారం దిల్లీ శివార్లలోని నోయిడా, గురుగ్రామ్ వైపు వెళ్లే మెట్రో సేవలకు అంతరాయం కలగనుంది.
దిల్లీ నుంచి వెళ్లే ప్రయాణికుల ఎన్సీఆర్ స్టేషన్ల వరకే వెళ్లగలరు. కానీ అక్కడి నుంచి దిల్లీకి రావడం కుదరదు..
దిల్లీ పోలీసుల సూచనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని డీఎంఆర్సీ చెప్పింది. తదుపరి ఆదేశాల వరకూ ఇదికొన సాగుతుందని తెలిపింది. గురువారం కూడా మెట్రో సేవలు ఎన్సీఆర్ వరకే నడిచాయి.

ఫొటో సోర్స్, Getty Images
చర్చలకు మేం సిద్ధం- వ్యవసాయ మంత్రి
రైతుల సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వార్తా ఏజెన్సీ ఏఎన్ఐకి చెప్పారు.
"కొత్త చట్టం అవసరం ఉంది, ఈ చట్టం రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. పంజాబ్ రైతు సోదరులకు ఏర్పడిన అపోహలను దూరం చేసేందుకు మంత్రుల స్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. నేను కూడా రైతు సంఘాలతో మాట్లాడాను. పరిష్కారం లభించకపోతే, డిసెంబర్ 3న మరోసారి చర్చలు జరుపుతాం. ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుంది. అందుకే, ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందనే విషయాన్ని నేను రైతులకు చెప్పాలనుకుంటున్నా. వారు తమ నిరసనలు వాయిదా వేసుకోవాలి" అన్నారు.
బీజేపీపై అకాలీదళ్ సహా విపక్షాల దాడి
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో మిత్రపక్షమైన అకాలీదళ్ గురువారాన్ని రైతుల పట్ల 26/11 దాడి రోజుగా వర్ణించింది.
రైతుల పట్ల హరియాణా ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించింది.
అది ట్విటర్‌లో "ఈరోజు పంజాబ్‌కు 26/11 . ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన ప్రదర్శన చేసే హక్కును అణచివేయడాన్ని మనం చూస్తున్నాం. హరియాణా ప్రభుత్వం చర్యలను అకాలీదళ్ ఖండిస్తోంది. కేంద్రం, హరియాణా ప్రభుత్వం రైతుల శాంతిపూర్వక నిరసనలను అణచివేయాలని చూస్తున్నాయి" అని పెట్టింది.
మరో ట్వీట్‌లో "నీళ్లు చిమ్మి హక్కుల కోసం పంజాబ్ రైతులు చేస్తున్న పోరాటాన్ని అణచివేయలేరు. దానివల్ల ప్రతిఘటన మరింత పెరుగుతుంది" అంది.
సుఖ్‌బీర్ సింగ్ బాదల్ గురువారం పంజాబ్ రైతులకు అండగా నిలవాలని హరియాణా రైతులకు అపీల్ చేశారు.
"రైతులు ఏ పార్టీ జెండా కిందా నిరసనలు చేయాలనుకోవడం లేదు. ఈ ఆందోళనల్లో అన్ని పార్టీల రైతులూ ఉన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలకు రైతులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ బీభత్సం-అఖిలేష్
మరోవైపు "నిరసనలు చేస్తున్న రైతుల పట్ల జరుగుతోంది తప్పని, కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాయలేద"ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా రైతులపై హరియాణా ప్రభుత్వం తీరును 'ప్రభుత్వ బీభత్సం'గా వర్ణించారు.
ఆయన తన ట్విటర్‌లో "రాజ్యాంగ దినోత్సవం రోజున శాంతిపూర్వక నిరసన అనే రాజ్యాంగ హక్కుపై ఘోరంగా దాడి జరిగింది. బీజేపీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులు 'ప్రభుత్వ బీభత్సాని'కి అత్యంత భయంకరమైన రూపం" అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"వినాశకరమైన ప్రభుత్వ వ్యవసాయ విధానానికి విరుద్ధంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేసిన అన్నదాతలపై బీజేపీ ప్రభుత్వం టియర్ గ్యాస్, వాటర్ కానన్ లాంటి హింసాత్మక మార్గాలను ఉపయోగిస్తోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంపన్నుల పక్షాన ఉండే బీజేపీకి పేద రైతు బాధెలా తెలుస్తుంది" అన్నారు.
అటు రైతులపై వాటర్ కానన్లు ఉపయోగించడం, వారిపై టియర్ గ్యాస్ వదలడం బీజేపీ రైతు వ్యతిరేక వైఖరిని బయటపెట్టిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.
కేంద్ర ప్రభుత్వ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు గురువారం చలో దిల్లీకి పిలుపునిచ్చాయి.
పంజాబ్ నుంది దిల్లీ వైపు వస్తున్న రైతులను హరియాణా సరిహద్దుల్లో ఆపేశారు. వారి దారిలో క్రేన్లు, ట్రక్కులు పెట్టారు. ఈ మార్చ్ అడ్డుకోవడంతో అది హింసాత్మకంగా మారింది.
ఇవి కూడా చదవండి:
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- తెలంగాణలో నియంత్రిత సాగుపై రైతులు ఏమంటున్నారు
- పొగాకు వదిలి తీపి పంట వైపు మళ్లిన రైతులు.. లాభాల దిశగా పయనం
- BBC SPECIAL: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల పిల్లలకు తల్లి ఒడి లాంటి బడి 'శాంతివన్'
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























