Cyclone Nivar: ఆంధ్రప్రదేశ్‌లోని ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చు

చెన్నైలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, చెన్నైలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు
ప్రచురణ

నివర్ తుపాను మంగళవారం రాత్రి తీరం దాటింది. తమిళనాడులోని కోస్తా ప్రాంతాల్లో కుండ పోత వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

తుపాను తీరం దాటుతున్న సమయంలో గంటకు 120 కి.మీ.ల వేగంతో గాలులు వీచాయని, అయితే తుపాను క్రమంగా బలహీనపడుతూ ‘తీవ్ర తుపాను’గా మారిందని భారత వాతావరణశాఖ తెలిపింది.

నివర్‌ను మొదట్లో ‘అతి తీవ్ర తుపాను’గా అధికారులు వర్గీకరించారు. ఉత్తరంగా కదులుతున్న కొద్దీ ఈ తుపాను మరింత బలహీనపడుతుందని వారు అంటున్నారు.

తుపాను ముప్పును దృష్టిలోపెట్టుకుని లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వేల మంది జనాన్ని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.

తమిళనాడు, పుదుచ్చేరిల్లోని తీర ప్రాంతాల్లో బుధవారం రాత్రి 11.30 నుంచి 2.30 మధ్యలో తుపాను తీరం దాటినట్లు ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.

వర్షం నీరు

అతిభారీ వర్షాలు పడొచ్చు

ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ, యానాంలలో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, చిత్తూరు: వరద ఉద్ధృతి పెరగడంతో వాగులో చిక్కుకున్న ముగ్గురు రైతులు

తమిళనాడులో...

భారీ వర్షాల కారణంగా తమిళనాడులో, ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలో కొన్ని ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయి.

గోడ కూలి మీద పడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పదుల సంఖ్యలో రైళ్లు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విపత్తు నిర్వహణ సిబ్బందిని మోహరించారు. మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న దాదాపు 1.75 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించినట్లు తమిళనాడు మంత్రి ఆర్‌బీ ఉదయకుమార్ తెలిపారు. అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసేవారికి మినహా మిగతావాళ్లందరికీ బుధ, గురువారాలను సెలవు దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది.

తుపాను పరిస్థితిపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో తాను మాట్లాడానని, కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం చేస్తామని భరోసా కల్పించానని ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో తెలిపారు.

2015లో చెన్నైలో వచ్చిన వరదలు తీవ్ర నష్టం కలిగించిన సంగతి తెలిసిందే.

నివర్ తుపాను

ఫొటో సోర్స్, Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో...

నివర్ తుపాను ప్రభావంతో చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు పట్టణంలో రోడ్లు జలమయం అయ్యాయి. సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు, కోవూరు, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో కొన్ని చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వరదయ్యపాలెంలో అరుణా నది, పాముల కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సంతావేలూరు, వరదయ్యపాలెం మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. గోగర్బం జలాశయం నిండటంతో, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అరణియర్ ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వస్తుండటంతో, నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

తిరుమల మాడ వీధులు వర్షం నీటితో నిండిపోయాయి. ఆలయం ముందు నీరు ప్రవహిస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. సత్యవేడులోని పలు మండలాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రేణిగుంట దగ్గర మల్లెమడుగు వాగు వరద ఉదృతిలో ముగ్గురు రైతులు కొట్టుకుపోయి చెట్టును పట్టుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని కాపాడందుకు రక్షణ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి.

తీర ప్రాంతాల్లో మత్స్య కార్మికులకు హెచ్చరికలు జారీ అయ్యాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తీర ప్రాంతాల్లో మత్స్య కార్మికులకు హెచ్చరికలు జారీ అయ్యాయి

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నడిచే ఏడు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిలిపివేసింది. మరో 8 సర్వీసులను దారి మళ్లించింది.

హైదరాబాద్-తాంబరం, మధురై- బికనూరు, చెన్నై సెంట్రల్-సంత్రగచి మధ్య రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.

చెన్నై, తిరుపతి, రేణిగుంట, పాకాల వైపు నడిచే రైలు సర్వీసులకు అంతరాయం కలిగిందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

విజయవాడ-చెన్నై ఇండిగో, విజయవాడ -బెంగళూరు స్పైస్ జెట్, విజయవాడ- హైదరాబాద్ ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.

బంగాళాఖాతంలో ఈ వారం మరో రెండు తుపానులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏపీలో నివర్ తుపాను ప్రభావం

తుపాను ప్రభావంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష

నివర్‌ తుపాను ప్రభావంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం, దీనివల్ల కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ఆయనకు వివరాలు అందించారు.

చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, అలాగే కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు ప్రారంభం అయ్యానన్నారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ముఖ్యమంత్రికి తెలిపారు.

అక్కడక్కడా పంటలు నీటమునిగిన ఘటనలు వచ్చాయని, వర్షాలు తగ్గగానే నష్టం మదింపు కార్యక్రమాలు చేపడతామన్నారు. రేణిగుంటలో మల్లెమడుగు రిజర్వాయర్‌ సమీపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని సహాయక చర్యలూ తీసుకోవాలని జగన్ అధికారులను కోరారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాకుతో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)